Jana Nayakudu Review.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన సినిమా ‘జన నాయకుడు’. తమిళంలో ‘జన నాయగన్’గా తెరకెక్కిన సినిమాని, తెలుగులోకి ‘జన నాయకుడు’గా డబ్ చేశారు.
అదేంటీ, ఇది ‘భగవంత కేసరి’ సినిమాకి రీమేక్ కదా, తెలుగులోకి మళ్ళీ డబ్ చేయడమేంటి.? అంటే, అదంతే.! ఇది రీమేక్ కాదు, ఫ్రీమేక్.!
నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ తీసుకున్నారు.
ఆ కొన్ని సీన్స్ స్ఫూర్తితో, ‘జన నాయకుడు’ సినిమాలోని పాత్రలని మలచారు, సన్నివేశాల్ని రీ-డిజైన్ చేశారు. అందుకే, ఇది ఫ్రీమేక్ అయ్యింది.
అనిల్ రావిపూడి ఇక్కడ.. అక్కడేమో హెచ్ వినోద్. ఇక్కడ బాలకృష్ణ, అక్కడ విజయ్. ఇక్కడ కాజల్ అగర్వాల్ అక్కడేమో పూజా హెగ్దే. ఇక్కడేమో శ్రీలీల కాగా, అక్కడేమో మమిత బైజు. ఇదీ సంగతి.
కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం అనవసరం. ‘భగవంత్ కేసరి’ కథే, కాకపోతే నేల విడిచి సాము చేశారు కథ విషయంలో కూడా. ఇష్టమొచ్చినట్లు మార్చుకుంటూ పోయారు.
Jana Nayakudu Review.. నచ్చినట్టు రాసుకుని.. అడ్డగోలుగా తీసి పారేశారు.!
సన్నివేశాల్నీ తమకు నచ్చినట్లుగా రాసేసుకుని, తెరకెక్కించేశారు. దాంతో, అంతా కలగాపులగం అయిపోయింది. ఇక్కడ ‘భగవంత్ కేసరి’ కూడా ‘మమ’ అనిపించింది.
కాకపోతే, ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అంశంపై అనిల్ రావిపూడి, దర్శకుడు నందమూరి బాలకృష్ణతో చేయించిన సీన్, ఎవర్నయినా కదిలిస్తుంది. ఇక, బాలయ్య అభిమానులు మెచ్చే మాస్ ఎలిమెంట్స్, అది వేరే చర్చ.
నో డౌట్, శ్రీలీల కంటే మమిత బైజు మంచి నటి. కానీ, శ్రీలీల బెటర్ అనిపిస్తుంది, ‘జన నాయకుడు’ సినిమాలో మమిత బైజుని చూస్తే. కాజల్‌తో పోల్చితే, పూాజా హెగ్దేకి అదనపు ప్రధాన్యతేమీ దక్కలేదు.
నందమూరి బాలకష్ణ – జోసెఫ్ విజయ్.. ఈ ఇద్దరి మధ్యా పోలిక అనవసరం. పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లే చేశాడు విజయ్. దాంతో, అతని పాత్రా తేలిపోయింది.
కాకపోతే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సహా యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎలివేషన్ సీన్స్.. ఇలా విజయ్ అభిమానులు కోరుకున్నట్లుగా కొంత కంటెంట్ వుంది. అదొక్కటే కాస్త ఊరట.
తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ ‘భగవంత్ కేసరి’ సినిమాని చూసేశారు కాబట్టి, నిర్మొహమాటంగా ‘జన నాయకుడు’ సినిమాని స్కిప్ చేసెయ్యొచ్చు. లేకపోతే, తిట్టుకోవాల్సి వస్తుంది మరి.
దేశం దాటి, విదేశాలకు వెళ్ళిపోయి.. ఇలా కథని ఎటెటో పరిగెత్తించేశారు ‘జన నాయకుడు’ సినిమాలో. తెలుగు ప్రేక్షకులైతే జుట్టు పీక్కోవాల్సి వచ్చింది థియేటర్లలో.
ఒకప్పటి దళపతి విజయ్.. ఇప్పుడు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గనుక, అతని అభిమానులకు ఇది కాస్త ఉత్సాహాన్నిచ్చే సినిమానే అయి వుండొచ్చుగాక.
విడుదలకు ముందు బాలారిష్టాలు ఎదుర్కొంది.. నానా అవస్థలూ పడింది. సెన్సార్ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులూ.. వాట్ నాట్.. అన్నీ ఇన్నీ పాట్లు కావు.
ఇంతా జరిగాక, ఈ కంటెంట్‌తో సినిమా రిలీజ్ చేయడం కంటే, మానేసి వుంటే విజయ్ తన గౌరవాన్ని కాపాడుకునేవాడేమో.. అన్న చర్చ జరుగుతోందంటే, అదేమీ అతిశయోక్తి కాదు.
కాకపోతే, ముందే చెప్పుకున్నట్లు విజయ్‌కి వున్న లక్షలాది, కోట్లాది సినీ అభిమానులకి ‘జన నాయగన్’ ఉత్సాహాన్నిస్తుంది. ‘చివరి స్టెప్’ అంటూ విజయ్ చేసిన డాన్స్ ఆ అభిమానుల్ని అలరిస్తుంది.
అంతకు మించి జన నాయగన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాజిటివ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు.
ఈ సినిమా చుట్టూ నడిచిన వివాదాల్ని అడ్డం పెట్టుకుని విజయ్ ఒకింత పొలిటికల్ మైలేజ్ పెంచుకున్నాడన్నది నిర్వివాదాంశం.
చివరిగా.. బూడిదలో పోసిన పన్నీరు.. అన్న మాట సరిగ్గా సరిపోతుంది ఈ సినిమాకి. విచ్చలవిడిగా ఖర్చు చేసేశారు.. బోల్డన్ని వివాదాలు.. వెరసి, సినిమా తుస్సుమంది.!
