Disaster.. మన సినిమాకి వేరే శతృవు అక్కర్లేదు.!
Disaster Telugu Cinema.. ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మహేష్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది ‘సర్కారు వారి పాట’. ఇంతకీ, ఈ సినిమా కథా కమామిషు ఏంటి.?
‘సర్కారు వారి పాట’ సినిమా రివ్యూ రాయడానికి ముందు, ఈ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ‘డిజాస్టర్ ఎస్‌విపి’ గురించి ఓ ప్రత్యేకమైన ఆర్టికల్ రాయాలనిపించింది.
నిజానికి, ప్రతి పెద్ద సినిమా రిలీజ్ ముందు, ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయ్. అప్పుడూ రాయాలని అనిపించినా, ఏవో కారణాల వల్ల లైట్ తీసుకోవాల్సి వచ్చింది.
ఈసారి మాత్రం, తెలుగు సినిమాని.. తెలుగు సినీ అభిమానులే చంపేస్తోంటే.. ఇంకాస్త ఎక్కువ బాధ కలిగి.. ఇదిగో ఇలా ‘రాత’ మొదలు పెట్టాల్సి వస్తోంది.
అరవ పైత్యం.. అంతకన్నా తెలుగునాట దారుణం.!
తమిళనాట స్టార్ వార్ గురించి కొత్తగా చెప్పడానికేమీ లేదు. అత్యంత జుగుప్సాకరమైన యుద్ధమది. ఆ పైత్యం, తెలుగు నేలకు ఎప్పుడో పాకేసింది. అయితే, అదిప్పుడు ఇంకా ఎక్కువగా వెర్రి తలలు వేసేస్తోంది.
‘అజ్ఞాతవాసి’ (Agyatavasi) సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం. ‘వకీల్ సాబ్’ (Vakeelsaab) సినిమా సమయానికి ఈ పైత్యం బాగా పెరిగిపోయింది.
‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమానీ వెంటాడింది. ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) కావొచ్చు, ‘ఆచార్య’ (Acharya) కావొచ్చు, ‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) కావొచ్చు.. ఇవేవీ ఆ ‘రొచ్చు’ని తప్పించుకోలేకపోయాయి.
చిత్రమేంటంటే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపైనా నెగెటివిటీ తప్పలేదు. డిజాస్టర్ వకీల్ సాబ్.. డిజాస్టర్ భీమ్లానాయక్.. డిజాస్టర్ రాధేశ్యామ్.. డిజాస్టర్ ఆచార్య.. డిజాస్టర్ సర్కారు వారి పాట.!
Disaster Telugu Cinema.. డిజాస్టర్ పైత్యం.!
అసలేమొస్తుంది, ‘డిజాస్టర్’ పేరుతో ఆయా సినిమాలపై నెగెటివ్ ట్రెండింగ్ చేస్తే. మన సినిమాల గురించి బాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు గొప్పగా మాట్లాడుకుంటోంటే, మన సినిమాల్ని మనమే ‘డిజాస్టర్’ అంటున్నాం.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై అంతలా కక్ష పెంచుకున్నారెందుకు.?
హీరోల దురభిమానుల దుశ్చర్య ఇది. ఏ హీరో అభిమాని కూడా, ఇంకో హీరో సినిమా డిజాస్టర్ అవ్వాలని కోరుకోడు. అలా కోరుకునే వాళ్ళసలు సినిమాలకు అభిమానులే కారు.!
హీరోలంతా కలిసే వుంటారు.. కొందరు దురభిమానుల మధ్యనే ఈ దురదృష్టకర పంచాయితీ.! ఈ రోగానికి వైద్య చికిత్స లేదంతే.!