Thala Ajith Kumar 30 Years As Actor.. మామూలుగా నాణేనికి రెండు వైపులే వుంటాయి. ఒకటి బొమ్మ, ఇంకోటి బొరుసు. కానీ, ఇక్కడ మూడో వైపు కూడా వుందట. తమిళ హీరో అజిత్ కుమార్, సినీ పరిశ్రమలో ముప్ఫయ్యేళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. అందులో నాణేనికి మూడు వైపులంటూ వ్యాఖ్యానించాడు.
ఓ వైపు అభిమానులు, ఇంకో వైపు ద్వేషాన్ని ప్రదర్శించేవారు, మరో వైపు తటస్థులు.. అన్నది అజిత్ కుమార్ భావన. నిజమే, అజిత్ కుమార్ అంటే అభిమానంతో పడిచచ్చిపోయేవాళ్ళు వేలాది, లక్షలాది మంది వున్నారు తమిళనాడులో. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది.
నిజానికి, అజిత్ కుమార్ అంటే ఇష్టపడనివారుండరు. చాలా తక్కువమంది హేటర్స్ వుంటారు ఆయనకి. అది కూడా, సినీ రంగంలో.. ఆయన ప్రత్యర్థులుగా భావించబడుతున్న కొందరు హీరోలకు సంబంధించిన అభిమానులు మాత్రమే.
తమిళ సినీ పరిశ్రమలో అజిత్ – విజయ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వుంది. అడపా దడపా విజయ్‌కి వ్యతిరేకంగా, అజిత్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ అత్యంత జుగుప్సాకరంగా నడుస్తుంటాయి. ఈ వ్యవహారంపైనా అజిత్ కుమార్ తాజాగా స్పందించాడు.
‘లివ్ లెట్ లివ్..’ అంటూ అజిత్ పేర్కొనడం తాలూకు ఉద్దేశ్యం.. ‘మనం జీవిద్దాం.. ఇతరుల్ని జీవించనిద్దాం..’ అని.. ఇతర హీరోల అభిమానులకు అజిత్ కుమార్ తనదైన స్టయిల్లో ఇలా రిటార్ట్ ఇచ్చాడన్నమాట.
“Fans, Haters & Nueutrals are 3 sides of same coin. I graciously accept the Love from fans, the hate from the haters & the unbiased views of the neutrals. Live & Let Live! Unconditional Love Always!! Ajith Kumar”
ఇలా చెప్పాడు అజిత్ కుమార్ తన తాజా ప్రకటనలో. అభిమానుల ప్రేమని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. అలాగే, ద్వేషించేవారి ద్వేషాన్ని కూడా. తటస్తుల నుంచి ఎలాంటి పక్షపాతం లేని అభిప్రాయాల్ని గౌరవిస్తాను.. అన్నది అజిత్ కుమార్ ప్రకటన పూర్తి సారాంశం.