సమీక్ష: నాని, మృణాల్ ‘హాయ్ నాన్న’లో అన్నీ వున్నాగానీ.!

 సమీక్ష: నాని, మృణాల్ ‘హాయ్ నాన్న’లో అన్నీ వున్నాగానీ.!

Hi Nanna Review

Hi Nanna Review.. నాని, మృనాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ‘హాయ్’ నాన్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవ్ సినిమా విడుదలకు ముందు.!

ఇంతకీ, సినిమా విడుదలయ్యాక ఆ అంచనాల్ని ‘హాయ్’ నాన్న అందుకుందా.? అసలేంటి కథ.? తెలుసుకుందాం పదండిక.!

ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ విరాజ్.. ఆయనకో కుమార్తె మహి.! కూతురు మహి అంటే, తండ్రి విరాజ్‌కి బోల్డంత ప్రేమ.! ఈ ప్రేమ ప్రతి నాన్నకీ తన కుమార్తె మీద వుంటుంది.

అయితే, ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతుంటుంది మహి.! ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాడు. ఇంతకీ, మహి తల్లి ఎవరు.? మహికి, ఆమె తల్లి గురించి ఎలాంటి వివరాలూ తెలియకుండా ఏవేవో కథలు ఎందుకు చెబుతుంటాడు విరాజ్.?

అన్నట్టు, తన తండ్రి తనకు తన తల్లి గురించి చెప్పకపోవడంతో ఇంట్లోంచి పారిపోతుంది మహి. ఆమెను ఓ ప్రమాదం నుంచి కాపాడుతుంది యష్న.

మహిని వెతుక్కుంటూ వచ్చిన విరాజ్‌కి యష్నతో వున్న మహి తారసపడుతుంది. యష్న సమక్షంలో మహికి, అసలు విషయం చెప్పడం మొదలు పెడతాడు విరాజ్. అదీ మహి తల్లి గురించి.

ఏంటా అసలు విషయం.? అది తెరపై చూడాల్సిందే.

Hi Nanna Review.. నటీ నటులు ఒదిగిపోయారు..

విరాజ్ పాత్రలో నాని ఒదిగిపోయాడనడం చిన్నమాటే.! ఎందుకంటే, ఏ పాత్రలో అయినా నాని చాలా చాలా సహజంగా ఒదిగిపోతాడు. అందుకే, నటుడిగా ఇంతెత్తుకి ఎదిగాడు.

ఇక, మృణాల్ ఠాకూర్ కూడా అంతే. ఆమె మంచి నటి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా అంతటా ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్.

చిన్న పిల్లే అయినా చిచ్చర పిడుగు కియారా. తన క్యూట్ చూపులతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది మహి పాత్రలో కియారా.

మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

సాంకేతిక అంశాల విషయానికొస్తే, ప్రతి విభాగం సినిమాకి చక్కగా సహకరించింది. కొత్త దర్శకుడే అయినా, శౌర్యువ్ అస్సలెక్కడా తడబడలేదు.

అయితే, ఎమోషనల్ సీన్స్ కారణంగా కొంత స్లో పేస్‌లో నెరేషన్ సాగుతున్నట్లనిపిస్తుంది అక్కడక్కడా. హీరోయిన్‌తో లవ్ స్టోరీని ఇంకాస్త బలంగా రాసుకుని వుండాల్సింది దర్శకుడు.

సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్టుగా వుంది. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ బావున్నాయి.

డైలాగ్స్ కూడా చాలా బావున్నాయ్. ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాల్లో కత్తెర పదును చూపిస్తే బావుండేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఓకే.! తర్వాతేం జరుగుతుందో ముందే తెలిసిపోవడం ఓ లోటు.

ముందే చెప్పుకున్నట్టు.. అన్నీ బావున్నాయ్.! కానీ, తెలిసిందేగా.. అన్నట్లనిపిస్తుంది చాలా సన్నివేశాలు జరుగుతున్నప్పుడు.

సకుటుంబ సపరివార సమేతంగా..

ఓవరాల్‌గా ‘హాయ్ నాన్న’ సినిమా నటీనటుల కోసం చూడాల్సిందేననిపిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు చూడటం అనేది ఇటీవలి కాలంలో కష్టమవుతోంది. ‘హాయ్ నాన్న’ని అందరూ కలిసి ఎంచక్కా చూసెయ్యొచ్చు.

నిర్మాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బాగా ఖర్చు చేశారు. ఆ ఖర్చంతా తెరపై కనిపిస్తుంది. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు.

ఓటీటీ యుగంలో.. ఇలాంటి సినిమాల్ని థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారా.? కొన్నాళ్ళు ఆగితే ఓటీటీలో చూసేస్తాం కదా.. అనుకునే ప్రేక్షకులు ఎక్కువయ్యారు కాబట్టి.. ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ రన్ గురించి ఇప్పుడే చెప్పలేం.!

Digiqole Ad

Related post