Salaar Cease Fire Review: ప్రభాస్ కటౌట్ తప్ప ఏముందక్కడ?

 Salaar Cease Fire Review: ప్రభాస్ కటౌట్ తప్ప ఏముందక్కడ?

Prabhas Salaar Cease Fire Review

Salaar Cease Fire Review.. ‘సలార్’ నుంచి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, శ్రియా రెడ్డి, జగపతిబాబు తదితరులు ఇతర ప్రధాన తారాగణం.!

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్ ‘సలార్’.! ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ఈ ‘సలార్’.! ఫస్ట్ పార్ట్‌ని ‘సలార్ సీజ్ ఫైర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

‘కేజీఎఫ్’ని మించిపోయేలా ‘సలార్’ వుంటుందన్న ప్రచారం నేపత్యంలో అంచనాలు అనూహ్యంగా ఏర్పడ్డాయ్. మరి, ఆ అంచనాల్ని ‘సలార్ సీజ్ ఫైర్’ అందుకుందా.? అసలు కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.!

Salaar Cease Fire Review.. ఇద్దరు స్నేహితుల కథ..

ఇద్దరు స్నేహితులు.. ఓ స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఇంకో స్నేహితుడు.! ఇలాంటి కథలతో చాలా సినిమాలు చూసేశాం.! చూస్తూనే వున్నాం.! మొన్నటికి మొన్న వచ్చిన ‘దసరా’ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కథే.!

కాకపోతే, ‘సలార్’ ఇంకాస్త భిన్నమైన వ్యవహారం.! ‘ఖాన్‌సార్’ అనే ఓ సామ్రాజం, అక్కడి కొన్ని తెగలకు సంబంధించిన ఆధిపత్య పోరు.. ఇవన్నీ ‘సలార్’లో చూడొచ్చు. ఓ అమ్మాయిని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న హీరో, తన కొడుకు ఎలాంటి గొడవల్లో చిక్కుకోకూడదని భయపడే తల్లి.. ఇదీ కథాగమనం.!

ఆ అమ్మాయి ఎవరు.? అసలు ఆ హీరో ఎవరు.? ఖాన్‌సార్ అనే సామ్రాజ్యంతో హీరోకి ఏంటి సంబంధం.? ఇవన్నీ తెరపై చూడాల్సిన అంశాలు.

ప్రభాస్ కటౌట్.!

ఇంటర్వెల్ సీన్‌లో ప్రభాస్ కటౌట్ అలా తెర నిండుగా కనిపిస్తోంటే, అభిమానులకు అంతకన్నా ఇంకేం కావాలి.? అనిపించడం సహజమే.! ఆరడుగుల ఆజానుబాహుడు.. పైగా, కండలు తిరిగిన శరీరం.. వెరసి, కటౌట్ నిజంగా అదిరింది.

అయితే, ప్రభాస్ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా పెద్ద తప్పు చేశాడు. అదేంటంటే, ప్రభాస్‌ని సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం చేయడం.

Prabhas Salaar Cease Fire Review
Prabhas Salaar Cease Fire Review

యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయ్.! కానీ, ప్రభాస్ పెద్దగా కష్టపడలేదు. ఎలివేషన్స్ అలా వున్నాయ్ అంతే. దర్శకుడు ఎంత టఫ్ టాస్క్ ఇచ్చినా చేయగల సమర్థుడు ప్రభాస్. అలాంటి ప్రభాస్‌ని నటన యాంగిల్ దగ్గర్నుంచి.. ఫిజికల్ యాంగిల్ వరకు.. దేంట్లోనూ సరిగ్గా వాడలేదు దర్శకుడు.

శృతి హాసన్ విషయానికొస్తే, సినిమాలో ఆమె వుందంటే, వుందంతే. ఆమె థ్రెడ్ సినిమాకి కీలకం. అందులో ఆమె చేయడానికేమీ లేదు. ఆ పాత్రలో ఎవరుంటే ఏంటి.?

హీరో తల్లి పాత్రలో ఈశ్వరి రావు తన అనుభవాన్ని రంగరించింది. ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి, హీరో స్నేహితుడి పాత్రలో కనిపించిన పృధ్వీరాజ్ సుకుమారన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అతను చాలా మంచి నటుడు. కానీ, అతని నటనా ప్రతిభనీ దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు.

జగపతిబాబు, బ్రహ్మాజీ, శ్రియా రెడ్డి, ఝాన్సీ సహా ఇతర పాత్రలన్నీ తెరపై వున్నాయంటే వున్నాయంతే.! శ్రియా రెడ్డి, ఝాన్సీ నటించినట్లు కనిపించారు. కానీ, ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాళ్ళ నటన.

Salaar Cease Fire Review.. సాంకేతికంగా చూస్తే..

నేపథ్య సంగీతం బాగానే వుంది. సినిమాటోగ్రఫీ కూడా అంతే. యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. అయితే, ప్రభాస్ సినిమా నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం కదా.? నేపథ్య సంగీతం ఇంకా ఇంకా బాగా వుండి వుండాల్సింది. స్టంట్స్ విషయంలోనూ అంతే.!

డైలాగ్స్ అక్కడక్కడా బాగా పేలాయ్.! హీరో ప్రభాస్‌కి ఎన్ని డైలాగులు ఇచ్చి వుంటారు.? ఓ పది, పదిహేను.. ఇలా లెక్కపెట్టుకోవాల్సి వచ్చిందనడం అతిశయోక్తి కాదు. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కత్తెర పదును ఇంకాస్త సరిగ్గా వుంటే బావుండేది.

నిర్మాణం పరంగా చూస్తే ఎక్కడా రాజీ పడలేదు. అవసరమైనంత, అవసరానికి మించి ఖర్చు చేశారనొచ్చు.!

చివరగా..

ఖాన్‌సార్ సామ్రాజం.. అందులో తెగలు.. ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళే ప్రయత్నమైతే ప్రశాంత్ నీల్ చేశాడుగానీ, ‘కేజీఎఫ్’తో కనెక్ట్ అయినట్లుగా ఆడియన్స్, ‘సలార్’తో కనెక్ట్ అవడం కష్టం. యుద్ధ ట్యాంకులు, పోరాట హెలికాప్టర్లు.. వీటిని చూపించాడుగానీ.. అంత పెద్ద యుద్ధమైతే కనిపించలేదు.

ఏమో, సెకెండాఫ్‌లో ఆ యుద్ధాల్ని చూపించేస్తాడేమో.! ఇదంతా అవసరమా.? అలాంటి ఓ సామ్రాజ్యం వుంటుందా.? ఈ రోజుల్లో అది సాధ్యమా.? సీసీటీవీలకు అందకుండా హీరో తప్పించుకోగలుగుతాడా.? ఇలా లాజిక్కులు అస్సలు వెతక్కూడదంతే.

ప్రభాస్ సినిమానే, పృధ్వీరాజ్ సుకుమారన్‌కి ఎక్కువ మార్కులు పడతాయ్.! ఇద్దరి మధ్యా సినిమాలో పోటీ కూడా వుంటుంది, ‘నేనే ఎక్కువ మందిని కొట్టాను’ అని. ప్రభాస్ అభిమానులూ అలాగే ఫీల్ అవుతారు.. స్క్రీన్ స్పేస్ విషయంలో.

ప్రభాస్ పెద్దగా కష్టపడకుండానే బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ నడిచేయడం.. ఎందుకో చూసేవాళ్ళకి అంతగా మింగుడుపడ్డంలేదు. ప్రభాస్ లేకుండానే ఎక్కువ యాక్షన్ పార్ట్ మమ అనిపించేశారా.? అన్న అనుమానం కలగడం సహజమే.

కథలో బోల్డన్ని సబ్ ప్లాట్స్.. అవన్నీ చూసే ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేస్తాయి. తదుపరి భాగం (భాగాలు) కోసం అసంపూర్తిగా వుంచారా.? అంతేనేమో.! మొదటి పార్ట్ చూశాక, ఓ నాలుగైదు పార్టులకు తగ్గట్టుగా ‘థ్రెడ్స్’ వుండిపోయాయ్ అనిపించడం మామూలే.!

ఒక్క పార్ట్ విషయంలోనే చాలా చాలా డిలే జరిగింది.! నాలుగైదు పార్టులంటే, ‘సలార్’ సిరీస్ పూర్తయ్యేసరికి దశాబ్ద కాలం, ఆ పైన పట్టేస్తుందేమో కూడా.!

ఓవరాల్‌గా ప్రభాస్ అభిమానులకి ప్రభాస్ కటౌట్‌తోనే బోల్డంత కిక్కు ఇచ్చేలా చేశాడు ప్రశాంత్ నీల్. కానీ, ఇంకా చాలా చెయ్యొచ్చు ప్రభాస్‌తో.! కేజీఎఫ్ స్థాయిని ప్రశాంత్ నీల్ అందుకోలేకపోయాడన్నది నిర్వివాదాంశం. మూడు గంటల పైత్యం.. అనే చర్చకు ప్రశాంత్ నీల్ ఆస్కారమిచ్చేశాడు.!

చివరగా.. పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రని చంపేందుకు ‘నరరూప రాక్షసుల్ని’ డ్రగ్స్ ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేస్తాడో విలన్.! ప్రేక్షకుల మీదకి ‘సలార్’ని కూడా అలాగే పంపాడా.? అని అక్కడక్కడా అనిపిస్తుంటుందనడం అతిశయోక్తి కాదు.!

Digiqole Ad

Related post