Table of Contents
Ramabanam Review.. హిట్టు కాంబినేషనే.! కానీ, ఎందుకో ‘రామబాణం’ సినిమా పట్ల అంతగా బజ్ కనిపించలేదు విడుదలకు ముందు.! ఎందుకని.?
గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు రెండు సినిమాలొచ్చాయి. ఒకటేమో ‘లక్ష్యం’. ఇంకోటేమో ‘లౌక్యం’. రెండూ గోపీచంద్‌కి కమర్షియల్ విజయాలే ఇచ్చాయ్.
సో, హ్యాట్రిక్ హిట్ ఈ కాంబినేషన్‌లో ఖాయమని అంతా అనుకున్నారు. అదొక్కటి తప్ప, సినిమాకి సంబంధించి ఇంకో పాజిటివ్ ఎలిమెంట్.. సినిమా విడుదలకు ముందు కనిపించలేదు.
పాటలొచ్చాయ్.. ఒక్కటంటే ఒక్కటీ ఎక్కలేదు.! ప్రోమో సంగతి సరే సరి. ‘లక్ష్యం’లో గోపీచంద్ – జగపతిబాబు కలిసి నటించారు. ఈ సినిమాలోనూ ఈ ఇద్దరూ కలిసి నటించారు.
బంగారంతో గుడి కట్టెయ్..
ఇక, ‘ఖిలాడీ’ ఫేం డింపుల్ హయాతీ ఈ ‘రామబాణం’ సినిమాలో హీరోయిన్.! సినిమా ప్రమోషన్లలో ‘నా కోసం గుడికడితే, బంగారంతో కట్టెయ్యండి..’ అనేసింది పుసుక్కున.!
ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయిగానీ, సినిమాపై బజ్ పాజిటివ్‌గా మారలేదు. సినిమాలో వల్గర్‌గా వున్నారట కదా.? అని ఓ సినీ జర్నలిస్టు అడిగితే, ‘ఛ..ఛ.. అదేం లేదు’ అనేసింది డింపుల్ హయాతీ.
దాంతో, డింపుల్ హయాతీ అందాల ఆరబోతపై ఆశలు పెట్టుకున్న ఓ సెక్షన్ ఆడియన్స్ నీరుగారిపోయారు.
ఇంతకీ, ‘రామబాణం’ సినిమా ఎలా వుంది.? సినిమా కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.! 
Ramabanam Review.. రొటీన్ రొట్ట కొట్టుడు..
రొటీన్ కథ.. అంతకన్నా రొటీన్ కథనం.. పరమ రొట్ట కామెడీ.. వెరసి, ఇరవయ్యేళ్ళ క్రితం నాటి టెంప్లేట్ సినిమా.. అనే భావన కలుగుతుంది సినిమా చూస్తే.
చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయిన కుర్రాడు.. పెరిగి పెద్దవాడై ‘డాన్’గా మారతాడు. తిరిగి వచ్చి చూస్తే, తన కుటుంబం సమస్యల్లో వుందని తెలుసుకుంటాడు. ఆ సమస్యల్ని హీరో ఎలా అధిగమిస్తాడన్నది మిగతా కథ.!
ఎన్ని సినిమాలు చూడలేదు ఈ తరహా కథాంశంతో.! పోనీ, కథనం విషయంలో ఏమన్నా కొత్తదనం వుందా.? అంటే అదీ లేదు.
కమర్షియల్.. మాస్.. ఎంటర్టైన్మెంట్.. అంతా ఆ పాత ముతక వ్యవహారమే.! హీరోయిన్ జస్ట్ గ్లామర్ కోసమే.. అన్నట్టుంది. సీనియర్ నటుడు జగపతిబాబు పాత్రలోనూ కొత్తదనం ఏమీ లేదు.
గోపీచంద్ (Gopichand) సంగతి సరే సరి.! డైలాగులు, ఫైట్స్.. ఇంతే వ్యవహారం.! ఈ తరహా సినిమాలకు కాలం చెల్లింది.
కానీ, హ్యాట్రిక్ హిట్ కొట్టే ప్రయత్నంలో దర్శకుడు శ్రీవాస్ ఇంకోసారి ఔట్ డేటెడ్ కథాంశాన్ని తెరపైకి తెచ్చాడు.. బోల్తాపడ్డాడు.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ మమ అనిపిస్తాయ్.! ఎడిటింగ్ కూడా సోసో.!
తుప్పు పట్టిన బాణం.!
ఓటీటీలో కూడా ఈ తరహా సినిమాల్ని సింపుల్‌గా రిజెక్ట్ చేస్తున్న రోజులివి.! థియేటర్లలో ఇలాంటి రొటీన్ సినిమాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎందుకొస్తారు.?
‘రామబాణం’ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు తేజ ఓ మాట మాట్లాడాడు. పాప్ కార్న్ ఖర్చు భరించలేక మల్టీప్లెక్సులకి జనం రావట్లేదని.!
ఆ పాప్ కార్న్ ఉచితంగా ఇస్తామన్నాగానీ, థియేటర్లకు ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు.
చివరగా.. ఔట్ డేటెడ్ బాణం.. తుప్పు పట్టిన బాణం.! ఏదైనా అనేయొచ్చు.
			        
														