NTR Statue Amaravati.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
విగ్రహ ఏర్పాటు నిమిత్తం దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.
1750 కోట్ల రూపాయల ధనంతో, స్వర్గీయ ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
ఎన్ని స్కూళ్ళు, ఎన్ని ఆసుపత్రులు ఈ 1750 కోట్లతో నిర్మించవచ్చు.? అనే చర్చ ప్రజల్లో కూడా జరుగుతోంది. ప్రజా ధనాన్ని కేవలం ప్రజావసరాల నిమిత్తమే ఖర్చు చేయాల్సి వుంటుంది కదా మరి.!
కేవలం విగ్రహం మాత్రమే కాదు, నాలెడ్జ్ సెంటర్.. అంటూ ఏవేవో మాటలు చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఏం చెప్పినాసరే, ఎన్టీయార్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజా ధనాన్ని వృధా చేయడం సమర్థనీయం కాదు.
తెలుగు దేశం పార్టీ దగ్గర బోల్డంత ఫండ్ వుంటుంది.. స్వర్గీయ ఎన్టీయార్ కోసం పెద్దయెత్తున విరాళాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందుకొస్తారు.
ఇవన్నీ కాదు.. ఎన్టీయార్ కుటుంబమే, ఆ 1750 కోట్ల రూపాయల్ని వెచ్చించగల స్థాయి కలిగి వుంది. అలాంటప్పుడు, ప్రజా ధనాన్ని వృధా చేయడం ఎందుకు.?
నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే, పైగా ప్రముఖ నటుడు. జూనియర్ ఎన్టీయార్ కూడా ప్రముఖ సినీ నటుడు. కళ్యాణ్ రామ్ నిర్మాత, నటుడు. నారా లోకేష్, నారా చంద్రబాబునాయుడు.. వీళ్ళంతా ఆర్థికంగా బలంగా వున్నవాళ్ళే కదా.?
మరెందుకు కేవలం ప్రజాధనాన్ని మాత్రమే, విగ్రహ ఏర్పాటు కోసం ఖర్చు చేస్తున్నట్లు.? నో డౌట్, స్వర్గీయ ఎన్టీయార్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. పైగా, ఆయన గొప్ప నటుడు.
తెలుగు సినిమా, తెలుగు రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీయార్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగని వందల కోట్లు, వేల కోట్లు.. ఆయన విగ్రహ ఏర్పాటు కోసం తగలెయ్యడమా.?
వాస్తవానికి, ఇలాంటి విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వాలు నడిపేవారికి నిగ్రహం అవసరం.! ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు.
