Table of Contents
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందా.? లేదా.? అన్నది వేరే విషయం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసు సంగతీ వేరే విషయం. కానీ, ఓ రాజకీయ నాయకుడు.. పైగా, ఓ రాజకీయ పార్టీ అధినేత.. అకుంఠిత దీక్షతో, పాదయాత్రకు ‘సంకల్పించడాన్ని’ ఎవరైనాసరే, అభినందించి తీరాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసమేనని ఈ రోజుల్లో ఎవరైనా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. చంద్రబాబు కావొచ్చు, వైఎస్ జగన్ కావొచ్చు, మరొకరు కావొచ్చు.. రాజకీయాలు చేసిందీ, చేస్తున్నదీ అధికారం కోసమే. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. ‘కాదు’ అని ఎవరు చెప్పినా, అది అవాస్తవమే అవుతుంది.
సవాలక్ష సమస్యల నడుమ బలమైన సంకల్పం
అక్రమాస్తుల కేసు విచారణ నేపథ్యంలో వైఎస్ జగన్, ప్రతి శుక్రవారం హైద్రాబాద్‌లో న్యాయస్థానం యెదుట హాజరు కావాల్సి వుంటుంది. మరి, సుదీర్ఘ పాదయాత్ర ఎలా చేయగలుగుతారు? అన్న ప్రశ్న రావడం సహజమే. పార్టీ శ్రేణులూ ఈ విషయమై ఆందోళన చెందాయి. ముందుగా, పాదయాత్ర నేపథ్యంలో విచారణ నుంచి మినహాయింపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జగన్. కానీ, జగన్‌కి అనుకూలంగా తీర్పు రాలేదు. దాంతో, ప్రతి శుక్రవారం విరామం.. అంటూ ప్రజా సంకల్ప యాత్రకు నడుం బిగించారు. శుక్రవారం పాదయాత్రకు విరామం.. అలాగే, గురువారం తక్కువ సమయం పాదయాత్ర చేసి, త్వరగా ఆ రోజు షెడ్యూల్‌ని ముగించేసేలా పార్టీ పక్కా ‘ప్లాన్’ రచించింది.
తొలి అడుగు పడిందిలా..
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు వైఎస్ జగన్, పాదయాత్రకు ముందు. ఆ తర్వాత తన తండ్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నుంచి ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు వేశారాయన. అక్కడి నుంచి రాయలసీమలోనిఅ అన్ని జిల్లాల్నీ కవర్ చేసేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి వచ్చేసరికి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర, మరింత ఉధృతమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ప్రజా సంకల్ప యాత్రను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, కనీ వినీ ఎరుగని రీతిలో చిత్తూరు జిల్లాలో జగన్‌కి ఘనస్వాగతం లభించింది. జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతమైన స్పందన తన పాదయాత్రకు రావడంతో వైఎస్ జగన్ ఉప్పొంగిపోయారు.
రాజధాని అమరావతిలోనూ అద్భుతమే
రాయలసీమ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలు.. ఆ తర్వాత గుంటూరు జిల్లాలోనూ పాదయాత్ర జరిగింది. ఎక్కడ చూసినా స్పందన తగ్గలేదు.. పైగా, పెరిగింది.. పెరుగుతూనే వస్తోంది. రాజధాని అమరావతిలోనూ అదే జోరు. అమరావతి పరిధిలో జరిగిన పాదయాత్ర కొంత మేర పలచగా సాగుతుందని అధికార పార్టీ అంచనా వేసినా, ఆ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ, కృష్ణా – గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. మరీ ముఖ్యంగా గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో కృష్ణా వారధిపై జనం పోటెత్తారు. ఆ చివర నుంచి ఈ చివరి వరకు బ్రిడ్జి మొత్తం జనసందోహంతో నిండిపోయింది.
గోదారమ్మ ఘనస్వాగతం
కృష్ణా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకీ, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోకీ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. కొవ్వూరు నుండి రాజమండ్రికి మధ్యనున్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై చారిత్రక దృశ్యం చోటు చేసుకుంది జగన్ పాదయాత్ర సందర్శంగా. కింద గోదారి.. పైన, జన సంద్రం.. వెరసి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి జగన్‌తోపాటు ఆయన అనుచరగణం పాదయాత్రకు మురిసిపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. 2014 ఎన్నికల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆశించిన రీతిలో సీట్లను సంపాదించలేకపోయిన వైఎస్సార్సీపీ, 2019 ఎన్నికల్లో గెలవడానికి తగ్గ ఆత్మస్థయిర్యాన్ని జగన్ పాదయాత్రతో సంపాదించుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
1000, 2000, 3000..
వెయ్యి కిలోమీటర్లు, 2 వేల కిలోమీటర్లు.. ఇలా జగన్ పాదయాత్రలో చారిత్రక ఘట్టాలు నమోదవుతూనే వస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. విజయనగరం తర్వాత శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్ళి, ఆ జిల్లాలోనే పాదయాత్ర ముగియనుంది. మొదటి అడుగు రాయలసీమలో, చివరి అడుగు ఉత్తరాంధ్రలో అన్నమాట. ఇచ్చాపురంలో ముగింపు కార్యక్రమాన్ని చారిత్రక ఘట్టంగా మార్చేందుకు పార్టీ ఇప్పటికే పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఎన్ని కిలోమీటర్లు నడిచామన్నది కాదు, ఎంతలా జనంతో మమేకమయ్యామన్నదే ముఖ్యమని వైఎస్ జగన్ చెబుతూనే వస్తున్నారు. అవును, రోజుల తరబడి.. నెలల తరబడి.. లక్షలాదిమందితో వైఎస్ జగన్ మమేకమవుతూ వచ్చారు. వైసీపీ ‘నవరత్నాల నినాదం’ జనంలోకి బలంగా వెళ్ళింది. జగన్ సంకల్పానికి జనం కూడా ‘జై’ కొడుతున్నారు. అయితే, ఇది జగన్‌ని అధికారంలోకి తెస్తుందా.? లేదా.? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.