Home » ఓటీటీ సమీక్ష.! చిన్న చిన్న ఆశలన్నీ వారణాశిలో తీరి‘పోతే’.!

ఓటీటీ సమీక్ష.! చిన్న చిన్న ఆశలన్నీ వారణాశిలో తీరి‘పోతే’.!

by hellomudra
0 comments
Madhoo Shah Chinni Chinni Aasai

Chinni Chinni Aasai Review.. వారణాశి.. అదేనండీ, కాశీ మహా క్షేత్రం.! హిందువులకు అత్యంత పవిత్రమైన దివ్య క్షేత్రం.!

జీవితంలో అన్నీ చూసేసి, జీవిత చరమాంకంలో కాశీకి వెళ్ళి, అక్కడే శివైక్యం చెందాలని కోరుకునేవారు ఇప్పటికీ చాలామందే వున్నారు.

ఇప్పుడంటే ఇలా వెళ్ళి, అలా వచ్చేస్తున్నారుగానీ.. ఒకప్పుడు కాశీ ప్రయాణం అంటే, ఓ ప్రసహనం. కాశీకి వెళితే, తిరిగి రావడం అనేదే వుండేది కాదు. ఆ రోజులు వేరు.

విమానయానం సామాన్యులకీ అందుబాటులోకి వచ్చేసింది. సో, చాలా తేలిగ్గా కాశీ వెళ్ళి వచ్చేస్తున్నారు చాలామంది.

ఎందుకు వెళుతున్నారో, ఏం చేస్తున్నారో.. తెలియకుండానే కాశీ యాత్రలు చేసేస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు.

కాశీ అంటే, కొంతమందికి ఇప్పుడు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే. అయినాసరే, కాశీ ప్రయాణమంటే.. చాలా చాలా ప్రత్యేకమైనదని భావించేవారు చాలామందే వున్నారు.

Chinni Chinni Aasai Review.. కాశీకి వెళితే.. ఏదో ఒకటి వదిలెయ్యాల్సిందే..

ఔను, కాశీకి వెళితే మనకి బాగా నచ్చింది ఏదో ఒకటి అక్కడ వదిలేసి వచ్చెయ్యాలి. అది అలవాటు కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, సీనియర్ నటి మధు షా (మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ ఫేం మధుబాల), సీనియర్ నటుడు ఇంద్రన్స్ నటించిన ‘చిన్ని చిన్ని ఆశై’ సినిమా గురించి సమీక్షించుకుంటున్నాం కాబట్టి.

‘చిన్ని చిన్ని ఆశై’ సినిమా బ్యాక్‌డ్రాప్ ‘వారణాశి’.! మధూ, వారణాశికి వెళుతుంది. అక్కడామెకి ఇంద్రన్స్ పరిచయమవుతాడు.

వారణాశి అంతా ఆమెకి చూపించేందుకు ప్రయత్నిస్తాడు ఇంద్రన్స్. ఇంద్రన్స్‌కి ఓ కుమార్తె వుంటుంది. ఆమె ఎవరో కాదు నటి అపర్ణ బాలమురళి.

కథంతా ఇంద్రన్ – మధూ మధ్యనే నడుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే, లేటు వయసులో ప్రేమ ప్రయాణం లాంటిదన్నమాట.

మరీ, ప్రేమ కాదుగానీ.. ఓ స్వచ్ఛమైన స్నేహం. మదూ అమాయకంగా కనిపిస్తుంటుంది. వారణాశికి ఎందుకొచ్చింది.? ఏం చేస్తోంది.? అన్న అనుమానం చూసే ప్రేక్షకులకు కలుగుతుంది.

ఓ బృందంతో వచ్చిన ఆమె, ఆ బృందం నుంచి విడిపోయి, ఇంద్రన్స్ కంటపడుతుంది. ఆమెకు ఆశ్రయమిప్పిస్తాడు.. ఆహారమూ పెడతాడు.

మోక్షం ఎవరికి..

ఈ ప్రయాణంలో రకరకాల పాత్రలు పరిచయమవుతాయి. అన్నీ కథాగమనంలో వచ్చి వెళ్తాయంతే. మొత్తంగా గుర్తుండిపోయే పాత్రలు రెండే. ఆ పాత్రల్లో ఇంద్రన్స్, మధూ అద్భుతంగా ఒదిగిపోయారు.

వారణాసిలో ఓ చోటు వుంటుంది.. సత్రం లాంటిది. అక్కడికి వచ్చేవారు, చనిపోవడానికే వస్తారు. నిర్ణీత గడువు లోగా చనిపోకపోతే, ఖాళీ చేసెయ్యాలి. ఆ విషయాన్ని దర్శకుడు ప్రస్తావించాడు ఈ సినిమాలో.

అక్కడ మధూ, ఓ రూమ్ తీసుకుంటుందేమో అనుకుంటాం. మధూతో స్నేహం విషయమై ఇంద్రన్స్ ఆశపడతాడు. అలానే మధూ కూడా, ఇంద్రన్స్ పట్ల ఆరాధనాభావంతో కనిపిస్తుంది.

వెరసి, ఇదో అద్భుత దృశ్య కావ్యం.. అన్న భావన కలిగిస్తుంది. ఇంట్లో పెద్దవారికి భలేగా నచ్చస్తుంది. మధ్యవయస్కులూ కనెక్ట్ అవుతారు.

మధూ చనిపోతుందా.? ఇంద్రన్ చనిపోతాడా.? అన్న గందరగోళానికి తెరలేపాడు దర్శకుడు. ఇంద్రన్స్ చనిపోతాడేమోనని అనుకుంటాం. అనూహ్యంగా మధూ చనిపోతుంది.

ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది గనుక, ఈ ట్విస్ట్ రివీల్ చేసెయ్యడం తప్పేమీ కాదు. ప్రతి సంభాషణ మనసుని హత్తుకుంటుంది. ప్రతి పాటా మనల్ని సినిమాలో లీనం చేస్తుంది.

సంగీతం, సినిమాటోగ్రఫీ.. సినిమాకి తగ్గట్టుగా వున్నాయి. ఓటీటీలో టైమ్ పాస్ కోసం చూడొచ్చు.. భావోద్వేగానికి లోనవ్వొచ్చు. థియేటర్లో చూడ్డం మాత్రం బోరింగ్ అనిపిస్తుంది.

ఓటీటీలో సంభాషణలు తమిళ, తెలుగు.. రెండిట్లోనూ మిక్స్ అయిపోయి వుంటాయి. మలయాళ – తమిళ మిక్సింగ్ ఒరిజినల్. సినిమా చూస్తున్నంతసేపూ మనకేమీ భాష విషయంలో ఇబ్బంది రాదు.

అంత చక్కగా సంభాషణల్ని డీల్ చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించి తీరాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group