Table of Contents
Last Ritual Packages Startup.. మనిషి ప్రాణం పోయాక, ఏముంటుంది.? ఆ భౌతిక కాయానికి తగిన గౌరవం బతికున్నోళ్ళు ఇవ్వడం తప్ప.!
ఇప్పుడు అలాంటి గౌరవాలు ఏమైనా వుంటున్నాయా.? అనడక్కండి.. అదంతే.!
స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్.. అంటాడో సినీ కవి.! నిజమే, డబ్బుంటే చావు కూడా పెళ్ళిలానే వుంటుంది. అదే, డబ్బు లేకపోతే.. ఆ చావు మరింత దుర్భరం.!
దేశంలో జనాభా పెరిగిపోయింది.. అంత్యక్రియల నిమిత్తం, స్మశానాల కొరత ఏర్పడింది. అందుకే, దహన సంస్కారాల నిమిత్తం, ఎలక్ట్రిక్ దహన వాటికలు పుట్టుకొచ్చేశాయ్.
ఇది యాపారం.! అంత్యక్రియల నిమిత్తం.. ఖర్చులు చాలా అయిపోతున్నాయ్.! ఎంత ఖర్చు చేసినా, కొన్ని సందర్భాల్లో ‘పాడె మోసే ఆ నలుగురూ’ దొరకడంలేదు.!
Last Ritual Packages Startup.. సరికొత్త స్టార్టప్..
కానీ, ఇకపై ఆ ఇబ్బందుల్లేవ్.! ఓ స్టార్టప్ సంస్థ, అంత్యక్రియల్ని అద్భుతంగా చేస్తామంటూ, ప్యాకేజీలు ప్రకటించింది.
ఆరు వేల రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు వివిధ ప్యాకేజీల కింద అంత్యక్రియల్ని నిర్వహిస్తారట. ఏ ప్యాకేజీ కావాలో నిర్ణయించుకోవడమే తరువాయి.!
పాడె మోయడం దగ్గర్నుంచి, అంతిమ సంస్కారాలు నిర్వహించే వరకు, దహన సంస్కారాలైతే అస్తికల్ని సేకరించి, బంధువులకు అప్పగించేవరకు.. అన్నీ, ఈ స్టార్టప్ సంస్థే చూసుకుంటుందిట.
ఐడియా అదిరింది.. అంటూ, ఈ సంస్థ గురించి అప్పుడే, బోల్డంత ప్రచారం జరుగుతోంది. ‘ఆర్డర్స్’ కూడా వెళుతున్నాయట.
బతికున్నప్పుడే బుకింగులు..
బతికున్నప్పుడే, అంత్యక్రియల నిమిత్తం బుకింగులు చేసుకోవచ్చట.! అలాగని ప్రకటనలూ ఇస్తున్నారు. ఇదెక్కడి చోద్యం.. అనకండి.. అదంతే.!
కాదేదీ వ్యాపారానికి అనర్హం.! కొత్తగా ట్రై చేశారు కదా.! ఇప్పుడు చాలామందికి ఇది నచ్చకపోవచ్చు. సెటైర్లు వేయొచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, మనిషి చాలా చాలా మారిపోయాడు. తల్లిదండ్రులు చనిపోతే, కంటతడి పెట్టడానికి కూడా తీరిక వుండటం లేదు.. కడుపున పుట్టిన పిల్లలకి.
చాలామందికి చాలా పెద్ద వెసులుబాటు..
అంతిమ సంస్కారాలకి వచ్చేంత బాధ్యత కూడా వుండటం లేదు చాలామందికి ఈ రోజుల్లో.! ఆన్లైన్లో ప్యాకేజీని ఆర్డర్ చేస్తే, మొత్తం పని పూర్తి చేసేస్తుంది ఈ సంస్థ.
ఇదే నయం.. అయినవాళ్ళు పట్టించుకోనప్పుడు, గౌరవ ప్రదమైన రీతిలో బతికున్నప్పుడే అంత్యక్రియల స్లాట్ బుక్ చేసుకోవడం.!
అంత్యక్రియలు సంప్రదాయ బద్ధంగా జరిగేందుకు, పండితుల్ని కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తారు. సంబంధిత సామాగ్రి కూడా సదరు స్టార్టప్ సంస్థ సమకూరుస్తుంది.
అస్తికల్ని నదిలో కలిపేందుకు, పడవనీ.. ఏర్పాటు చేస్తారట. నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని మాత్రం అనొద్దు.! నిజంగానే, చాలామందికి ఇదొక అద్భుతమైన వెసులుబాటు.