Table of Contents
Janasenani Pawankalyan Ane Nenu.. ఏదో ఆషామాషీగా దక్కిన విజయం కాదు.! వందల కోట్లు, వేల కోట్లతో నడిపిన రాజకీయం అసలే కాదు.!
రాజకీయం అంటే సేవ, బాధ్యత, జవాబుదారీతనం.. అనే మంచి ఆలోచనతో ముందడుగు వేస్తే, దారంతా ముళ్ళబాటే.!
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయం.. ఈ రెండు పడవల ప్రయాణం నిజానికి, చాలా చాలా కష్టమైనది. అన్నయ్య చిరంజీవికి సాధ్యం కానిది, తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు.
తమ్మడిపై అన్న నమ్మకం నిజమైన వేళ..
‘నా వల్ల కాలేదు.. కానీ, నా తమ్ముడు చేసి చూపిస్తాడు.. సాధిస్తాడు..’ అని అప్పట్లో మాజీ కేంద్ర మంత్రి, ‘పద్మ విభూషణుడు’ మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అన్నారో, ఇప్పుడందరికీ అర్థమవుతోంది.

‘నాలుగు పెళ్ళిళ్ళు.. నలుగురు పెళ్ళాలు.. ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు..’ అనే విమర్శల దగ్గర్నుంచి, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు.
పెద్దగా చదువుకోకపోయినా, ఐఏఎస్ అలాగే ఐపీఎస్ స్థాయి అధికారులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేసినవాళ్ళు, మేధావులు.. పవన్ కళ్యాణ్‌తో కలిసి నడవడానికి ఎందుకు ముందుకొచ్చినట్లు.?
Janasenani Pawankalyan Ane Nenu.. పవన్ కళ్యాణ్ అంటే ఇదీ..
అదీ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి.! సోషల్ మీడియాలో పనికిమాలిన కామెంట్లు చేసేవాళ్ళకీ, మీడియా ముందు నోటికొచ్చింది వాగే రాజకీయ నాయకులకీ.. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, సంకల్పం వీడలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్పు కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.
‘ఈయన్ని మనం ఎందుకు కాదనుకున్నాం.?’ అని రాష్ట్ర ప్రజానీకం ఆత్మపరిశీలన చేసుకునేలా చేయగలిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
సమాధానం చెప్పుకోలేక..
టీడీపీ – బీజేపీతో పొత్తు నేపత్యంలో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లకే జనసేన పరిమితమైన దరిమిలా, సొంత పార్టీలోనూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం కష్టమైంది పవన్ కళ్యాణ్‌కి.
ఎన్నికల ప్రచారం అంటే అది ఇంకో యుద్ధమే అయ్యింది జనసేనకి. అన్ని ఆటుపోట్లూ తట్టుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘనవిజయం సాధించింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్తా, పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు. అంతేనా, డిప్యూటీ సీఎం అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ సగర్వంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఒకసారి కాదు, రెండు సార్లు.. ఓ సారి డిప్యూటీ సీఎంగా, ఇంకోసారి శాసనసభలో శాసనసభ్యుడిగా ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’ అనే మాట పవన్ కళ్యాణ్ నోట రావడం.. ఇన్నేళ్ళుగా ఆయన గెలుపు కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది మందికి వెరీ వెరీ స్పెషల్.
రాజకీయం అంటే సేవ.. రాజకీయమంటే బాధ్యత.. అనే మాటకి ఇప్పటికీ కట్టుబడే వున్నారు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.