‘లవ్ మౌళి’ సమీక్ష: ఓ కళాత్మకమైన సందేశం.!

 ‘లవ్ మౌళి’ సమీక్ష: ఓ కళాత్మకమైన సందేశం.!

Love Mouli

Navdeep Love Mouli Review.. నవదీప్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’.! ఏం చేస్తాంలే నవదీప్ సినిమాల్ని.? అని కొంత కాలంగా, నవదీప్ నటించిన సినిమాల్ని లైట్ తీసుకుంటూ వస్తున్నాను.

ఓటీటీలో సినిమా కనిపిస్తున్నా, ఎందుకో అటువైపు లుక్ వెళ్ళలేదు. అనుకోకుండా, కాస్త ఎక్కువ తీరిక దొరికేసరికి, ‘లవ్ మౌళి’ మీద లుక్ వేయక తప్పలేదు.

సినిమా మొదలవుతూనే, కాస్తంత వెగటు పుట్టింది. అసహ్యం వేసింది. అసలు నవదీప్‌ని అలా నగ్నంగా చూపించాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో ఏమో.!

అయినాసరే, కాస్త భరించి.. సినిమా చూడటం కొనసాగిస్తే, అత్యద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయ్. అంతే, అక్కడి నుంచి సినిమా పూర్తయ్యేవరకు.. ఆ సినిమాటోగ్రఫీ నన్ను వేరే స్క్రీన్ (మొబైల్) వైపు చూడనివ్వలేదు.

Navdeep Love Mouli Review.. ఆర్టిస్ట్ మౌళి.. అన్నీ దుర్గుణాలే..

మౌళి (నవదీప్) ఓ ఆర్టిస్ట్. బోల్డంత ఇగో.. లెక్కలేనితనం.. వాట్ నాట్.. అన్ని దుర్గుణాలూ వున్నాయ్ మౌళికి.

ఓ రోజు అడవిలో అతనికి ఓ అఘోరా పరిచయమవుతాడు. ఆ తర్వాతి రోజు నుంచి చాలా మారతాయ్.! చాలా అంటే చాలా.!

ఓ బొమ్మ గీస్తాడు నవదీప్. తన ఆలోచనలతో గీసిన ఓ అమ్మాయి బొమ్మ అది. తెల్లారేసరికి చిత్ర అనే అమ్మాయి తనకు ప్రత్యక్షమవుతుంది.. అదీ తన ఇంట్లోనే.

ముందు బాగానే వుంటుంది, ఆ తర్వాత తేడా కొట్టేస్తుంది చిత్రతో మౌళికి. ఆ తర్వాత ఆ చిత్ర ఇంకో పద్ధతిలో నవదీప్ దగ్గరకు వస్తుంది. ఆమె కూడా అంతే.

ముచ్చటగా మూడోసారి మరో చిత్ర, నవదీప్ ఇంట్లో అతనిలో వుంటుంది. ఇలా, ఒకే చిత్ర.. భిన్నమైన రీతిలో మౌళికి తారసపడుతుంది.!

చివరికి, తనకు కావాల్సిన అమ్మాయి ఎలా వుండాలన్నదానిపై ఓ క్లారిటీ వస్తుంది మౌళికి. అదే ‘లవ్ మౌళి’ కథ.

సినిమాటోగ్రఫీ ప్రాణం..

సంగీతం ఏమంత గొప్పగా ఏమీ లేదుగానీ, మరీ బ్యాడ్‌గా కూడా లేదు. సో, కాస్త బాగానే వున్నట్టు లెక్క. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బావుంది.

సినిమా పూర్తయ్యాక, అలాంటి ప్రదేశాలకు మనమూ వెళ్ళి, ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలనుకుంటాం. అంతలా సినిమాటోగ్రఫీ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.

ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. డైలాగ్స్ బాగానే వున్నాయి. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బావుండేది. కొన్ని సీన్‌లు నిరభ్యంతరంగా కట్ చేసి పారేయొచ్చు.

దర్శకుడి విజన్ దాదాపుగా ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. యూత్‌ని ఎట్రాక్ట్ చేయాలనే తప్ప, యూత్‌కి చక్కటి మెసెజ్ ఇవ్వాలనే అతని ఆలోచన.. అభినందనీయమే.

తక్కువ పాత్రలతోనే సినిమాని నెట్టుకొచ్చేశారు. నవదీప్ హీరో కాబట్టి, సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడు. నిజానికి, నవదీప్ మంచి నటుడు. ఇంకా అతని పూర్తి పొటెన్షియాలిటీని దర్శకుడు రాబట్టుకోలేకపోయాడు.

హీరోయిన్, కొత్తమ్మాయి. కానీ, కాన్ఫిడెంట్‌గానే చేసింది. అవసరానికి మించి అందాల ప్రదర్శన చేసిందనిపిస్తుంది. వల్గారిటీ.. అని కాకుండా, కాస్త కళాత్మకంగానే వుంది.

ఆమె ఎలా వుండాలి.?

మన జీవిత భాగస్వామి అనండీ.. మన గర్ల్ ఫ్రెండ్ అనండీ.. ఆమె ఎలా వుండాలి.? అన్న కోణంలో, రకరకాల ఆలోచనలు మనకుంటాయ్.

కానీ, మనం ఎలా వుండాలి.? అన్నది మర్చిపోతుంటాం. అదే ‘మౌళి’ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పదలచుకున్నది. సినిమా కదా, అందుకే మౌళికి బోల్డన్ని ఆప్షన్స్ వున్నాయ్.

నిజ జీవితంలో అలా కుదరదు.! మాయలు, మంత్రాలు.. అన్నట్టు, కోరుకున్న లక్షణాల్ని ఊహించుకుని అమ్మాయి బొమ్మ గీయగానే.. ఆ లక్షణాలతో ఆ అమ్మాయి ప్రత్యక్షమైపోవడం ఎవరికైనా కుదురుతుందా.?

ఛాన్సే లేదు.! కానీ, ఈ కాన్సెప్ట్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే వుంది. ఓటీటీలోనే గనుక, ట్రై చేయొచ్చు. ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేశారు గనుక, పిల్లలతో చూడలేం.!

– yeSBee

Digiqole Ad

Related post