ఏడు దశాబ్దాల సస్పెన్స్‌కి తెరపడింది. జమ్మూకాశ్మీర్ ఇకపై ప్రత్యేక రాష్ట్రం కాదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం (Article 370 Scrapped) తీసుకుంది. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించిన విషయం విదితమే.
అసలెందుకు జరుగుతోంది అక్కడ ఇంత హంగామా.? అని అంతా ఆశ్చర్యపోయారు. అమర్‌నాథ్ యాత్రీకులు, జమ్మూకాశ్మీర్ యేతర విద్యార్థులు.. ఇతర పర్యాటకులు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి.. ఆ ఆదేశాలకు తగ్గట్టే.. జమ్మూ కాశ్మీర్ నుంచి దాదాపుగా జమ్మూకాశ్మీర్ యేతరులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
ఇదంతా, జమ్మూ కాశ్మీర్‌కి వున్న ప్రత్యేక రాష్ట్ర హోదాని రద్దు చేయడానికేనన్న విషయం ఈ రోజు ఉదయం మాత్రమే బయటకు పొక్కింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి జమ్మూ కాశ్మీర్‌పై ప్రకటన చేయడం, మరోపక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతోపాటు జమ్మూలోనూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే బిల్లుని అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ.. Article 370 Scrapped
పెద్ద నోట్ల రద్దు కావొచ్చు.. ఇతరత్రా కొన్ని నిర్ణయాలు కావొచ్చు.. నరేంద్ర మోడీ పట్ల కొంత వ్యతిరేకత దేశంలో పెరిగేలా చేసిన మాట వాస్తవం. కానీ, ఇప్పుడాయన్ని వ్యతిరేకించేవారు బహుశా దేశంలో చాలా తక్కువమంది వుంటారేమో. రాజకీయ విమర్శలు ఇతర రాజకీయ పార్టీల నుంచి రావొచ్చుగాక. కానీ, దశాబ్దాలుగా రగులుతున్న జమ్మూకాశ్మీర్ అనే రావణకాష్టం.. ఇకపై చల్లబడనుంది.
మంచుకొండల్లో ఇకపై రక్తపాతం వుండకపోవచ్చు. కొద్ది రోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగవచ్చునేమో.. కానీ, అవి ఎక్కువ కాలం వుండవు. ఎందుకంటే, ఇకపై దేశమంతా ఒక్కటే. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వున్న పరిస్థితులే కాశ్మీర్‌లోనూ వుంటాయి. దేశమంతా ఒకటే రాజ్యాంగం అమలవుతుంది ఇకపై.
దేశంలో ప్రతిపౌరుడూ కాశ్మీర్‌లోనూ నివాసం పొందొచ్చు. మొత్తమ్మీద, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్‌ని ప్రకటించిన కేంద్రం, లడక్‌ని మాత్రం కేవలం కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఈ విభజనతో జమ్మూకాశ్మీర్ ప్రజలకే కాదు, యావత్ భారతదేశానికే తీవ్రవాదం నుంచి విముక్తి లభించే అవకాశం రానుంది.
మోడీ ఆలోచన.. ఇప్పటిది కాదు.! Article 370 Scrapped
ఎప్పటినుంచో జమ్మూకాశ్మీర్ విషయమై చర్చ జరుగుతోంది. చాలాకాలం క్రితం కూడా నరేంద్ర మోడీ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. అప్పుడాయన బీజేపీలో పెద్ద నేత కాదు. కానీ, ఇప్పుడు దేశం గర్వించదగ్గ నాయకుడిగా మారారాయన.
2014లో తొలిసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీకి, రాజ్యసభలో బలం లేకపోవడం పెద్ద మైనస్. 2019 ఎన్నికల్లో గెలిచి ఇంకోసారి అధికారంలోకి వచ్చాక, రాజ్యసభలో ఇలా బలం పుంజుకున్నారో లేదో, అలా జమ్మూకాశ్మీర్‌పై సంచలన నిర్ణయం (Article 370 Scrapped) తీసుకున్నారు. నాయకుడంటే ఇలా వుండాలి.. కాదు కాదు, నాయకుడంటే ఇలానే వుండాలి.!