హ్యాపీ అండ్‌ హెల్తీ న్యూ ఇయర్‌.!

 హ్యాపీ అండ్‌ హెల్తీ న్యూ ఇయర్‌.!

మామూలుగా అయితే, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ (Happy and Healthy New Year) అని చెప్పుకుంటాం. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది.

అయితే, అది ‘అత్యవసర వినియోగం’ ప్రాతిపదికన మాత్రమే. ‘వ్యాక్సిన్‌ విషయంలో తొందర వద్దు.. కొత్త మ్యుటేషన్లను చూస్తున్నాం.. వాటిపై వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందో లేదో చెప్పలేం..’ అని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఎలాగోలా వ్యాక్సిన్లను మార్కెటింగ్‌ చేసుకోవడానికి, తయారీ సంస్థలు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది నిజం.? ఏది అబద్ధం.? అన్న విషయాలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఇది. కానీ, తప్పదు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారిక లెక్కల సారాంశం మాత్రమే. ‘మేం కరోనా మరణాల్ని తగ్గించి చూపాం..’ అని ఆయా దేశాల్లో కొందరు మేధావులు వాస్తవాల్ని బయటకు చెప్పేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఏదో సరదాగా ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ (Happy New Year) అని చెప్పేసుకుంటే కుదరదు. 2020 ప్రపంచం ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితిని చూసింది. 2021లో దాన్నుంచి ఉపశమనం లభించాలంటే, ‘హ్యాపీ న్యూ ఇయర్‌ అనుకుంటే సరిపోదు.. హెల్తీ న్యూ ఇయర్‌’ అని కూడా అనుకోవాలి.. అందుకు తగ్గట్టుగా ముందడుగు వేయాలి.

మాస్క్‌ వేసుకోవడం ఇకపై జీవిత కాలపు అలవాటుగా మార్చుకోవాల్సిందేనని ఓ ప్రముఖ వైద్యుడు ఇటీవల వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘వ్యాక్సిన్‌ వచ్చినా, మాస్క్‌ తప్పనిసరి..’ అని భారత ప్రధాని రేంద్ర మోడీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

సో, మన ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు, మనం తీసుకునే జాగ్రత్త కారణంగా మనతోపాటు, ఇతరుల ఆరోగ్యాన్నీ కాపాడే బాధ్యత మన చేతుల్లోనే వుందిప్పుడు. అందుకే, మాస్క్‌ ధరించాలి.. చేతుల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలి. అవసరమైతే తప్ప, బయట తిరిగే వ్యవహారాలు తగ్గించాలి.

గుంపులు గుంపులుగా ‘పండగలు’ చేసుకోవాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. గుర్తు పెట్టుకోండి.. వ్యాక్సిన్‌ వచ్చినాసరే, మాస్క్‌ ధరించాల్సిన అవసరం ఖచ్చితంగా వుంటుంది. వ్యాక్సిన్‌ వేయించుకున్నంత మాత్రాన ‘మేం సేఫ్‌’ అని ఎవరైనా అనుకుంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు.

అయినా, భారతదేశంలో ఇంతవరకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. అప్పుడే, వ్యాక్సిన్‌ వచ్చేసిందనుకుంటూ.. చాలామంది విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. భయాల్ని పక్కన పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకుంటే.. హ్యాపీ అండ్‌ హెల్తీ న్యూ ఇయర్‌గా 2021 (Happy and Healthy New Year) మారుతుంది. లేదంటే, అంతే సంగతులు. స్టే సేఫ్‌.!

Digiqole Ad

Related post