Table of Contents
Andhra Pradesh Cyclone Montha.. తుపాను ముంచుకొస్తోందనే వాతావరణ శాఖ అంచనాలు ప్రతిసారీ ఒకేలా వుండవు.!
కొన్నిసార్లు నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుండొచ్చు.. కొన్నిసార్లు అసలు నష్టమేమీ లేకపోవచ్చు.! నష్టం జరగకపోతే మంచిదే కదా.!
కానీ, వాతావరణ శాఖ హెచ్చరికలపై, ప్రభుత్వాల అప్రమత్తతపై.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు.. ఒకింత చికాకు కలిగిస్తాయి.!
ఇది సోషల్ మీడియా యుగం.! అనవసరపు హంగామా చేసి, అలజడి సృష్టించారు.. పాలకులు పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. అనే రాజకీయ విమర్శలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి.
Andhra Pradesh Cyclone Montha.. అప్రమత్తత.. అత్యవసరం.!
సముద్రంలో అల్ప పీడనం, వాయుగుండం, తుపాను.. ఇలా మార్పులు చోటుచేసుకుంటూ వుంటాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి.
తుపానుతో పరిస్థితులు అతలాకుతలమవుతాయి. ఆ తుపాను, పెను తుపాను అయితేనో.? విధ్వంసం అంచనాలకు మించి వుంటుంది.
విశాఖ మీద హుద్‌హుద్ విరుచుకుపడ్డాన్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.? కోనసీమ ఉప్పెన, దివిసీమ ఉప్పెన.. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో.. ఎప్పటికీ మర్చిపోలేం.
వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు, ప్రభుత్వాలు ముందస్తుగా అప్రమత్తమవుతుండడం.. ఇవన్నీ, విపత్తుల వేళ ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతున్నాయి.
ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు..
ఇప్పుడు సైక్లోన్ మోంథా ముంచుకొస్తోంది. స్కూళ్ళకు, ఇతర విద్యా సంస్థలకు ప్రభావిత ప్రాంతాల్లో సెలవులు ఇచ్చేశారు. అయితే, వాతావరణం, ప్రశాంతంగానే వుంది కదా.. అనే చర్చ మొదలైంది.
తుపాను తీరం తాకే సమయంలో, పరిస్థితులు అతలాకుతలమవుతాయి. తీరం దాటుతున్న సమయంలో విధ్వంసం మరింత ఎక్కువగా వుంటుంది.
సముద్రంలో వున్నంతసేపూ తుపాను వేగం తక్కువగా వుంటుంది. తీరాన్ని సమీపించే సమయంలో, తీవ్రత చాలా చాలా ఎక్కువవుతుంది. వేగంగా దూసుకొస్తుంది.
ఈ కారణంగానే, వర్షపాతం ఎంత నమోదవుతుందన్నదానిపై వాస్తవిక అంచనాల కంటే, ఎక్కువ స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమవ్వాల్సి వస్తోంది.
ప్రజల సహకారం.. అత్యవసరం..
ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వున్నా, అధికార యంత్రాంగం ఎంత కష్టపడి పని చేస్తున్నా.. తుపాన్ల లాంటి విపత్తుల సమయంలో, ప్రజల సహకారం చాలా చాలా ముఖ్యం.
అధికారుల సూచనల్ని ప్రజలు తప్పక పాటించాలి. తీర ప్రాంతాల ప్రజలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో అధికారులతో వాదులాటకు దిగడం సబబు కాదు.
విద్యా సంస్థలకు సెలవులిస్తే, సినిమా థియేటర్లకు.. ఇతర ఎంటర్టైన్మెంట్ జోన్లకు తిరగడం.. లోతట్టు ప్రాంతాల్లో విహార యాత్రలకు వెళ్ళడం ఈ మధ్య ఎక్కువైపోయింది.. విపత్తుల సమయాల్లో కూడా.
Also Read: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
ఇక్కడే, పౌరులు తమ బాధ్యతని గుర్తెరగాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తుపాన్ల తాకిడి ఎక్కువే. తుపాన్ల పట్ల కనీస పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి విద్యావంతులు.
ప్రభుత్వాలున్నది ప్రజల కోసమే. ఆ ప్రజా భద్రత కోసం విపత్తుల వేళ, ప్రభుత్వాలు చేసే సూచనల్ని తప్పక పాటించడం పౌరుల విధి.!
సైక్లోన్ మోంథా.. ఎక్కువ నష్టాన్ని కలగజేయకూడదని ఆశిద్దాం. ప్రాణ నష్టానికి ఆస్కారం లేకుండా, ప్రజలూ అప్రమత్తంగా వుండాలని కోరుకుందాం.
