టీమిండియా అతన్ని వద్దనుకుంది.. వరల్డ్ కప్ పోటీల కోసం అంబటి రాయుడిని (Ambati Rayudu CSK IPL 2020) పక్కన పెట్టింది. కానీ, ఆ అంబటి రాయుడే.. చెన్నయ్ సూపర్ కింగ్స్‌కి అద్భుత విజయాన్ని అందించాడు.
కరోనా నేపథ్యంలో అసలు జరుగుతుందా.? లేదా.? అన్న అనుమానాలతో ఎట్టకేలకు యూఏఈలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంచనాలకు మించి జనాన్ని ఎట్రాక్ట్ చేయగలగుతోంది. ఓపెనింగ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎదురుచూశారు.
స్టేడియంలో క్రికెట్ అభిమానులు లేరు. అంతా వాళ్ళ వాళ్ళ ఇళ్ళ నుంచే మ్యాచ్‌ని తిలకించారు. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ – చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు సారధి రోహిత్ శర్మ, చెన్నయ్ సూపర్ కింగ్స్ సారధి ధోనీ.. ఇద్దరూ ఈ మ్యాచ్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
చివరి ఓవర్ వరకూ ఆట రసవత్తరంగా సాగింది. చెన్నయ్ సూపర్ కింగ్స్‌దే పై చేయి అయ్యింది. దానిక్కారణం రాయుడు బ్యాట్ ఝుళిపించడమే. అస్సలేమాత్రం బెదురు లేకుండా రాయుడు చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో రాయుడు దుమ్ము రేపేశాడు.
‘వరల్డ్ కప్ కోసం రాయుడిని ఎంపిక చేసి వుంటే.. టీమిండియా, వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుని వుండేదే..’ అని ఇప్పుడంతా అంటున్నారు. దురదృష్టం అప్పట్లో సెలక్టర్లకు, జట్టు మేనేజ్‌మెంట్‌కీ, ఆఖరికి కెప్టెన్‌కి కూడా రాయుడంటే నమ్మకం లేకుండా పోయింది.
ఆ కారణంగానే రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విషయం విదితమే. రాయుడు ఎప్పుడూ విలువైన ఆటగాడే. దురదృష్టం అతని చుట్టూ రాజకీయాలు నడుస్తూనే వున్నాయి. బహుశా రాయుడు తెలుగోడు కాబట్టే ఈ చిన్న చూపు అనుకోవాలేమో.!
ఏదిఏమైతేనేం.. వచ్చిన అవకాశాన్ని రాయుడు సద్వినియోగం చేసుకున్నాడు. తన దమ్మెంతో చూపించేశాడు. విమర్శకులకు గట్టిగానే సమాధానమిచ్చాడు.. తనను వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయని సెలక్టర్లకు కూడా.! ఇక, ఈ మ్యాచ్‌లో ధోనీ చివర్లో బ్యాటింగ్‌కి దిగాడు.
తొలి బంతికే ఔట్ అయ్యే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ, డీఆర్‌ఎస్‌ని ఉపయోగించుకుని, నాటౌట్‌గా నిలిచాడు. మరోపక్క కీలక సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుని, కరన్‌ని తనకంటే ముందు బ్యాటింగ్‌కి దించడం ద్వారా తన ఇమేజ్ కంట్టే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని నిరూపించాడు. దటీజ్ ధోనీ.!