Home » ముద్రాభిప్రాయమ్: పంచాయితీ ఎన్నికలతో వైసీపీ పుంజుకుందా.?

ముద్రాభిప్రాయమ్: పంచాయితీ ఎన్నికలతో వైసీపీ పుంజుకుందా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Mohan Reddy

YSRCP Panchayat Elections Wave.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ పుంజుకుందా.? అంటే, పుంజుకుందనే చెప్పక తప్పదు.

కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల్లో కూటమి సత్తా చాటిన మాట వాస్తవం.

అయినాసరే, కూటమిలో సీట్ల సర్దుబాటు లొల్లి, ఇతరత్రా గొడవల కారణంగా, వైసీపీ కొంత మేర లాభపడింది. గ్రామ పంచాయితీ ఎన్నికలొచ్చేసరికి సీన్ మారిపోయింది.

ఏకగ్రీవాల సంగతి పక్కన పెడితే, పోలింగ్ జరిగిన గ్రామ పంచాయితీల వరకూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా, చాలా బలంగా పుంజుకుంది.

కూటమి కంటే తక్కువ పంచాయితీలనే వైసీపీ గెలుచుకున్నా, ఇది నిజానికి అసాధారణ విజయంగానే చెప్పుకోవాల్సి వుంటుంది.

YSRCP Panchayat Elections Wave.. దాదాపు వెయ్యి గ్రామాల్లో ఎగిరిన వైసీపీ జెండా..

దాదాపు వెయ్యి గ్రామ పంచాయితీల్ని వైసీపీ గెలచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ 2 వేల కంటే తక్కువ చోట్ల గ్రామ పంచాయితీల్ని సొంతం చేసుకుంది.

గతంలో, అంటే వైసీపీ హయాంలో పంచాయితీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. వాటితో పోల్చితే, విపక్షంగా వైసీపీ మంచి బలాన్ని ప్రదర్శించినట్లే చెప్పుకోవచ్చు.

అయితే, పంచాయితీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరగవు. పైగా, గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఈక్వేషన్లు చాలా భిన్నంగా వుంటాయన్న వాదనా లేకపోలేదు.

సాధారణంగా, అధికారంలో వున్న పార్టీలు ‘అన్నీ మావే’ అని చెప్పుకోవడం చూస్తాం. గతంలో వైసీపీ అలానే చేసింది.

ఇప్పుడు, కూటమికి మద్దతిచ్చే మీడియా కూడా, వైసీపీకి గౌరవ ప్రదమైన సీట్లను కట్టబెట్టడం గమనార్హం.

టీడీపీకి మింగుడు పడని ఫలితాలు..

ఇదే కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీకి అస్సలేమాత్రం మింగుడుపడ్డం లేదు. మిత్ర పక్షం జన సేన పార్టీకి చెందిన అభ్యర్థుల్ని తొక్కి పెట్టింది టీడీపీ. ఇదే టీడీపీ చేసిన అతి పెద్ద పొరపాటు.

ఇక్కడ జనసేన పార్టీ తప్పిదం కూడా లేకపోలేదు. పోటీ చేయడానికి బలం వున్నా, తగినన్ని స్థానాల్లో నిలబడలేకపోయింది.

పంచాయితీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండానే జరుగుతాయి గనుక, జనసేన అభ్యర్థుల్ని అన్ని చోట్లా పోటీకి నిలబెట్టి వుండాల్సింది. అలా చేయలేదు.

ఫలితంగా, జన సేన పార్టీ మరీ తీసి కట్టుగానే కొన్ని చోట్ల విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రామ స్థాయిలో బలపడటానికి అద్భుతమైన అవకాశం జన సేన పార్టీకి ఈ పంచాయితీ ఎన్నికలు.

అద్భుతమైన ఈ అవకాశాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ చేజార్చుకున్నారు. ఓటర్లలోనూ ఇదే చర్చ జరుగుతోంది.

డిప్యూటీ సీఎం పాలనపై సానుకూలత వున్నా..

సంబంధిత శాఖా మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పట్ల గ్రామీణ ఓటర్లు సానుకూలంగానే వున్నా, పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో జన సేన విఫలమైంది.

మరోపక్క, అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ అద్భుతంగా ఉపయోగించుకుంది. కూటమి కుంపట్లను క్యాష్ చేసుకుంది.

ముందు ముందు వైసీపీ మరింత బలం పుంజుకోవడానికి పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తాయన్నది నిర్వివాదాంశం.

అదే సమయంలో, కూటమి పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంది. అందునా, జన సేన పార్టీ ఇప్పటికిప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగాలి. పార్టీ క్యాడర్‌కి సరైన దిశా నిర్దేశం చేయాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group