Table of Contents
Ys Jagan Seediri Politics.. ఒకసారి చేస్తే తప్పు.! మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తేనో.!? ఏమనాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి వ్యక్తుల గురించి ఎలా ప్రస్తావించుకోవాలో కూడా తెలియని దుస్థితి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే ఇదంతా.! తెలుసు కదా, వైఎస్ జగన్ అంటే కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.
అంతేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆయన కడప ఎంపీగానూ బాధ్యతలు నిర్వహించారు.
ఏది తప్పో, ఏది ఒప్పో తెలియనంత అమాయకత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుందా.? ఛాన్సే లేదు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులున్నాయి.
16 నెలలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా వున్నారు అక్రమాస్తుల కేసుకు సంబంధించి. సో, చట్టాలపైనా అలానే న్యాయ వ్యవస్థపైన కూడా అవగాహన వుండే వుంటుంది.
Ys Jagan Seediri Politics.. ఓ రోడ్డు ప్రమాదం.. రోడ్డున పడ్డ కుటుంబం..
వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తిని బలి తీసుకున్నాడు. సరే, అది రోడ్డు ప్రమాదమే కావొచ్చు.
యాక్సిడెంట్ కేసు నమోదయ్యింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. కానీ, లొంగిపోయిన వ్యక్తి సీదిరి అప్పలరాజు తనయుడు కాదు.
సీదిరి అప్పలరాజు తనయుడికి బదులు వేరే వ్యక్తి, ఈ కేసులో పోలీసుల యెదుట లొంగిపోగా, సీసీటీవీ విజువల్స్ అసలు బండారాన్ని బయటపెట్టాయి.
అంటే, ఇక్కడ జరిగింది రోడ్డు ప్రమాదం. కానీ, నిందితుడ్ని మార్చే క్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుట్రకు తెరలేపారు. ఇది హత్యా నేరం కంటే పెద్ద నేరం అయి కూర్చుంది.
తప్పించుకు తిరుగువాడు..
ఈ మొత్తం వ్యవహారంలో తప్పించుకునేందుకు ప్రయత్నించినందుకు సీదిరి అప్పలరాజు కుమారుడిపైనా హత్య కేసు నమోదవడంలో వింతేముంది.?
కానీ, ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నచ్చలేదు. కర్మ కాలి పసి పిల్లాడు రోడ్ యాక్సిడెంట్ చేస్తే, ఆమాత్రం దానికే హత్య కేసు పెడతారా.? అన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణ.
మత్సకార వర్గానికి చెందిన బీసీ నేత, డాక్టర్ కూడా అయిన సీదిరి అప్పలరాజు మీద కేసు ఎలా పెడతారంటూ అమాయకంగా ప్రశ్నించేశారు వైఎస్ జగన్.
మొన్నామధ్య విశాఖ వెళ్ళినప్పుడు ఇవే వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన వైఎస్ జగన్, తాజాగా ఇదే అంశంపై ట్వీటేయడం చర్చనీయాంశమవుతోంది.
తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇదేం రాజకీయం.? ఇదేం పద్ధతి.? చట్టం, న్యాయం, రాజ్యాంగం.. ఇది అందరికీ సమానం.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదా.?
కేసు నమోదయ్యింది.. అరెస్టులు జరుగుతున్నాయ్. అక్రమాస్తుల కేసులో అసలు విచారణకే హాజరవడంలేదు వైఎస్ జగన్ చాలా ఏళ్ళుగా.
రేప్పొద్దున్న సీదిరి అప్పలరాజు వ్యవహారం ఏమవుతుందో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. తెలిసీ, ఈ యాగీని ఎలా అర్థం చేసుకోవాలి.?
చివరగా.. పార్టీ నాయకుడ్ని, ఆ నాయకుడి కుమారుడ్ని వైఎస్ జగన్ వెనకేసుకురావడం వింత కాదు.! కానీ, బాధిత కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది.. రోడ్డు నడిపోయింది.
ఇక్కడ.. పోయింది ఓ ప్రాణం.. ఆ కుటుంబం పట్ల కనీస మానవత్వం ప్రదర్శించని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘నాయకుడు’ ఎలా అవుతాడు.?
