అక్కడ నెత్తురు ఏరులై పారుతుంది. ఎడా పెడా తూటాలు పేలతాయి. యుద్ధ విమానాలు గర్జిస్తాయి. బాంబుల మోత మోగుతుంది. సుదీర్ఘ కాలంగా ఇదే తంతు. మహిళలకు రక్షణ లేదు. మగాళ్లకూ రక్షణ లేదు. చిన్న పిల్లలకు భవిష్యత్తే లేదు. ఇదీ ఆప్ఘనిస్థాన్ రక్త చరిత్ర (Afghanistan Burning).
అయినా ఆఫ్ఘనిస్థాన్ ఎలా పోతే మనకెందుకు.? అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, అక్కడున్నదీ మనలాంటి మనుషులే. ఒకప్పుడు గాంధార దేశం అని ఆఫ్ఘనిస్థాన్ గురించి మనం చెప్పుకుంటాం. మహా భారతంలో కౌరవుల తల్లి అయిన గాంధారి పుట్టిన నేల ఇదేనని చెబుతుంటాం. ఆ పురాణాల చరిత్ర వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు.
Also Read: మీ మొబైల్ ఫోన్ మీకు శతృవు ఐతే.!
ఆఫ్ఘనిస్థాన్ పేరు చెబితే, క్రికెటర్ రషీద్ ఖాన్ గుర్తుకొస్తాడు. తెలుగు రాష్ర్టాల క్రికెట్ అభిమానులకు హాట్ ఫేవరేట్ ఇతడు. ఎందుకంటే, సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాడు. ‘మా జీవితాలు నాశనమైపోతున్నాయ్.. మమ్మల్ని ఒంటరిగా వదిలేయొద్దు..’ అని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు రషీద్ ఖాన్. అయ్యో పాపం అంటున్నారు చాలా మంది.
ఈ పాపానికి కారణం ఎవరు.? ఒకప్పటి సోవియట్ యూనియన్ అనుకోవాలా.? ఇప్పటి అమెరికా అనుకోవాలా.? ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ తమ బాధ్యత కాదని అమెరికా చేతులు దులుపుకుంది. మరి, వేల కోట్లు ఖర్చు చేసి, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల వేట పేరుతో వేలాది, లక్షలాది ప్రాణాలు తీసిందెందుకు.?
Also Read: దోచుకున్నోడికి దోచుకున్నంత
నడిరోడ్డుపై ముష్కర మూకలు మారణాయుధాలతో ప్రజల్ని భయపెడుతోంటే, ఆఫ్ఘనిస్థాన్ విలవిల్లాడుతోంది. సాయం కోసం ఎదురు చూస్తోంది. కానీ, సాయం చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా, పెద్దగా ఫలితం ఉండదు. కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మెరుగుపడినా, తిరిగి మళ్లీ అదే అల్లకల్లోలం. అంతకు మించిన మారణ హోమం.
ఆఫ్ఘనిస్థాన్‌ది (Afghanistan Burning) అంతులేని వ్యధ, అదొక రావణ కాష్టం. రగులుతూ ఉండాల్సిందే. అంతేనా.?