కమెడియన్ సునీల్, హీరోగా సూపర్ హిట్ కొట్టింది ‘మర్యాదరామన్న’ సినిమాతో. దాదాపు అలాంటి షేడ్ వున్న టైటిల్‌తో సునీల్ హీరోగా మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. ఆ కొత్త సినిమా టైటిల్ ‘వేదాంతం రాఘవయ్య’ (Sunil Vedantham Raghavayya). టైటిల్ అదిరింది కదూ.! ఈ టైటిల్‌తో సినిమా అంటే, సునీల్‌ని తప్ప ఇంకొకర్ని హీరోగా ఊహించుకోలేమేమో.!
ఈ కొత్త సినిమాకి కథ అందిస్తోన్నది ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కావడం గమనార్హం. మరో విశేషమేంటంటే ఈ సినిమాకి ఆయనే సమర్పకుడు కూడా. 14 రీల్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దర్శకుడెవరు.? హీరోయిన్ ఎవరు.? సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
టైటిల్ లోగోని మాత్రం ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు. ‘వేదాంతం రాఘవయ్య’ టైటిల్ లోగో వెనుకాల కరెన్సీ నోటు కన్పిస్తోంది. అంటే, కథకి డబ్బుతో లింకు చాలా గట్టిగానే వుండబోతోందన్నమాట. ఇంతకీ, రాఘవయ్యగా సునీల్ ఏం చేస్తాడు.? ‘వీడు అస్తమానం వేదాంతం చెబుతుంటాడ్రా..’ అని మనం చాలా సందర్భాల్లో అంటుంటాం.
మరి, రాఘవయ్య పాత్ర ద్వారా సునీల్ చెప్పబోయే వేదాంతం ఎలా వుండబోతోంది.? ఏమోగానీ, ఇదొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ‘మర్యాద రామన్న’ తరహాలోనే ఈ సినిమా కూడా వుంటుందని అంటున్నారు.
అన్నట్టు కొన్నాళ్ళ క్రితం హీరోగా జోరు పెంచినట్లే పెంచి, ఆ తర్వాత కాస్త డల్ అయిన సునీల్, ఇప్పుడు మళ్ళీ హీరోగా రేసులోకి దూసుకొస్తున్నట్లున్నాడు ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాతో. ఇదిలా వుంటే, ‘కలర్ ఫొటో’ సినిమా కోసం సునీల్ నెగెటివ్ రోల్‌లో కన్పించనున్న విషయం విదితమే.