Konda Surekha Thrown Out.. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ, తన మంత్రి పదవిని కోల్పోయారు. ఈ మేరకు మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్‌కి ఈ విషయాన్ని ఆల్రెడీ చేరవేయడంతో, అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి.. మంత్రి కొండా సురేఖ కాస్తా, మాజీ మంత్రి అయిపోతారు.
గతంలో, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు కొండా సురేఖ. అప్పట్లో ఆమె నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతారనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బజారుకీడ్చుతారనీ కొండా సురేఖ మీద అభియోగాలున్నాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్.. మధ్యలో వైఎస్ జగన్ వెంట రాజకీయంగా నడవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే, కొండా సురేఖ రాజకీయ జీవితంలో చాలా మలుపులున్నాయి.
భర్త కొండా మురళి ఆమెకు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆ కొండా మురళినే కొండా సురేఖకి బలం, బలహీనత కూడా.
అయితే, ఈసారి వివాదం కొండా సురేఖ కుమార్తె కారణంగా. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖ మెడకి చుట్టుకున్నాయ్.
కుమార్తె వ్యాఖ్యల్ని పరోక్షంగా సమర్థించడం వల్లే కొండా సురేఖ ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కొండా సురేఖకి బాగా తెలుసు. తెలిసీ, అత్యుత్సాహం ప్రదర్శించారామె.
ఢిల్లీకి వెళ్ళి మరీ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినాగానీ, ఆ ఫిర్యాదులేవీ ఫలించలేదు.
నిజానికి, కొండా సురేఖ వివాదాలకు కొత్తేం కాదు. నాగార్జునపైనా, సమంతపైనా ఆ మధ్య అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది కూడా.
మంత్రి పదవిని కోల్పోయిన కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా.? బీజేపీలోకి వెళతారా.? మళ్ళీ గులాబీ పార్టీ (బీఆర్ఎస్)లోకి దూకుతారా.? వేచి చూడాల్సిందే.
