బిగ్ క్వశ్చన్: ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి.?
Intermediate Students
Life After Intermediate.. పదో తరగతి తర్వాత ఏం చేయాలో, తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థుల్లో అవగాహన కలగాలి. వారిలో ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే.!
కానీ, అలా జరుగుతోందా.? లేదే.! ఎల్కేజీ సమయంలోనే, ‘ఐఐటీ’ బీజాల్ని పిల్లల మెదళ్లలో నాటేస్తున్నాం. ‘ఐఐటీ’ అనేది ఓ ఎమోషన్ కాదు, అదొక టెన్షన్.!
చదువుకోవడం పాత మాట.. చదువు‘కొనడం’ కొత్త మాట.! కొనుక్కుంటున్నా‘చదువు’ దక్కుతోందా.? అంటే, అదీ లేదు.!
Mudra369
ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇవి మాత్రమేనా.? అసలంటూ వేరే ఆప్షన్స్ ‘చదువు’లో లేవా.? అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతేనేమో.!
ఈ మధ్య ‘సీఏ’ గురించి కూడా గట్టిగానే వింటున్నాం.! వినడం సరే, అసలు విద్యార్థుల్ని ఎలా గైడ్ చేయాలి.? మరీ ముఖ్యంగా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలాంటి అవగాహన కల్పించాలి.
Life After Intermediate.. చాలా వున్నాయ్.. చాలానే వున్నాయ్.!
ఎంపీసీనో, బైపీసీనో.. ఇవి తప్ప చాలామందికి వేరే ఆప్షన్ కనిపించడంలేదు. నిజానికి, చాలానే వున్నాయ్.! పాలిటెక్నిక్ వైపు కూడా పంపించొచ్చు. కానీ, అవన్నీ తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థులకు అవగాహనలోకి వచ్చేలా వుండాలి.
సరే, ఇంటర్మీడియట్ అయిపోయింది.. ఇప్పుడేంటి.? మెడిసిన్‌లో సీటు రాకపోతే.? సీఏ వైపు వెళ్ళేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.? ఇంజనీరింగ్ మీద ఆసక్తి లేకపోతే.?
బీఎస్సీ వుండనే వుంది.. అందులో కంప్యూటర్స్ కూడా ఓ ఆప్షన్. బీసీఏ వుంది.. బీబీఏ వుంది.. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్.!
వాస్తవానికి, ఇంటర్మీడియట్ విద్య విషయంలో చాలా దోపిడీనే జరుగుతోంది.! ఈ ప్రభావం ఆ పై చదువుల మీద చాలా చాలా ఎక్కువగానే పడుతోంది.. అదీ విద్యార్థుల తల్లి దండ్రుల మీద.!
Mudra369
ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు రాకపోతే.? పోటీ పరీక్షల్లో సరైన ర్యాంక్ రాకపోతే.? ఔను, ఏమీ రాకపోయినా.. ప్రపంచం ఏమీ అంతమైపోదు. ఇదీ విద్యార్థులకు చెప్పాల్సింది.
క్లాసులో ఓ యాభై మంది విద్యార్థులుంటే, అందరూ టాప్ ర్యాంక్ పొందగలిగే సత్తా కలిగి వుండరు కదా. ఒక్కొక్కరికీ ఒక్కో విషయంలో టాలెంట్ వుండొచ్చు.
భవిష్యత్తుపై భరోసా కలిగించాలి..
టెన్త్ అనండీ, ఇంటర్మీడియట్ అనండీ.. ఏదైనాగానీ, ఆయా విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలిగించగలగాలి.. అది విద్యా సంస్థల బాద్యత, తల్లిదండ్రుల బాధ్యత కూడా.
పక్కింటోడు ఇంజనీరింగ్ చేస్తుంటే, మనింట్లో పిల్లల్ని కూడా బలవంతంగా అటువైపు పంపించాలనుకోవడం ముమ్మాటికీ తప్పే.!
కలలు కనడంలో తప్పేమీ లేదు.! తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడం కూడా తప్పు కాదు.! కాకపోతే, ఇదే చెయ్యాలంటూ ఒత్తిడి తీసుకురావడం ముమ్మాటికీ తప్పే.
తల్లిదండ్రులదే బాధ్యత..
ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులే, పిల్లల భవిష్యత్తుకి సంబంధించి వంద దారుల్ని వెతికి పెట్టుకోవాలి. వాటిల్లో ఏది తమ పిల్లలకు అనుకూలంగా వుంటుందో, అందులో దేన్ని పిల్లలు ఇష్టంగా అందుకోగలరో తెలుసుకోవాలి.
ఇంజనీరింగ్ కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగావకాశాలు ఎలా వుంటాయి.? అన్నదానిపై వీలైనంత ఎక్కువగా విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యం.
Mudra369
మెయిన్స్, నీట్, ఎంసెట్.. ఇవే విద్యార్థుల ప్రతిభకు కొలమానం.. అనుకుంటే పొరపాటు.! ఇంకా ఆప్షన్స్ చాలానే వున్నాయ్. అదే మీ పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పండి.!
చివరగా.. పోటీ ప్రపంచంలో రాణిస్తే మంచిదే.. రాణించలేకపోతే, ఓడిపోయినట్టు కాదు.!