Shalini Pandey Morphing Video.. సెలబ్రిటీలు గగ్గోలు పెట్టడం.. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతూనే వుండడం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.
ఆల్రెడీ కొందరు సెలబ్రిటీలు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. కొంత రక్షణ పొందారు. అయినాగానీ, ఫేక్ వీడియోల ప్రసహనం కొనసాగుతూనే వుంది.
సెలబ్రిటీల ఫిర్యాదుల నేపథ్యంలో అరెస్టులు జరుగుతున్నాయ్.. అయినాసరే, ఫేక్ వీడియోల్ని తయారు చేసేవారు అస్సలేమాత్రం తగ్గడం లేదు.
మా ‘ఏఐ టూల్’ వాడి, వీడియోలు తయారు చేయండహో.. అంటూ, ఇంటర్నెట్‌లో కుప్పలు తెప్పలుగా సంస్థలు, మార్ఫింగ్ వీడియోల్ని తయారు చేయడానికి సంబంధించిన టూల్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నాయి.
ఒకటా.? రెండా.? పదా.? పాతికా.? పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఈ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో, ఇలా ఫొటో ఇస్తే, అలా ఫేక్ వీడియో వచ్చేస్తోంది.
తాజాగా, ఈ ఫేక్ వీడియోల లిస్టులోకి ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండే పేరు ‘బాధితురాలి’గా చేరిపోయింది. షాలినీ పాండే ‘హాట్ వీడియో’ అంటూ, ఓ వీడియో గత కొద్ది రోజులుగా ఎడా పెడా తిరిగేస్తోంది సోషల్ మీడియ వేదికగా.

దాంతో, ఈ విషయమై షాలినీ పాండే, సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది. ఆ వీడియో తనది కాదనీ, ఫేక్ వీడియో అనీ అందులో పేర్కొంది.
ఈ తరహా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, షేర్ చేయడం మంచిది కాదనీ, చట్ట పరమైన చర్యలు అలాంటివారిపై తప్పక తీసుకోబడ్తాయనీ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
మొన్నీమధ్యనే ‘టాక్సిక్’ హీరోయిన్ రుక్మిణీ వసంత్‌కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. బాలీవుడ్ నటీమణులు, సౌత్ నటీమణులు డజన్ల సంఖ్యలో కోర్టుల్ని ఆశ్రయించారు ఈ తరహా ఫేక్ వీడియోల నేపథ్యంలో.
ఇంతకీ, పిల్లి మెడలో గంట కట్టేదెలా.? ఈ ఫేక్ వీడియోలను అరికట్టేదెలా.? సోషల్ మీడియా వేదికలు స్వచ్ఛందంగా, ఇలాంటి ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపితేనే, పరిస్థితి అదుపులోకి వస్తుంది.
ఇంటర్నెట్ సెన్సార్.. ఇలాంటి సందర్భాల్లోనే చర్చకు వస్తుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, అడల్ట్ కంటెంట్ విషయమై ఉక్కుపాదం మోపింది.
ఇప్పుడిక, ఈ ఫేక్ వీడియోలనూ ఏఐ సాంకేతికత ఉపయోగించి, బ్లాక్ చేసేలా కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి వుంటుందేమో.!
