Table of Contents
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ మల్టీస్టారర్‌గా ‘ఆర్.ఆర్.ఆర్.’ వార్తల్లోకెక్కేసింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కాదు, ముగ్గురు హీరోలు. అవును మరి, రాజమౌళి కూడా ఓ హీరోనే. సినిమాకి వచ్చే ఓపెనింగ్స్‌ని బట్టి.. ఆ ఓపెనింగ్స్ రాబట్టే ‘శక్తి’ని హీరో అని అభివర్ణించాల్సి వస్తే, రామ్‌చరణ్.. ఎన్టీఆర్.. ఆ కోవలోనే రాజమౌళి (Ram Charan, NTR, Rajamouli) కూడా సూపర్ స్టార్‌గానే ప్రస్తావించబడాలి.
రాజమౌళి (SS Rajamouli) తెలుగు సినిమాకి నయా సూపర్ స్టార్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. దటీజ్ రాజమౌళి. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు రాజమౌళి. ఓ తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో, బాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాల రికార్డుల్ని రాజమౌళి తుడిచి పెట్టేశాడు మరి. అందుకే, రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబో అంటే అది చారిత్రాత్మకమైన కలయికగానే చెప్పుకోవాల్సి వుంటుంది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా..
ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తోన్న ముహూర్తం రానే వచ్చింది. 11వ నెల, 11వ తేదీ, 11 గంటల సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) క్లాప్ కొట్టడంతో, ‘ఆర్.ఆర్.ఆర్.’ (RRR Movie) సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. అతి త్వరలో సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్ళబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు ప్రముఖులు ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘భళ్ళాలదేవ’ దగ్గుబాటి రానా, కళ్యాణ్‌రామ్.. ఈ వేడుకలో పాల్గొని, వేడుకకి మరింత గ్లామర్ తెచ్చారు.
ఆర్.ఆర్.ఆర్. టీమ్ ఇదే..
ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాని ‘ఆర్ఆర్ఆర్’గానే సంబోదిస్తున్నాం. ఈ సినిమా టెక్నికల్ క్రూ విషయానికొస్తే, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కె.కె. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు కానున్నాయి. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్. సాయి మాధవ్ బుర్రా, కార్కీ మాటలు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. విఎఫ్ఎక్స్ సూపర్విజన్ వి.శ్రీనివాస మోహన్ కాగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
మెగా నిర్మాత డివివి దానయ్య
ఈ ఏడాది ఆల్రెడీ ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డివివి దానయ్య, ప్రస్తుతం చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి మల్టీస్టారర్‌కీ ఈయనే నిర్మాత. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు డి.వి.వి. దానయ్య. బడ్జెట్ విషయంలో అస్సలేమాత్రం కాంప్రమైజ్ కాని నిర్మాతగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న దానయ్య, ఈ మల్టీస్టారర్‌కి బడ్జెట్ గురించి ఆలోచిస్తారా.? ఛాన్సే లేదు.
హీరోయిన్లెవరంటే..
హీరోయిన్లు ఎవరు.? మిగతా నటీ నటుల సంగతేంటి.? వంటి వివరాలపై చిత్ర యూనిట్ అతి త్వరలో స్పష్టతనివ్వనుంది. ‘తారక రామ్’, ‘రామ రావణ రాజ్యం’ తదితర సినిమా టైటిళ్ళు ప్రచారంలో వున్నా.. ఇంకా టైటిల్ విషయమై ఎలాంటి ఆలోచనా ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ చేయలేదట. ఎంతైనా, ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీ స్టారర్ కదా.. అధికారిక సమాచారం వచ్చేదాకా.. గాసిప్స్ అలా అలా వస్తూనే వుంటాయ్. ఏది ఏమైనా.. ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు.. కంబైన్డ్ పండగ చేసుకునేందుకు తగినంత స్టఫ్ అయితే దొరికిందిప్పుడు.