Animal OTT Review: నాన్నంటే పిచ్చి.. భార్యపై రాక్షసత్వం!

Animal Ranbir Kapoor
Animal OTT Review.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మండన్న జంటగా నటించిన సినిమా ‘యానిమల్’.!
అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు కదా, అందుకే, ‘యానిమల్’ సినిమాని థియేటర్‌లో చూసేటప్పుడు, ఓ రకమైన మైండ్ సెట్ వుంటుంది.!
ఎంత ధనవంతుడైతే మాత్రం, కాలేజీలోకి గన్ తీసుకెళ్ళి విద్యార్థుల్ని బెదిరించేస్తాడా.? అదీ చిన్న వయసులో.! అంత పెద్ద ఘటన జరిగితే, పోలీసులు కిమ్మనరా.?
ఈ డౌట్ ఇప్పటికీ నన్ను అలా వేధిస్తూనే వుంది.! హీరో క్యారెక్టరైజేషన్ అలా వుంది.. అని సరిపెట్టుకోలేకపోతున్నాను ఇంకా.!
సినిమా వసూళ్ళను బాగానే సాధించిందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ‘నిర్మాత ఎప్పుడూ నిజాలు చెప్పడు’ అని ఈ మధ్యనే ఓ టాలీవుడ్ నిర్మాత సెలవిచ్చాడు గనుక, సక్సెస్ అలాగే ఫెయిల్యూర్.. ఇవన్నీ బూటకం.. అని తేలిపోయింది.
Animal OTT Review.. పిల్లలూ పెద్దలూ జర జాగ్రత్త..
ఇక, ‘యానిమల్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.! ఎనిమిదో తరగతి చదువుతున్న కుర్రాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న తన అక్కతో కలిసి ఈ సినిమాని చూశాడట.. టీవీలో.!
అది కూడా, సినిమా ఓటీటీలోకి రాకముందే.! ‘సినిమా బావుంది అంకుల్..’ అని సెలవిచ్చాడు.! థియేటర్లో చూశాను కదా, పిల్లలు చూడకూడని సినిమా కదా.? బావుందంటాడేంటి.? అనే డౌట్ నాకొచ్చింది.

రిస్క్ చేయదలచుకోలేదు.. నా పిల్లల్ని సినిమాకి దూరంగా వుంచాను. వాళ్ళకి సినిమా కథ తెలుసు.. ఫ్రెండ్స్ చెప్పారట. వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
సతీమణితో కలిసి సినిమా చూద్దామని టైమ్ ఫిక్స్ చేసుకున్నాను.! సినిమా మొదలైంది.. బాగానే వుంది కదా.. అనుకుంది నా శ్రీమతి.!
కాస్పేపటికి తెరపై హీరో ‘అతి’ మొదలైంది.. అంతే, ఇదేం సినిమా.? అనేసింది నా సతీమణి.! తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం మరీ ఇంత పైశాచికత్వంతో కూడి వుంటుందా.? అనేంత అసహ్యం వేసింది.. ఆమెకి.! అదే పరిస్థితి నాక్కూడా.!
Animal OTT Review.. పెళ్ళాం అయినా.. అక్క అయినా..
హీరోయిన్ వీపు మీద గాయం చేసి హీరో పైశాచికానందం పొందడమేంటో.! గుండె బలహీన పడి, ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల్సిన వ్యక్తి అలా అరుస్తాడేంటో.!
అక్కతో, ‘యూరిన్’ గురించి మాట్లాడే తమ్ముడు.! ఏ కాలంలో వున్నాం మనం.? ఎంత ‘యానిమల్’ అనే పేరుని సినిమాకి పెడితే మాత్రం, ఇంత దారుణంగా జంతు ప్రవృత్తి హీరోకి ఆపాదించడమా.?

‘నిన్ను మాత్రం మోసం చేయను..’ అన్నాడు హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో.! తండ్రిని చంపడానికి ఎవరు స్కెచ్ వేశారో తెలుసుకోవడానికి, హీరోయిన్‌ని మోసం చేసి, ఇంకో భామతో కొన్ని రోజులపాటు పడక సుఖం పంచుకోవడం మోసం కాదా.?
అది జీర్ణించుకోలేని హీరోయిన్, హీరోతో గొడవపడి.. ఆ తర్వాత సర్దుకుపోయి, పడక పంచి.. చచ్చిపోవడానికి వెళుతున్న భర్తని అయిష్టంగా సాగనంపుతుంది.
నో పోలీస్.. వాట్ ఈజ్ దిస్ వంగా.!
పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో చచ్చిపోతుంటారు.. నో పోలీస్.! ‘సలార్’ సినిమా తరహాలో, ఏదో జాంబీల్యాండ్‌లో కథ జరుగుతున్నట్లుగా ‘యానిమల్’ సినిమా తీసి వుంటే, సరిపెట్టుకోవచ్చు.
పిచ్చి అంటార్రా దీన్ని.. అని మధ్య మధ్యలో నేను, నా శ్రీమతి పలుసార్లు అనుకోవాల్సి వచ్చింది.
నిజానికి, సందీప్ రెడ్డి వంగా అంటే కాస్తో కూస్తో అభిమానమే.! రియల్ లైఫ్‌లో సందీప్ రెడ్డి వంగా వేరు.. దర్శకుడిగా తెరపై అతని ఆలోచనలు వేరు.!

కండోమ్ ప్రస్తావనలు.. అండర్‌వేర్ లొల్లి.. ఇవన్నీ కమర్షియల్ అంశాలా.? ఇంకో అమ్మాయితో పక్క పంచుకున్న మొగుడ్ని, ‘కండోమ్ వేసుకునే చేశావా.?’ అని భార్య అడగటం ఏదైతే వుందో.. పిచ్చి పీక్స్ అంతే.!
రాసుకుంటూ పోతే, ‘యానిమల్’ సినిమా కంటే పెద్ద కథే అవుతుందిది.! యానిమల్ పార్క్ రాబోతోందిట.! ఈసారి టార్చర్ అంతకు మించి వుండబోతోందన్నమాట.!
జాంబీల్యాడ్‌లో తీసుకోరాదా.?
భారతదేశంలోనో, ఇంకో దేశంలోనో కాకుండా.. ‘జాంబీల్యాండ్’లో కథ జరిగినట్లుగా చూపించడానికి ఈసారైనా ప్రయత్నించు సందీప్.! జస్ట్ ఇదొక ఉచిత సలహా మాత్రమే.!
తండ్రి ఆదరణ దక్కని కుర్రాడు ఎంతలా విలవిల్లాడిపోతాడో హృద్యంగా చూపించాడు సందీప్ రెడ్డి వంగా.! అంత ఎమోషనల్ కనెక్టివిటీ వున్న సందీప్ నుంచి, ఇంత జుగుప్సాకరమైన సినిమా ఎలా వచ్చిందబ్బా.?

తియ్యటి బంధం చుట్టూ అలముకున్న విషపూరిత సన్నివేశాల సమాహారమే ‘యానిమల్’.! చూడొద్దు.. అని ఇప్పుడు చెప్పడం దండగ.! కానీ, అత్యంత హానికరం ఈ సినిమా.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
చివరగా.. విలన్‌ని మామూలుగానే చంపేశాడు.! తండ్రిని మానసికంగా వేధించాడు.!
తల్లినీ, చెల్లినీ ఏడిపించాడు.! భార్యకి నరకాన్ని చూపించేశాడు.!
హీరోయిజం కాదిది, యానిమల్ శాడిజం.!
Mudra369
‘యానిమల్’ మాత్రమే కాదు, ‘అర్జున్ రెడ్డి’ కూడా నాకు నచ్చలేదు.! కానీ, సందీప్ రెడ్డి వంగా అంటే నాక్కూడా అభిమానమే.! దర్శకుడిగా అతనికి దక్కిన స్టార్‌డమ్.. ఆఫ్ స్క్రీన్ ఆయన వ్యవహారశైలి.. ఇవన్నీ నచ్చుతాయ్.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విషయం వున్నోడు.! ఆ మేకింగ్ స్టైల్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ మీద పట్టు.. కొన్ని సన్నివేశాల్లో కన్విక్షన్.. ఇవన్నీ బావుంటాయ్. కానీ, ఎందుకు ఆ ‘జంతు ప్రవృత్తి’ని తెరపై చూపించాలనుకుంటాడో ఏమో.!
