సరదాగా ప్రపంచాన్ని చుట్టొచ్చేద్దామా.?
ప్రపంచంలో చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది టూరిజం (Travel and Tourism). ‘యాత్ర’ అనేది సర్వసాధారణంగా విన్పిస్తోన్న మాట ఇది. ఒకప్పుడు ‘ట్రావెల్’ చేయడమంటే, అదో పెద్ద తతంగం. 100 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది.
కానీ, వేల కిలోమీటర్ల దూరం చాలా తేలిగ్గా వెళ్ళి వచ్చేస్తున్నాం. ఓ మోస్తరు దూరానికి సొంత వాహనాల్లో ప్రయాణం చాలా తేలికైపోయింది. కొంచెం కష్టమైనా దూర ప్రాంతాలకు సొంత వాహనాల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నారు చాలామంది. ప్రయాణం అంటే ఇంతేనా? కాదు, చాలా వుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం కోసం చాలా కసరత్తు చేయాలి. అప్పుడే టూర్ వెరీ వెరీ స్పెషల్‌గా మన జీవితంలో తీపి గురుతుగా మిగిలిపోతుంది.
అమెరికా టు ఇండియాకి సొంత వాహనంలో..
ఇటీవల అమెరికా నుంచి హైద్రాబాద్‌కి వచ్చేసింది ఓ జంట సొంత వాహనంలో. ఫార్టీ ప్లస్ వయసు వాళ్ళకి ఇబ్బంది కాలేదు. ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా, అనుకున్నది సాధించేశారు.
ప్రయాణానికి తగ్గట్టుగా ముందుగానే ఓ వాహనాన్ని ఎంచుకుని, దానికి అవసరమైన మార్పులు చేసుకుని.. జాగ్రత్తగా అమెరికాలో బయల్దేరి, హైద్రాబాద్‌కి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి వారు చెబుతోంటే, ఆశ్చర్యపోవడమే కాదు.. వారి ధైర్యానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పారు.
ప్రయాణమంటే అదొక్కటే కాదు.!
ఫలానా చోట వాటర్ ఫాల్స్ వున్నాయనీ, ఇంకో చోట ఆధ్మాతిక పుణ్యక్షేత్రం వుందనీ.. సమాచారం అందితే చాలు. అది చాలా ప్రత్యేకమైనదని భావించి, సొంత వాహనాల్లో వెళ్ళిపోతుంటారు చాలామంది. అయితే, ఈ క్రమంలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
వాహనం కండిషన్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత, అక్కడ పరిస్థితుల గురించి వాకబు చేయాలి. తగినంత ఆహారాన్ని తమతోపాటు తీసుకెళ్ళడం మర్చిపోకూడదు. అత్యవసర మందులూ తప్పనిసరి. డ్రైవింగ్‌పై పూర్తి పట్టు వున్నవారు మాత్రమే, సుదూర ప్రయాణాలకోసం డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవాల్సి వుంటుంది.
భద్రత కోసం ఇలా చెయ్యండి..
భాష తెలియని ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే, అక్కడ ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా చాలావరకు హిందీతో మేనేజ్ చేసెయ్యొచ్చు. ఇంగ్లీష్ తెలిసి వుండడం బోనస్. స్థానికంగా ఏయే భాషల్లో ప్రజలు మాట్లాడతారో ముందుగానే తెలుసుకుంటే అది ఉపకరిస్తుంది.
అంతే కాదు, తెలియని ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ పోలీసుల సహకారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వాటర్ ఫాల్స్, అడవులు, కొండ ప్రాంతాలకు వెళితే, అత్యవసర సహాయం కోసం పోలీసుల సాయం ఎంతో ఉపయోగపడ్తుంది.
కొంచెం కళాత్మకంగా ఆలోచించాల్సిందే
వ్యయప్రయాసలకోర్చి చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా వుండాలి. ఆ అనుభవాలు తీపి గురుతులుగా మిగిలిపోవాలి. ఇలాంటి ఆలోచనలు చేయనివారెవరుంటారు? ప్రమాదకర ప్రాంతాల్లో కెమెరా పట్టుకునేటప్పుడు, ఆ కెమెరాకి పోజులు ఇచ్చేటప్పుడూ జాగ్రత్త అత్యవసరం.
సెల్ఫీ మోజు ఎక్కువైపోయింది, ఆ మోజులో ప్రాణాపాయాన్ని పసిగట్టలేకపోతున్నాం. ఈ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. సరైన కెమెరా (వీడియో లేదా ఫొటో) ఎంచుకోవడం, దానికి ఎలాంటి సాంకేతి సమస్యల్లేవని చూసుకోవడం ముఖ్యం. తీరా అక్కడికి వెళ్ళాక, తీసుకెళ్ళిన కెమెరా పనిచేయకపోతే టూర్ వృధా అన్న భావన కలగొచ్చు.
ఆహారం అతి ముఖ్యమైనదేగానీ..
దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, అక్కడ లభించే ఆహార పదార్థాలు మనకి తెలియనివి కావొచ్చు. కాబట్టి, ఎక్కడికి వెళుతున్నామో ముందుగా తెలుసు కాబట్టి, అక్కడ లభించే ఆహారం గురించి తెలుసుకోవాలి.
వీలైతే, వాటిని ముందుగానే టేస్ట్ చేయడం ద్వారా టూర్‌లో ‘ఆకలి సమస్య’కు దూరమవ్వొచ్చు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు జర్నీలో మంచిది. ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తమ వెంట తీసుకెళితే, తిండి పరంగా ఇబ్బందులు తగ్గుతాయి.