ఏదో ఒక రోజు నేను తెలంగాణ ముఖ్యమంత్రినవుతాను.. అంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య (YS Sharmila Eyes On Telangana Chief Minister Post) రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చనీయాంశమవుతోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడున్న రాజకీయాలే అంత.
పార్టీ ఫిరాయింపులు రాజ్యమేలుతున్న రోజులివి. నాయకులు డబ్బుల కోసమో, పదవుల కోసమో పార్టీలు మారడం విరివిగా జరుగుతున్న ఈ రోజుల్లో ఏదైనా జరగొచ్చు. షర్మిలకి కూడా అలాగే కాలం కలిసి రావొచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి అవలేదా.? రేప్పొద్దున్న షర్మిల కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
‘అసలు తెలంగాణలో ఆ రాజకీయ శూన్యత ఎక్కడుంది.?’ అని పలువురు ప్రశ్నించొచ్చుగాక. అసలు రాజకీయ శూన్యతతో సంబంధమేముంది.? ఓటర్లు ఎలాంటి ‘సెంటిమెంట్’కి కనెక్ట్ అవుతారో ఊహించడం కష్టం. తెలంగాణలో గులాబీ పార్టీ (టీఆర్ఎస్)ని కాదని మరో పార్టీకి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి మామూలుగా అయితే లేదు.
కానీ, గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ.. తమ ఉనికిని చాలా గట్టిగానే చాటుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వెన్నులో వణుకు పుట్టించింది. అంతకు ముందు దుబ్బాకలో గులాబీ పార్టీని ఓడించింది.
షర్మిలపై ‘ఆంధ్రా’ ముద్ర వేయడం తెలంగాణ రాష్ట్ర సమితికి కష్టమేమీ కాదు. కానీ, ఓటర్లు.. ఇదివరకటిలా ఆలోచిస్తున్నారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఖమ్మంలో బహిరంగ సభ, హైద్రాబాద్ వేదికగా నిరుద్యోగ సమస్యలపై నిలదీత.. అంటూ చేపట్టిన దీక్ష.. ముందు ముందు ఇంకెలాంటి కార్యక్రమాలకు షర్మిల (YS Sharmila Eyes On Telangana Chief Minister Post) శ్రీకారం చుట్టనున్నారోగానీ, రాజకీయాల్లో దేన్నీ అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఏమో.. గుర్రం ఎగరావచ్చు.