Table of Contents
Allu Arjun Telangana Police.. సినీ నటుడు అల్లు అర్జున్, మీడియా ముందుకొచ్చి.. చాలా విషయాలు మాట్లాడాడు, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి.
ఈ క్రమంలో తన అరెస్టు, తదితర వ్యవహారాల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ, ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించాడు. ఇది కాస్తా, కొత్త వివాదానికి దారి తీసింది.
నిజానికి, మధ్యంతర బెయిల్ మీదున్న అల్లు అర్జున్, ప్రెస్ మీట్ పెట్టడమే పెద్ద తప్పు.. అన్నది న్యాయ నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
Allu Arjun Telangana Police.. తెలంగాణ సీఎం అసెంబ్లీలో..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వ్యవహారం వేరు. ఆయన దగ్గరే హోం శాఖ వుంది. మజ్లిస్ శాసన సభ్యుడు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి, సీఎం హోదాలో బదులిచ్చారు.
ఘటన జరిగిన నేపథ్యంలో, థియేటర్ నుంచి వెళ్ళిపోకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీస్ అధికారి హెచ్చరించాకనే, అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళాడన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సారాంశం.

అంతే కాదు, పోలీసులు ఎంత వారిస్తున్నా, రోడ్ షో చేశాడని.. ఇది అహంకారం కాక మరేమిటని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఆషామాషీగా ఆ వ్యాఖ్యలు చేశారని అనుకోలేం.
పైగా, అల్లు అర్జున్ అరెస్టు సమయంలో, పోలీసు అధికారుల మీద దురుసుగా అల్లు అర్జున్ ప్రవర్తించాడని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం గమనించాల్సిన ముఖ్యమైన విషయం.
అల్లు అర్జున్ కథ వేరు..
నాపై నిందలు మోపుతున్నారు.. నా ఇమేజ్‌ని దెబ్బ తీస్తున్నారు.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మీడియా ముందర అల్లు అర్జున్ ‘విక్టిమ్ కార్డ్’ ప్లే చేసే ప్రయత్నం చేశాడు.
వాస్తవానికి, ప్రెస్ మీట్ పెట్టడమే శుద్ధ దండగ.. పైగా, న్యాయ స్థానంలో ఇదో ఇబ్బందికరమైన విషయంగా అల్లు అర్జున్‌కి మారే అవకాశం లేకపోలేదు.

న్యాయ సలహా తీసుకున్నాకే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
అసలు, న్యాయ సలహా అనేదే నిజమైతే, మధ్యంతర బెయిల్ మీదున్న అల్లు అర్జున్, మీడియా ముందుకు వచ్చే పరిస్థితే వుండదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన.
తనను థియేటర్లో ఏ పోలీస్ అధికారీ, వెళ్ళిపోమని చెప్పలేదనీ.. తన టీమ్ నుంచి తనకు ఆ సూచన వచ్చిందని అల్లు అర్జున్ చెప్పడమే కాదు, తప్పుడు సమాచారం.. అంటూ వ్యాఖ్యానించాడు.
పోలీస్ గుస్సా..
‘పుష్ప రాజ్’ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మీద పోలీస్ ఉన్నతాధికారులు గుస్సా అయ్యారు. ఓ పోలీస్ అధికారి మీడియా ముందుకొచ్చి, ‘రీల్స్ కట్ అయిపోతాయి’ అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
మధ్యంతర బెయిల్ మీదున్న నువ్వు, పోలీస్ శాఖ మీద ఆరోపణలు చేస్తావా.? అని సదరు అధికారి మండిపడ్డారు.
Also Read: ఎర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి: తప్పొప్పుల పంచాయితీ.!
‘మేం పెట్టిన సెక్షన్లు తప్పు అని నువ్వు భావిస్తే, దానికి వేదికలున్నాయ్.. మా మీద డిఫేమేషన్ కేస్ కూడా నువ్వు వేసుకోవచ్చు.. అంతేగానీ, ఇదేం పద్ధతి.? అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు సదరు అధికారి.
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లుందిప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి. ‘పుష్ప రాజ్’ అనే పాత్ర నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి, ఆలోచిస్తే.. తానెంత తప్పు చేస్తున్నదీ అర్థమవుతుంది.