బిగ్‌ బిగ్గర్‌ బిగ్గెస్ట్‌.. విజేత కౌశల్‌

 బిగ్‌ బిగ్గర్‌ బిగ్గెస్ట్‌.. విజేత కౌశల్‌

కౌశల్‌ ఆర్మీ.. సోషల్‌ మీడియాని ఇప్పుడు ఈ ఆర్మీ ఓ ఊపు ఊపేస్తోంది. అసలు ఎవరు ఈ కౌశల్‌.? అని ప్రశ్నించుకుంటే, పలు తెలుగు సినిమాల్లో నటించిన ఓ యంగ్‌ స్టర్‌ గుర్తుకొస్తాడు. చేసింది కొన్ని సినిమాలే. వాటిల్లోనూ ఆయన చిన్న చిన్న పాత్రలే పోషించాడు. అడపా దడపా బుల్లితెరపైనా కన్పించాడు. తెలుగు బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2 కోసం ఎంపిక చేసిన హౌస్‌ మేట్స్‌లో కౌశల్‌ కూడా ఒకరన్న వార్త వినగానే చాలామంది, ఎవరీ కౌశల్‌? అని ప్రశ్నించుకున్నారు.

మొదటి రోజు నుంచే సత్తా చాటాడు

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ రెండులో మొదటి నుంచీ కౌశల్‌ (Kaushal Manda) తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చాడు. టాస్క్‌ల విషయంలో కావొచ్చు, హౌస్‌కి సంబంధించిన విషయాలు కావొచ్చు, హౌస్‌ మేట్స్‌తో వ్యవహరించే తీరు విషయంలో కావొచ్చు.. అన్ని విషయాల్లోనూ అతను చాలా చాలా ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను ఇతర హౌస్‌ మేట్స్‌ సహించలేకపోయారు.. ఒకరిద్దరు తప్ప. బాబు గోగినేని (Babu Gogineni) లాంటి వ్యక్తులు కూడా కౌశల్‌ని తక్కువ అంచనా వేశారు, అవమానించారు కూడా. అయినా కౌశల్‌, తాను వచ్చింది రియాల్టీ షోలో విజయం సాధించడానికేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు.

రియాల్టీ షోలో రిలేషన్స్‌ ఏంటి?

అక్క, చెల్లి, తమ్ముడు.. వంటి రిలేషన్స్‌ బిగ్‌ హౌస్‌లో కన్పిస్తున్నాయి. అయితే అవన్నీ తాత్కాలికమే. బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ (Bigg Boss Telugu Season 2) వన్‌ చూశాం. అక్కడా ఇలాంటివి కొన్ని జరిగాయి, అయితే.. ఈ స్థాయిలో కాదు. ఆ షో ముగిశాక ఎవరి దారి వారిదే. అది తెలిసీ, షోలో కొందరు ఓవరాక్షన్‌ చేశారు. అది బెడిసికొట్టింది కూడా. అప్పటికప్పుడు ప్రదర్శించే ‘అభిమానం’లో అర్థమే లేదని బలంగా నమ్మే కౌశల్‌, తన ‘ఆట’లో తాను మునిగిపోయాడు. అదే అతనికి చాలా పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. ఎప్పుడైతే కౌశల్‌ (Kaushal Army) స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని మిగతా హౌస్‌ మేట్స్‌ ఓ అవగాహనకు వచ్చేశారో.. ఆ తర్వాత సీన్‌ మారిపోయింది.

ఒకే ఒక్కడు కౌశల్‌

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ టూ విషయానికొస్తే, మిగతా కంటెస్టెంట్స్‌ అంతా ఒక వైపు, కౌశల్‌ ఇంకో వైపు అని చెప్పక తప్పదు. నూతన్‌ నాయుడు మాత్రమే కౌశల్‌ విషయంలో కొంచెం పాజిటివ్‌గా కన్పించాడు. ఓ దశలో నూతన్‌ (Nuthan Naidu) కూడా, కౌశల్‌కి క్లాసులు తీసేసుకున్నాడు. అయితే కౌశల్‌ ఆటిట్యూడ్‌ బుల్లితెర వీక్షకుల్లో చాలామందిని మెప్పించింది. రియాల్టీ షోలో ‘ఆట’ ఎలా ఆడాలో తెలుసుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నిరూపించాడంటూ ఆయనకు పెద్దయెత్తున అభిమానులు పుట్టుకొచ్చేశారు.

డబ్బులిస్తే వచ్చేది అభిమానమే కాదు

వందలు, వేలు, లక్షల సంఖ్యలో ఇప్పుడు కౌశల్‌కి అభిమానులున్నారు. దేశ విదేశాల్లోనూ కౌశల్‌ కోసం అభిమానులు, అభిమాన సంఘాలూ పుట్టుకొస్తున్నాయి. ఆయన బిగ్‌ హౌస్‌లోనే వున్నాడు. బయట ఏం జరుగుతుందో ఆయనకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. బయట పరిస్థితుల్ని ఆయన కంట్రోల్‌ చేయలేడు కూడా. ఓ స్టార్‌ హీరోకి వున్నంత అభిమానానికి మించి, కౌశల్‌ (Kaushal Mania) అభిమానుల్ని సంపాదించుకున్నాడనడం అతిశయోక్తి కాదేమో. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియనివాళ్ళు హౌస్‌లో చాలామంది వున్నా, కుట్రలు.. కుయుక్తులకు పాల్పడేవారు తనను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నా.. కౌశల్‌ సంయమనం కోల్పోలేదు.

ఆల్రెడీ కౌశల్‌ గెలిచేశాడు

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ టూ విజేత ఎవరన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇప్పటికే కౌశల్‌ (Kaushal) గెలిచేశాడు. బిగ్‌ హౌస్‌ని (Big House) మించి, రియాల్టీ షోని మించి.. లక్షలాది అభిమానుల్ని గెలుచుకోవడమంటే చిన్న విషయం కాదు. సినిమాలతో సాధించలేనిది, టీవీ సీరియళ్ళతోనూ సాధించలేనిది.. ఓ రియాల్టీ షోలో తన వ్యక్తిత్వంతో కౌశల్‌ గెలిచేసుకున్నాడు. నిజానికి బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు సీజన్‌ టూ ఇంత విజయం సాధించిందంటే దానిక్కారణం నూటికి నూరుపాళ్ళూ కౌశల్‌ మాత్రమే.

Digiqole Ad

Related post

Leave a Reply