Table of Contents
Kaliyugam 2064 Review.. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది ‘కలియుగమ్ 2064’ సినిమా. ‘కలియుగం’ ప్రారంభమవుతూనే, ‘కల్కి’ సినిమా పోకడలు కనిపిస్తాయి.
రెసిడెంట్స్, లిబరేటర్స్.. సామాన్యులు.. ఇదీ ‘కలియుగమ్ 2064’ కథ. దాదాపుగా ‘కల్కి’లోనూ ఇదే పరిస్థితి. కాకపోతే, లిబరేటర్స్ వ్యవహారం ‘కల్కి’లో భిన్నంగా వుంటుంది.
‘కలియుగమ్ 2064’ విషయానికొస్తే, సినిమా ప్రధానంగా మనిషిని, మనిషే చంపుకుతినే కథ. దానికి, ‘కల్కి’ సినిమా తాలూకు టచ్ కొంత మేర ఇచ్చినట్లు అనిపిస్తుంది.
రెసిడెంట్స్ సైన్యం నుంచి తప్పించుకునే క్రమంలో, ఓ వ్యక్తి సేఫ్ ప్లేస్‌లోకి వెళతాడు. అక్కడ, అతనికి తిండి, నీరు దొరుకుతాయి.
తిండికి మొహం వాచిపోయి..
ఏళ్ళ తరబడి తిండికీ, మంచి నీళ్ళకీ మొహం వాచిపోయిన ఆ వ్యక్తి, అక్కడ తనకు నివాసం దొరికేసరికి కాస్త సంబరపడతాడు. కానీ, అది ట్రాప్ అని అతనికి తెలుస్తుంది.
నిజం తెలుసుకునేలోపు, అత్యంత కిరాతకంగా హత్యకు గురవుతాడతడు. అదే, సేఫ్ హౌస్‌లోకి కథానాయిక ఎంట్రీ ఇస్తుంది, రెసిడెంట్స్‌కి చెందిన ఓ కుర్రాడితో.

అయితే, అక్కడ కథానాయికకీ, అంతకు ముందు వచ్చిన వ్యక్తిలానే తొలుత మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది.. ఆ తర్వాత, అది ట్రాప్.. అని ఆమె తెలుసుకుంటుంది.
ఇంతకీ, అక్కడేం జరుగుతుంది.? అక్కడెలా ఆహారం, మంచి నీళ్ళు.. ఇతరత్రా సౌకర్యాలు లభిస్తాయి.? కథానాయిక, అక్కడి నుంచి ఎలా బయటపడింది.? ఇదంతా మిగతా కథ.
Kaliyugam 2064 Review.. బతుకు పోరాటం..
కిషోర్, పలు తెలుగు సినిమాల్లో నటించాడు. మంచి నటుడు. అతని నటనకు వంక పెట్టడానికేమీ లేదు. కాకపోతే, మొహాల్ని గుర్తు పట్టడం చాలా కష్టంగా మారింది.
శ్రద్ధా శ్రీనాథ్ విషయంలో కాస్త బెటర్ అంతే. ఆమె మంచి నటి. హావభావాల్ని అద్భుతంగా పండించగలదు. ఈ సినిమాలో ఆమె నటనకు వంక పెట్టాల్సిందేమీ లేదు.
కాకపోతే, నటీనటుల నటనా ప్రతిభకు, ఆ మేకప్ అడ్డంకిగా మారింది. సర్వైవల్ థ్రిల్లర్ గనుక, సినిమా నడుస్తున్న కాలానికి సంబంధించిన టైమ్ ఫ్రేమ్.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాని థ్రిల్లింగ్‌గా మలచడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
థ్రిల్లింగ్ సరే.. వేగం ఏదీ.?
అయితే, మెయిన్ ప్లాట్.. రెసిడెంట్స్ దగ్గరకి వెళ్ళడం.. అనేది ఓ కలగానే మిగిలిపోయింది. మరో పార్ట్ ఏమైనా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారేమో.!
ఓటీటీ వేదికగా సినిమా అందుబాటులో వుంది. టైమ్ పాస్ కోసం, థ్రిల్ కోసం ఓ లుక్కేయొచ్చు. కాకపోతే, చాలా ఓపిక వుండాలి, సినిమా పూర్తిగా చూడటానికి.
సాగతీత అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. ‘కల్కి’ సినిమా చూసినవాళ్ళకి, ఆ సినిమాలోని గ్రాండ్ లుక్.. ఇందులో లేకపోవడంతో నిరాశ కలుగుతుంది.
కానీ, సహజత్వానికి కాస్త దగ్గరగా వుండేలా, సినిమాని తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. లిమిటెడ్ బడ్జెట్‌లోనే, తాము అనుకున్న కాన్సెప్ట్‌ని తెరకెక్కించారు.