Love Guru Review: ఫర్లేదు.. ఓసారి ట్రై చెయ్యొచ్చు గురూ.!

Love Guru Romeo Vijay Antony Mirnalini Ravi

Love Guru Review.. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నుంచి ‘లవ్ గురు’ పేరుతో ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తమిళంలో ‘రోమియో’ పేరుతో తెరకెక్కిన సినిమానే, తెలుగులోకి ‘లవ్ గురు’ పేరుతో డబ్ చేసి వదిలారు. ‘గద్దలకొండ గణేష్’ ఫేం మిర్నాలిని రవి ఈ సినిమాలో హీరోయిన్.

ఈ సినిమాలో మనకి తెలిసిన నటీనటుల్లో సీనియర్ నటి సుధ కూడా వున్నారండోయ్.! లీడ్ పెయిర్‌లో విజయ్ ఆంటోనీ, తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే.

భార్యని ప్రేమించడం కోసం, భార్య కలని నిజం చేయడం కోసం సినిమా నిర్మాతగా మారతాడు హీరో.!

అంతేనా, ఆ సినిమాలో అతనే హీరోగా నటించేస్తానంటాడు కూడా.. సినిమా హీరో అయిపోవడం ఇంత తేలికా.? అనిపిస్తే అది మీ తప్పు కాదు.!

అది జస్ట్ సినిమాటిక్ లిబర్టీ అంటే.!

Mudra369

ఇక, మిర్నాలిని రవి, ‘గద్దలకొండ గణేష్’తోపాటు మరికొన్ని సినిమాలూ చేసింది. సినిమా రిలీజ్‌కి రెండ్రోజుల ముందే, స్పెషల్ షో వేశారు, ‘సకుటుంబ సమేతంగా రండి’ అని ఆహ్వానం కూడా పంపారు.

సినిమా టైటిల్ ‘లవ్ గురు’ కదా, భార్యా పిల్లలతో సినిమాకెలా వెళ్తాం.? అన్న చిన్న సంశయం మనసులో కలిగింది. సర్లే, పండగ కదా.. అని వెళ్ళాం.

Love Guru Review.. మంచోడు విజయ్..

థియేటర్‌కి వెళ్ళాక, థియేటర్లోకి ఆహ్వానించాడు విజయ్ ఆంటోనీ.! ఎంత వినయం.?

సినిమా ప్రారంభమవుతుందనగా, ‘ఇది ఫ్యామిలీ మూవీ.. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.. సినిమా అయిపోయాక మిమ్మల్ని కలుస్తాను..’ అని స్క్రీన్ ముందరకు వచ్చి చెప్పాడు విజయ్ ఆంటోనీ. ఇది ఇంకాస్త ఆసక్తికరం.

అన్నట్టు, మొబైల్ ఫోన్స్ స్విచాఫ్ చేసుకోమని కూడా చెప్పాడండోయ్. కానీ, ఎవరూ వినలేదు. నేనూ పట్టించుకోలేదు.

సినిమా చూస్తూనే అప్పుడప్పుడూ, నేనూ మొబైల్ ఫోన్‌లో ట్విట్టర్ ఓపెన్ చేశాను.. అంటే, అక్కడక్కడా సినిమా బోర్ కొట్టిందనే కదా అర్థం.!

Love Guru Romeo Vijay Antony Mirnalini Ravi
Love Guru Romeo Vijay Antony Mirnalini Ravi

అయితే, ఓవరాల్‌గా సినిమా బాగానే వుంది. నిజానికి, బావుంది.! అశ్లీలత ఎక్కడా లేదు.! వల్గారిటీ జోలికి వెళ్ళలేదు. కానీ, మిర్నాలిని రవి ఒకట్రెండు చోట్ల కొంత స్పైసీగా కనిపించిందంతే. అది కూడా సన్నివేశానికి తగ్గట్టు మాత్రమే సుమీ.

కథ మనకి తెలిసిందే.! సినిమా హీరోయిన్ అవ్వాలన్న కల లీలది. లీల అంటే, సినిమాలో మిర్నాలినీ రవి. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్నది అరవింద్ డ్రీమ్. అరవింద్ అంటే విజయ్ ఆంటోనీ.

లీలని ఇలా చూస్తాడు అరవింద్, అలా ప్రేమలో పడతాడు, వెంటనే పెళ్ళయిపోతుంది. కానీ, ఆ పెళ్ళి లీలకు నచ్చదు. ఓ దశలో విడాకులు తీసుకుందామనుకుంటారు.. ఆ తర్వాత ఆమెను ఇంకాస్త గాఢంగా ప్రేమించడం మొదలు పెడతాడు హీరో.

మధ్య మధ్యలో కాసిన్ని నవ్వులు.! కొంచెం ఎమోషనల్ టచ్.! వెరసి, ఓవరాల్‌గా సినిమా బాగానే వుంది. కాదు కాదు, బావుంది.!

ఇంకొంచెం..

విజయ్ ఆంటోనీ నుంచి ఇంకేం ఆశిస్తాం.? మంచి మ్యూజిక్.. ఈ విషయంలో కొంత డిజప్పాయింట్ చేశాడు.

పాటలు ఇంకాస్త బెటర్‌గా వుంటే, రిజల్ట్ ఇంకా బావుండేదేమో.! ఇంకాస్త షార్ప్‌గా ఎడిటింగ్ చేసి వుంటే, అది కూడా సినిమాకి పాజిటివ్ అయి వుండేది.

సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే సినిమానే ఇది. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్.! అన్నట్టు, సినిమా టిక్కెట్ల ధరల్ని మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలే చేశారు ఈ సినిమా కోసం. ఈ విషయంలో టీమ్‌ని అభినందించి తీరాలి.

చిన్నప్పుడే తనకిష్టమైన జననికి దూరమవుతాడు అరవింద్.! ఎవరా జనని.? చిన్నప్పటి లవర్ అయి వుండొచ్చులే.. అని నా శ్రీమతి సినిమా చూస్తుండగా చెప్పింది.!

కానీ, చివర్లో ట్విస్ట్.. జనని అంటే, అరవింద్ చెల్లెలు.! ఆ చెల్లెల్ని చివర్లో హీరోయిన్ కనిపెడుతుంది, తన భర్తకి అదే ఆమె ఇచ్చిన అద్భుతమైన కానుక.

ప్రీ క్లయిమాక్స్‌లో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.

Mudra369

సినిమా పూర్తయ్యాక, మాట నిలబెట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా ఎలా వుందని అడిగి తెలుసుకున్నాడు. పక్కనే హీరోయిన్ కూడా వుంది లెండి.!

తెలుగులో ఓ మోస్తరు పేరున్న హీరో ఈ సినిమా చేసి వుంటే, మంచి విజయమే దక్కి వుండేదేమో.! అలాగని, డబ్బింగ్ సినిమాల్ని మనం ఆదరించబోమని కాదు.!

చాలా డబ్బింగ్ సినిమాలు తెలుగులో అనూహ్య విజయాలు అందుకున్నాయ్.!

అసలు హీరోకి నిప్పు అంటే ఎందుకంత భయం.? ఆ భయం అన్న అంశం పెట్టకుండా వున్నా.. సినిమాకి వచ్చిన ఇబ్బందేమీ లేదు.! అదొక్కటీ మిస్ ఫైర్ అయ్యింది.!

Mudra369

కామెడీ ఇంకాస్త అవసరం. కొంచెం రొమాంటిక్ టచ్ కూడా వుండి వుండాల్సింది. గ్లామర్‌కి కూడా స్కోప్ వుంది. యోగిబాబు నుంచి ఇంకా మంచి కామెడీని రాబట్టుకుని వుండాల్సిందేమో.! వీటీవీ విజయ్ కాస్త నవ్వించాడు.

ఎమోషన్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా వుండి వుంటే బావుండేది. ఇవన్నీ వుంటే, ‘బిచ్చగాడు’ రేంజ్ విక్టరీ తెలుగులో ‘లవ్ గురు’కి దక్కి వుండేదేమో.!

అయినా, ‘బిచ్చగాడు’ సినిమాలో ఏం గ్లామర్ టచ్ వుందని.? ఏం రొమాంటిక్ టచ్ వుందని.? లేకపోయినా, సినిమా అదిరిందది. అప్పటికీ ఇప్పటికీ లెక్కలు మారాయ్ కదా.!

– yeSBee

hellomudra

Related post