టీడీపీలోకి యంగ్ టైగర్ గ్రాండ్ ఎంట్రీ.?
Young Tiger NTR To Take Telugu Desam Party
సినిమాల్ని కాదనుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR To Take Telugu Desam Party) రాజకీయాల్లోకి వస్తాడా.? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చుగానీ, తెలుగుదేశం పార్టీలోకి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల ముందుకు తీసుకురావడమే కాదు, అధికార పీఠమెక్కించారు కూడా.
కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమవడం, ‘నాయకత్వ మార్పు’ అంటూ ఆ పార్టీని స్వయానా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబునాయుడు చేజిక్కించుకోవడం తెలిసిన సంగతులే. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ‘నారా’ చేతుల్లోంచి, ‘నందమూరి’ చేతుల్లోకి వెళ్ళబోతోందనే ప్రచారం జరుగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీఆర్, అప్పట్లో ఆ పార్టీకి చాలా ఊపు తెచ్చారుగానీ, అనూహ్యంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ప్రచారం అర్థాంతరంగా ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొంది, కొన్నాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా, ఇంటి నుంచి వీడియో బైట్ ఇచ్చి ప్రచారంలో తనవంతు పాత్ర పోషించాడు ఎన్టీఆర్. అప్పట్లో పార్టీ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు. అయితే ఆ కష్టానికి టీడీపీ అధినేత చంద్రబాబు తగిన గౌరవం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి.
నందమూరి హరికృష్ణ మరణానంతరం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించిన చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్‌ని పార్టీలోకి తీసుకుంటే, నందమూరి అభిమానులందర్నీ ఏకతాటిపైకి తీసుకురావొచ్చునని పార్టీ ముఖ్య నేతలు సూచిస్తుండడంతో, నారా లోకేష్‌తోపాటు బాలకృష్ణని కూడా ఎన్టీఆర్ దగ్గరకు పంపి, ‘అభిప్రాయాన్ని’ తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలపై ఏమంత ఆసక్తి చూపడం లేదని సమాచారమ్. సినిమా రంగంలో బిజీగా వున్న ఎన్టీఆర్, రాజకీయాల్లోకి ఇప్పుడే వెళ్ళడం తొందరపాటవుతుందన్న భావనతో వున్నారట.
‘వెన్నుపోటు రాజకీయం’ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, పార్టీకి అవసరమైనప్పుడు ఆయా వ్యక్తుల్ని బుజ్జగించడంలో అనుభవజ్ఞుడని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ విషయం ఎన్టీఆర్‌కి తెలియకుండా వుంటుందా? వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని ఒకప్పుడు ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయిన తర్వాత హరికృష్ణ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా వుండి, ఎన్టీఆర్‌కి అండగా నిలిచిన సంగతి తెల్సిందే.
అయితే, ఒకప్పుడు టీడీపీలోనే వున్న కొడాలి నాని, చంద్రబాబు నందమూరి కుటుంబం పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చక తెలుగుదేశం పార్టీని వీడారు. అయినప్పటికీ ఎన్టీఆర్ కుటుంబంపై కొడాలి నానిలో అభిమానం అలాగే వుంది. కొడాలి నాని ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ని చంద్రబాబు మాత్రమే కాదు, బాలకృష్ణ కూడా దోషిగా చూపిన వైనం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఏదిఏమైనా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. స్వర్గీయ ఎన్టీఆర్‌ని తలపించే ఆహార్యం, ఆ స్థాయి వాగ్ధాటి కలిగి వున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమంటూ జరిగితే.. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆ అవకాశం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి చంద్రబాబు దక్కనిస్తారా.? పార్టీపై పూర్తిస్థాయిలో తన కుమారుడు నారా లోకేష్‌కి పట్టు వచ్చేలా చేయగలిగిన చంద్రబాబు, ఎన్నికల కోసం మాత్రమే ఎన్టీఆర్‌ని బుజ్జగిస్తారు తప్ప, అంతకు మించి ఇంకేమీ వుండకపోవచ్చు.
ఇప్పటికిప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సినిమాల్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడం ఎంతో కొంత చంద్రబాబుకి అనుకూలించే అంశమే. అయితే, ఎన్నికల్లో టీడీపీ తరఫున యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR To Take Telugu Desam Party) ప్రచారం నిర్వహించనుండడం, అలాగే పార్టీలో కీలక భూమిక కాకపోయినా, చెప్పుకోదగ్గ పాత్ర ఆయనకు చంద్రబాబు అప్పగించనుండడం జరిగిపోవచ్చు. ఇది హరికృష్ణ మరణానంతరం చంద్రబాబులో కన్పించే చిన్న మార్పుగా భావించాలి.