కల్కి 2898 ఎడి రివ్యూ: ప్రభాస్ వర్సెస్ అమితాబ్.!

 కల్కి 2898 ఎడి రివ్యూ: ప్రభాస్ వర్సెస్ అమితాబ్.!

Kalki 2898 AD Review

Kalki 2898 AD Review.. ప్రభాస్, దీపికా పడుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్.. ఇలా బోల్డంతమంది తారాగణంతో నాగ్ అశ్విన్ ‘కల్కి’ ప్రాజెక్టుని తెరకెక్కించాడు.

రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు అతిథి పాత్రల్లోనూ కనిపించారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని సినిమా కోసం వాడారు.

‘బాహుబలి’తో పోల్చితే, చాలా తక్కువ సమయంలోనే ‘కల్కి’ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ, ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇంతకీ ‘కల్కి’ ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.!

శంబల, కాశీ, కాంప్లెక్స్.. ఈ మూడిటి చుట్టూ కథ తిరుగుతుంది. కాంప్లెక్స్‌కి వెళ్ళాలన్నది భైరవ డ్రీమ్. ఆ కాంప్లెక్స్ అరాచకాల్ని అడ్డుకోవాలన్నది శంబల రెబల్స్ టార్గెట్.!

Kalki 2898 AD Review.. సుప్రీం యాస్కిన్..

అసలు ‘కాంప్లెక్స్’లో ఏం జరుగుతోంది.? సుప్రీం యాస్కిన్ ఎవరు.? ఇంతకీ, ‘కల్కి’ ఎవరు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘కల్కి’ చూడాల్సిందే.

శంబల అనే ప్రాంతాన్ని బాగానే డిజైన్ చేశారు. కాంప్లెక్స్ సంగతి సరే సరి. ఈ భూమ్మీద మొదటి పట్టణం, చివరి పట్టణం.. అంటూ కాశీ గురించి పేర్కొనడమూ ఓకే.!

‘బాహుబలి’తో పోల్చినా, ‘సలార్’తో పోల్చినా, ‘కల్కి’ కోసం తీసుకున్న సమయం తక్కువే. తక్కువ సమయంలో ఔట్ పుట్ మాత్రం బాగానే తీసుకురాగలిగాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకోవాలి.

Mudra369

విజువల్స్ పరంగా వంక పెట్టడానికి పెద్దగా ఏం లేదు. అంత బాగా డిజైన్ చేశారు, అంత బాగా చూపించారు కూడా.! సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. మ్యూజిక్ విషయానికొస్తే, అంచనాలకు తగ్గట్టు లేదు.

కొన్ని సీన్స్‌లో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ విషయానికొస్తే, ఏదో హాలీవుడ్ సినిమాకి తెలుగు డైలాగులు రాసినట్లుందంతే. తెలుగు నేటివిటీ పెద్దగా కనిపించలేదు. ఎందుకిలా జరిగింది.?

ఏమో, ప్రభాస్ గత చిత్రాలు చూస్తే, అందులో తెలుగు నేటివిటీ పూర్తిగా లోపిస్తోందన్న బాధ ప్రబాస్ అభిమానుల్లోనూ కనిపిస్తోందనుకోండి.. అది వేరే చర్చ.

అమితాబ్ హీరోయిజం..

నటీనటుల విషయానికొస్తే, అమితాబ్ బచ్చన్ గురించి ముందుగా చెప్పుకోవాలి. అశ్వద్ధామ క్యారెక్టర్‌కి ఆయన ప్రాణం పోసేశారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో డూప్‌ని విచ్చలవిడిగా వాడేసినా, బాగా మేనేజ్ చేయగలిగారంటే.. అది దర్శకుడితోపాటు, అన్ని విభాగాల గొప్పతనం కూడా. స్వయంగా అమితాబే, యాక్షన్ ఎపిసోడ్స్‌లో చెలరేగిపోయారనిపిస్తుంది.

‘కల్కి’ ఫస్ట్ పార్ట్ వరకూ, అమితాబ్ బచ్చన్‌ని హీరో అనీ, ప్రభాస్‌ని విలన్ అనీ అనుకోవచ్చు. ఎందుకంటే, హీరోయిన్ దీపికా పడుకొనేని కాపాడే బాధ్యత అశ్వద్ధామ తీసుకుంటాడు. ఆ హీరోయిన్‌ని ఎత్తుకెళ్ళేందుకు కుయుక్తులు పన్నుతాడు భైరవ.

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తన అనుభవాన్ని రంగరించేంత బలమైన పాత్రేమీ ఆయనకు దక్కలేదు. శోభన పాత్రని కూడా సరిగ్గా డిజైన్ చేయలేదేమో అనిపిస్తుంది.

మృనాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు అతిథి పాత్రల్లో మెరుస్తారు. దుల్కర్, విజయ్ తెరపై కనిపించినప్పుడు అభిమానుల సందడి కనిపిస్తుంటుంది.

ప్రభాస్ బాగానే కదిలాడు..

అన్నట్టు, ప్రభాస్ గత సినిమాలతో పోల్చితే, ‘కల్కి’లో ఆయనకి ‘కదిలేందుకు’ కాస్త ఎక్కువ స్కోప్ కనిపించింది. కటౌట్‌ని ఓ మోస్తరుగా వాడాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంకా వాడుకోవచ్చు. ఎంత వాడుకుంటే అంత కంటెంట్ వుంటుంది ప్రభాస్‌లో.

బ్రహ్మానందం కామెడీ నిజానికి, ఈ సినిమాలో అవసరం లేదంతే. చిన్నా చితకా పాత్రల్లో చాలామంది నటించేశారుగానీ, ఎవరూ గుర్తుండరు.

ప్రభాస్‌కి బద్ధకమెక్కువ.. ఈ మధ్య తరచూ వింటున్న కంప్లయింట్ ఇది.! ఆ బద్ధకం ఇందులోనూ కొంత ప్రదర్శించాడు ప్రభాస్. అయినాగానీ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో బాగానే కదిలించాడు ప్రభాస్‌ని దర్శకుడు.

Mudra369

కమల్ హాసన్ విషయానికొస్తే, ఆయన పరిస్థితి మరీ దారుణం. వీఎఫ్ఎక్స్‌లో ఏదో వింత రూపాన్ని చూపించేసినట్లుంటుంది. చివర్లో జస్ట్ ఒకట్రెండు నిమిషాలు కూడా కమల్ హాసన్ అసలు రూపం మనకి కనిపించదు.

తర్వాతి పార్ట్‌లో కమల్ హాసన్ విశ్వరూపం చూస్తామేమో. అప్పటిదాకా సుప్రీం యాస్కిన్.. అని కమల్ హాసన్ గురించి ఓ వింత రూపాన్ని ఊహించుకోవాల్సిందే.

సమంత నటించిన ‘యశోద’ సినిమాతోపాటు, ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలోని సన్నివేశాలు ‘కల్కి’ చూసినవాళ్ళకి గుర్తుకురావడం సహజమే.

Kalki 2898 AD Review.. మహా భారతం.. సరికొత్త ప్రపంచం..

మహాభారతంలోని కృష్ణుడు, కర్ణుడు, అశ్వద్ధామ, అర్జునుడు.. తదితర పాత్రల్ని తెరపై మలచిన తీరు, ఆ మహాభారతాన్ని సరికొత్త ప్రపంచానికి లింక్ చేసిన వైనం.. బాగానే అనిపిస్తాయి.

‘బుజి’ అనే కారు తెరపై జస్ట్ ఓకే. కానీ, కీర్తి సురేష్ వాయిస్ (బుజ్జి అనే కారుకి) అదనపు ఆకర్షణగా నిలిచింది. వింత వింత వాహనాలు తెరపై తిరిగేస్తూ వుంటే, హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. గన్స్.. మరీ ముఖ్యంగా శంబల గన్స్ కామెడీ అయిపోయాయ్.

అమితాబ్ బచ్చన్ లాంటి కురువృద్ధుడ్ని తెరపై అంత ఎనర్జిటిక్‌గా చూపించడం, అది కూడా కన్విన్సింగ్‌గా చూపించడం.. మామూలు విషయం కాదు. హేట్సాఫ్ నాగ్ అశ్విన్.

Mudra369

సినిమాలో లోపాలున్నాయ్. తొలి అర్థ భాగం అయితే భరించలేని సాగతీత. ‘దండగ..’ అన్న భావన కలుగుతుంది. సెకెండాఫ్ మాత్రం వేగంగానే నడిచింది. సినిమా పూర్తయ్యేసరికి, అప్పుడే అయిపోయిందా.? అన్న భావన కలుగుతుంది.

సుమతి (దీపికా పడుకొనే)ని ఎత్తుకుపోతాడు భైరవ.! మరి, ‘కల్కి’ సంగతేంటి.? సుమతి కడుపులో వున్న కల్కి, భూమ్మీదకు వచ్చేదెప్పుడు.? యుద్ధ రంగంలోకి స్వయంగా సుప్రీం యాస్కిన్ దిగుతున్న దరిమిలా, రెండో పార్ట్ ఎలా వుండబోతోంది.? ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో ఏమో.!

ఇంతకీ, ‘కల్కి’ తండ్రి ఎవరు.? ప్చ్.. సమాధానం ప్రస్తుతానికి దొరకలే.!

Digiqole Ad

Related post