Rasha Thadani Tollywood Telugu.. బాగున్నారా.? అని ఇతర సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు అంటే చాలు, తెలుగు ప్రేక్షకులు ఉప్పొంగిపోతారు.
నిజమే, తెలుగు సినీ అభిమానులు.. ఇతర సినీ అభిమానులతో పోల్చితే చాలా చాలా ప్రత్యేకం. ఈ విషయం బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కి కూడా బాగా తెలుసు.
రవీనా టాండన్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆ రవీనా టాండన్ కుమార్తె, తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జైకృష్ణ ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలోకి నటిగా రావడం చాలా ఆనందంగా వుందంటూ, చాలామంది హీరోయిన్లు చెప్పే మాటనే పరమ రొటీన్‌గా చెబుతోంది రషా తడానీ.
అయితే, తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం రాగానే, తన తల్లి చాలా ఆనందించిందనీ, తెలుగు నేర్చుకోమని తనకు తన తల్లి రవీనా టాండన్ సూచించిందని రషా తడానీ చెప్పడం గమనార్హం.
నిజానికి, చాలామంది అందాల భామలు తెలుగులో మాట్లాడటానికి ఒకప్పుడు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది.
తొలి తెలుగు సినిమాకి తెలుగులో మాట్లాడలేకపోయినా, ఆ వెంటనే తెలుగు నేర్చేసుకుని, తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు.
కానీ, తెలుగు నేర్చుకోమని రవీనా టాండన్ తన కుమార్తెకు సూచించడం గొప్ప విషయమే మరి.! అన్నట్టు, తన తండ్రి హైద్రాబాద్‌లో సెటిలవ్వాలనుకునేవారని రషా తడానీ చెప్పడం మరింత ఆసక్తికరం.
తెలుగు ప్రేక్షకులు చాలామంచివారనీ, మంచి సినిమాలు చేస్తే గుండెల్లో పెట్టుకుంటారనీ తన తల్లి రవీనా టాండన్ చెప్తుంటుందని రషా తడానీ చెప్పుకొచ్చింది.
రషా తడానీ ఆల్రెడీ బాలీవుడ్లో సినిమాలు చేసింది. అన్నట్టు, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కంటే ముందే, ఓ ప్రెస్టీజియస్ మూవీ కోసం రషా తడానీ టెస్ట్ షూట్లో పాల్గొంది.
కానీ, అనివార్య కారణాల వల్ల ఆ పెద్ద ప్రాజెక్ట్ ఓ స్టార్ హీరోయిన్ చేతికి వెళ్ళిపోయింది. ఆ సినిమా పెద్ద హిట్టయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కింది ‘శ్రీనివాస మంగాపురం’.! సినిమా ప్రోమోస్ ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చూస్తోంటే, ఇద్దరికీ ఇది తొలి సినిమాలా అనిపించడంలేదు.
