Table of Contents
Garividi Lakhsmi Review.. ఊరి పేరే, ఇంటి పేరుగా మారిపోయింది. ఎక్కడో ఉత్తరాంధ్రలో.. ఓ మారుమూల గ్రామమది.
ఆ రోజుల్లో ఆడపిల్ల, ధైర్యంగా తనకు నచ్చిన విద్యను నేర్చుకునేందుకే అవకాశముండేది కాదు.! అంత కఠినమైన కట్టుబాట్లున్న సమాజంలో పుట్టి పెరిగిందామె.
కానీ, ఆ సమాజమే తనను మెచ్చేలా, బుర్రకథ అనే కళారూపాన్ని ఎంచుకుందామె. కాదేమో.. ఆ కళారూపమే ఆమెను ఎంచుకుందనడం సబబేమో.!
జానపద కళారూపాల్లో ఒకటైన బుర్రకథలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది గరివిడి లక్ష్మి.! కానీ, ఆమె ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోయారు చాలామంది.
అంతే, గరివిడి లక్ష్మి ప్రదర్శన అంటే, ‘బూతులు, డబుల్ మీనింగులు..’ అంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు. ‘గరివిడి లక్ష్మి’ పేరుతో క్యాసెట్లు వదిలారు.. ఆమెకు సంబంధం లేకుండానే.
ఏమయ్యిందో తెలియదుగానీ, ఒక్కసారిగా గరివిడి లక్ష్మి పేరు తెరమరుగైపోయింది. ఆమె బతికే వుందా.? అన్న డౌట్ చాలామందికి వచ్చింది.
సరిగ్గా, ఆ సమయంలోనే ‘గరివిడి లక్ష్మి’ పేరుతో ఓ సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యింది.! అంతే, అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
Garividi Lakhsmi Review.. ఇదీ అసలు సిసలు బయోపిక్..
బయోపిక్ అంటే, యాక్షన్ వుండాలి.. రొమాన్స్ వుండాలి.. ఇంకేదో వుండాలి. ఇవన్నీ లేకపోతే, సినిమా ఆడదన్న అభిప్రాయం చాలామందిలో వుంది మరి.!
కానీ, ‘గరివిడి లక్ష్మి’ సినిమా రిలీజ్ అయ్యింది, సూపర్ హిట్టయ్యింది. సినిమాకి, ప్రజలే ప్రచారకర్తలుగా మారిపోయారు. విడుదలకు ముందు విపరీతమైన హైప్ జనరేట్ అయ్యింది.
సినిమా విడుదలయ్యాక కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేశారు. ఇదో రికార్డింగ్ డాన్స్.. అంటూ, వెకిలిగా ట్వీట్లేశారు.
కానీ, సినిమాని దర్శక నిర్మాతలు నిజాయితీతో తెరకెక్కించిన వైనానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నటీనటుల నటనా ప్రతిభకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణకు చెందిన ఆనంది, తమిళ సినిమాలతో పాపులర్ అయి.. తెలుగు సినీ పరిశ్రమలో నిర్లక్ష్యానికి గురయ్యి.. ఆ తెలుగు సినిమాతోనే మళ్ళీ బీభత్సమైన కమ్ బ్యాక్ ఇచ్చింది.
తెరపై ఆనంది కనిపించలేదు. గరివిడి లక్ష్మి మాత్రమే కనిపించింది. ఇదిగో ‘గరివిడి లక్ష్మి’ అంటూ సినిమా చివర్లో నిజమైన గరివిడి లక్ష్మిని చూపించడం అభినందనీయం.
గరివిడి లక్ష్మి కూడా వచ్చేశారు..
సినిమా విడుదలయ్యాక, గరివిడి లక్ష్మి నిజంగానే సినిమా యూనిట్‌తో కలిసి ప్రమోషనల్ ఈవెంట్‌లో సందడి చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఒకప్పుడు తనను మర్చిపోయిన అదే జనం, అంతకు ముందు తన ప్రదర్శనలకు ఉర్రూతలూగిపోయిన జనం.. ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో ఉర్రూతలూగిపోతోంటే.. ఆమె ఆనందం వర్ణనాతీతం.
సినిమాలో ఆనంది ఎంత బాగా చేసింది.? అంటే, చాలా బాగా చేసింది. అంతకన్నా బాగా ఆమె సినిమా ప్రమోషన్లలో సందడి చేసింది.
‘గరివిడి లక్ష్మి’ ప్రమోషన్లలో ఆనంది చూపించిన ఎనర్జీ, మరీ ముఖ్యంగా బుర్రకథకు సంబంధించిన పాటలు పాడేటప్పుడు ఆమె ప్రదర్శించిన ఎనర్జీ.. వేరే లెవల్ అంతే.
మొదట నిత్యామీనన్‌ని అనుకున్నారట కదా.? అన్న ప్రశ్న పదే పదే, ఆనందిని ఇబ్బంది పెట్టింది. కానీ, ఆమె హుందాగా స్పందించింది.
పరభాషా నటీనటుల మీద, మన తెగులు మీడియాకి ఎంత అంత మక్కువ.? అన్నదే అర్థం కాని ప్రశ్న. తెలుగమ్మాయి కాబట్టే, అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయిందన్న విషయాన్ని గుర్తెరగకపోతే ఎలా.?
దర్శకుడి కళాభిమానం..
దర్శకుడు గౌరి నాయుడు జమ్ము కమర్షియల్ సినిమా స్థానంలో, ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్‌ని ఎంచుకోవడంలో అతని కళాభిమానం ఏంటన్నది సుస్పష్టమవుతోంది.
నిర్మాతల్ని ప్రత్యేకంగా అభినందించి తీరాలి ‘గరివిడి లక్ష్మి’ విషయంలో. అలానే, సంగీత దర్శకుడికీ ప్రత్యేక అభినందనలు చెప్పి తీరాలి.
రాగ్ మయూర్, షకలక శంకర్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాలోని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆ మాటకొస్తే, ప్రతి పాత్రా అంతే.!
తవ్వకాలు చేపట్టండి.. ఇంకా చాలా తెలుగు ఆణిముత్యాలున్నాయ్.. మనం పాతి పెట్టేసినవే అవి.! బయపిక్స్.. అంటే ఇవీ.!
బతికున్నప్పుడే తన బయోపిక్‌ని చూసుకోగలిగే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది.? గరివిడి లక్ష్మి అదృష్టవంతురాలు. కాదు కాదు, ఆమె బయోపిక్ ద్వారా ఆమెను గౌరవించుకోగలిగాం.. మనం అదృష్టవంతులం.
చివరగా.. రివ్యూ.. అదే, సినిమా సమీక్ష రాద్దామని మొదలు పెడితే, ఇదిగో ఇలా తిరిగింది రాత.! గరివిడి లక్ష్మిగారికి నమస్సులు.!