వైరల్ ఫీవర్‌కి నెబ్యులైజర్‌తో చెక్: డాక్టర్ సమంత సిల్లీ చిట్కా.!
Samantha Ruth Prabhu Nebulizer.. సినీ నటి సమంతకి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఎక్కువ. నిజానికి, ఆమె ఫైటర్.!
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది సమంత (Samantha Ruth Prabhu). అయినా, ధైర్యంగా నిలబడింది.
నిజానికి, సోషల్ ట్రోలింగ్ అనేది సమంతకి (Samantha Ruth Prabhu) కొత్త కాదు. కాకపోతే, ఈసారి సమంత ఎదుర్కొంటున్న ట్రోలింగ్ కాస్త భిన్నం.
Samantha Ruth Prabhu Nebulizer.. నెబ్యులైజర్ వుండగా డాక్టరెందుకు దండగ.?
వైరల్ ఫీవర్ అనగానే, వైద్యుడి దగ్గరకు పారిపోవడమెందుకు.? నెబ్యులైజర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ వాటర్ సమపాళ్ళలో వేసుకుంటే సరి.. అని ఓ చిట్కా చెప్పింది సమంత తాజాగా. అదీ సోషల్ మీడియాలో.
అంతే, సమంత ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. సాదాసీదా వ్యక్తులు కాదు, వైద్య నిపుణుు సమంతని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
కొందరు వైద్యులైతే, వున్నపళంగా సమంతని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసేస్తున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే, ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
కోట్లాది మందిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం..
సమంతకి లక్షలాది కాదు, కోట్లాది మంది ఫాలోవర్స్ వుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళంతా సమంత మాటలు నమ్మి, నెబ్యులైజర్‌ని వైరల్ ఫీవర్ కోసం వినియోగిస్తే.? ఇదీ డాక్టర్ల ఆందోళన.
చిట్కాలు వేరు, వైద్యం వేరు.! చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలు భలేగా పని చేస్తాయ్. కానీ, అలాంటి చిట్కాలు పెద్ద అనారోగ్య సమస్యల విషయంలో తేడా కొట్టొచ్చు.
‘చిన్నపాటి జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కి వెళితే, లక్షల్లో బిల్లు వేశారు..’ అని జనం చెప్పడం చూస్తున్నాం. వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ అలాంటిది.
అందుకే, కొంతమంది జనం చిట్కాల్ని ఆశ్రయిస్తుంటారు. సమంత కూడా అనేక అనారోగ్య సమస్యల్ని ఫేస్ చేసింది, ఫేస్ చేస్తోంది కూడా.
మయోసైటిస్ అనే తీవ్ర అనారోగ్యం బారినపడింది సమంత. ఈ క్రమంలో తరచూ వైరల్ ఫీవర్లు ఆమెను వెంటాడేవి. ఈ క్రమంలో ఓ ప్రముఖ వైద్యుడే ఆమెకు నెబ్యులైజర్‌ని సూచించారట.
ఇదే విషయాన్ని సమంత ప్రస్తావించింది. ఎవరికీ హాని చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదంటూ సమంత వివరణ ఇచ్చుకుంది.
సమంతకు బాసటగా సెలబ్రిటీలు..
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (సమంత స్నేహితుడు) సహా మరికొంతమంది సెలబ్రిటీలు, ఈ విషయంలో సమంతకి బాసటగా నిలుస్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా చిట్కాలు పాటించే జనం ఎప్పుడూ వుంటారు. అదే సమయంలో, చిట్కాలు కొంప ముంచేసిన సందర్భాలూ వుంటాయ్.
ఇంకోపక్క, ఏ ఇంగ్లీషు మెడిసన్‌తోనూ ఏ రోగమూ పూర్తిగా నయమయిపోతుందనే భరోసా వుండదు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అనేది ఆధునిక వైద్యంలో ఇప్పటిదాకా లేదు.
చిట్కాలు, మందులు.. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం ముఖ్యం. ఏది అవసరం.? ఏది ప్రమాదకరం.? అన్నదానిపై ఓ అవగాహన వుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.!
ఏదిఏమైనా, చిట్కాలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.! సోషల్ చిట్కాలు ఇంకా ప్రమాదకరం.!