Gangs Of Godavari Review : విశ్వక్ సేన్ ‘విశ్వరూపమే’నా.!?
Gangs Of Godavari Review.. మాస్ కా దాస్ అంటూ.. మాస్‌ని తన పేరులోనే పెట్టుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు, నిర్మాత.. విశ్వక్ సేన్.
అయితే, ఈ సారి తాను నటించిన సినిమాలన్నింటికీ భిన్నంగా పక్కా మాస్ అనేలా చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అనేక వాయిదాల పర్వం తర్వాత ధియేటర్లలోకి వచ్చిన సినిమా ఇది.
అంచనాలు బాగానే వున్నాయ్. ప్రమోషన్లూ బాగానే చేశారు. హిట్ బ్యానర్ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందింది. ప్రీరిలీజ్ టాక్ కూడా బాగానే వచ్చింది.
ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ హిట్టా.? ఫట్టా.? అనేది తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.
Gangs Of Godavari Review.. కథేంటంటే
లంకల రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్ సేన్) పనీ పాటా లేకుండా తిరిగే ఓ సాదారణ అనాధ కుర్రాడు. పెద్ద పెద్ద కలలు కంటుంటాడు. గొప్పవాడవ్వాలంటే సిగ్గొదిలేయాలన్న నినాదంతో తిరుగుతుంటాడు.
ఈ క్రమంలోనే కొన్ని దొంగతనాలు చేస్తుంటాడు. అలా ఓ పెద్ద దొంగతనం చేసి ఓ మంచి డీలర్ షిప్ కొట్టేస్తాడు. క్రమంగా ఊరి పెద్ద ఎమ్మెల్యే అయిన దొరస్వామి (గోపరాజు రమణ) పంచన చేరతాడు.
మరోవైపు దొరస్వామికి ప్రత్యర్ధి అయిన నానాజీ (నాజర్) కూతురు బుజ్జి (నేహా శెట్టి)తో లవ్‌లో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా మామగారు నానాజీ సాయంతో దొరస్వామి మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు.

అనుకోకుండా దక్కిన అధికారంతో అసలు సిసలు కథ మొదలవుతుంది రత్నాకర్‌కి. అధికారం చేపట్టాకా అనుకోని చాలా సమస్యల్లో ఇరుక్కుంటాడు.
మరి ఈ సమస్యల నుంచి రత్నాకర్ ఎలా బయట పడ్డాడు.? తాను కలలు కన్న జీవితాన్ని దక్కించుకున్నాకా రత్నాకర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.? ఆ జీవితంలో హ్యాపీగా వుండగలిగాడా.? తెలియాలంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ధియేటర్లలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
కరెక్ట్‌గా చెప్పాలంటే, విశ్వక్ సేన్‌కి ఈ పాత్ర కత్తి మీద సామే. కానీ, ఆ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. ప్రాణం పోశాడు. ప్రేక్షకుల్ని తన పాత్రతో లీనమయ్యేలా చేశాడు.
యాక్షన్ సీన్లలో చెలరేగిపోయాడు. ఎమోషన్లతో కట్టి పడేశాడు విశ్వక్ సేన్ . హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి అందంగా కనిపిస్తూనే పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్రలో నేచురల్ పర్‌ఫామెన్స్ ఇచ్చింది.
అంజలి వేశ్యగా, మరోవైపు రత్నాకర్‌కి హెల్పింగ్ వుండే పాత్రలో స్టన్నింగ్‌గా సర్‌ప్రైజింగ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.
గోపరాజు ఇంతవరకూ కామెడీ విలన్ రోల్స్‌తోనే ఆకట్టుకున్నాడు. కానీ, ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ వపర్ ఫుల్ విలనిజం ప్రదర్శించాడు.
నాజర్ తనుకున్న తక్కువ నిడివి పాత్రలోనే అనుభవాన్నంతా రంగరించి నటించాడు. హైపర్ ఆది తనకు కొట్టిన పిండి అయిన హీరో పక్కనుండే పాత్రలో తన వంతు పూర్తి న్యాయం చేశాడు.
మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహనరంగ’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణ చైతన్య. బేసిగ్గా రైటర్ అయ్యేసరికి మంచి డైలాగులు రాసుకున్నాడు.
తనలోని డైరెక్టర్‌ని రైటర్ డామినేట్ చేశాడనడానికి కొన్ని కొన్ని డైలాగులు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.
అలాగే, పాత కథే అయినా గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు కృష్ణ చైతన్య.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. అలాగే, పడవలో డీల్ సెట్ చేసిన సన్నివేశం బాగుంది.
పక్కా మాస్ కథాంశమే అయినా ఎక్కడా ఫన్ మిస్ కానివ్వకుండా చూసుకోవడమే సినిమా బోర్ కొట్టించకుండా వుండడానికి సాయ పడింది.
ఇక, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్. విశ్వక్ సేన్ రేంజ్‌కి మించి ఖర్చు చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయ్. ఎడిటర్ నూలి పనితనం బాగుంది. అయితే, సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ విషయానికి వస్తే, పాటలు సో సోగా వున్నప్పటికీ, పతాక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ఓవరాల్‌గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి టెక్నికల్ గ్యాంగ్ వర్క్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్ పర్‌ఫామెన్స్, ఆకట్టుకున్న డైలాగులు, గోదావరి లంక ప్రాంతం విజువల్స్, హుషారుగా పరిగెత్తించిన ఫస్టాఫ్..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కాస్త స్లో అయిన నెరేషన్, కథలో కొత్తదనం లేకపోవడం..
చివరిగా:
విశ్వక్ సేన్ చెప్పినట్లే.. ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ పక్కా మాస్ పండగే.!