Table of Contents
Andhra Pradesh Present Political Trend.. ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు జరిగిపోవు కదా.!
2029లో ఆంధ్ర ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో మాత్రం, 2028 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే పలు సర్వే సంస్థలు, ప్రజాభిప్రాయం దిశగా కసరత్తులు చేసేస్తున్నాయి.
నిజానికి, చాన్నాళ్ళుగా ఈ సర్వేలు జరుగుతున్నాయి. ఫలానా సర్వే, ఫలానా ఫలితాన్నిచ్చిందంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, వెబ్ అలాగే సోషల్ మీడియాలోనూ ‘డేటా’ కనిపిస్తోంది.
కానీ, ఇదెంత నిజం.? తెలుగు రాష్ట్రాల్లో, అందునా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులున్నాయి.? టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమేంటి.?
2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2029 ఎన్నికల నాటికి పుంజుకుంటుందా.? లేదా.?
Andhra Pradesh Present Political Trend.. సర్వేల జోరు.. రాజకీయ పార్టీల కంగారు..
ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఆ దిశగా సర్వే సంస్థలూ ప్రజాభిప్రాయాన్ని చేపడుతున్నాయి. చిత్రంగా, ప్రజలేమో.. ఇలాంటి సర్వేల్ని అస్సలు ఎంటర్టైన్ చెయ్యట్లేదు.
కానీ, ఆయా రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి మరీ సర్వేలు చేయిస్తున్నాయి గనుక, ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురైనా, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రజాభిప్రాయాల్లో నిజమెంత.? ఇప్పుడున్న ప్రజాభిప్రాయం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..ఇలానే ఆ ఎన్నికల పోలింగ్ సమయానికీ వుంటుందా.? ఇవి మళ్ళీ చిక్కు ప్రశ్నలే.
ఎన్నికలంటే, పొత్తులు.. ఇతరత్రా వ్యూహాలు.. ఇవన్నీ కీలక భూమిక పోషిస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడూ కూటమిగానే వుంటాయా.?
ఏ నియోజక వర్గం నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు.? ఇవన్నీ కీలకమైన అంశాలే మరి.
అవన్నీ తేలకుండా, సర్వేలు చేసి ఏం సాధిస్తారు.? ప్రజలైనా, ఊహాత్మక అంశాలపై సరైన సమాధానమెలా ఇస్తారు.? ఛాన్సే లేదు.
జగన్ మీద వ్యతిరేకత ఇంకా పోలేదు..
ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత ఇంకా పోలేదు. కూటమి పాలనపై చిన్నా చితకా అబ్జెక్షన్స్ వున్నాగానీ, ‘జగన్ పాలన కంటే బెటర్’ అనే అభిప్రాయమే ప్రజల నుంచి వస్తోంది.
గతంలో వై నాట్ 175 అని నినదించిన వైసీపీ, ఇప్పుడైతే, ‘మ్యాజిక్ మార్క్ దాటితే చాలు..’ అనుకుంటోంది. ఎలాగోలా గెలిస్తే చాలు.. అన్న అభిప్రాయానికి వైసీపీ వచ్చేసింది.
ఇదిలా వుంటే, జన సేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విన్నా జన సేన పార్టీ గురించిన చర్చే జరుగుతోంది.
అందుకే, జన సేన పార్టీ కూడా.. ఆయా నియోజక వర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది. బీజేపీకి కూడా స్కోప్ వున్నా, ఆ పార్టీ అధినాయకత్వంలో అలసత్వం కనిపిస్తోంది.
టీడీపీ వ్యూహాత్మకం..
తెలుగు దేశం పార్టీ, గత అనుభవాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అసంతృప్తుల్ని బుజ్జగించడంతోపాటు, చిన్నా చితకా లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు పార్టీ పరంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది.
నిజానికి, వైసీపీకి ఇదొక చక్కటి అవకాశమే. కాకపోతే, వైఎస్ జగన్ బెంగళూరుకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. తద్వారా సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారాయన.
పాదయాత్రతో వైఎస్ జగన్ తిరిగి, తన శక్తిని పుంజుకుంటారా.? వైసీపీ బలోపేతమవుతుందా.? ప్రజల మన్ననల్ని గెలుచుకుంటుందా.? అన్నది వేచి చూడాల్సిందే.
- yeSBee
