Bheemla Nayak.. సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లానాయక్’ తప్పుకుంది.! తప్పుకుందా.? తప్పించేశారా.? రెండోదే కరెక్ట్.. తప్పించేశారు. ఔను, ‘భీమ్లానాయక్’ నిర్మాత నుంచి ప్రకటన రాకుండానే, ఆ సినిమాతో సంబంధం లేని కొందరు నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ గిల్ట్ పేరుతో ‘వాయిదా’ ప్రకటన చేసేశారు మరి.!
సరే, ‘భీమ్లానాయక్’ నిర్మాతతో చర్చించి, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపాక, సినిమా విడుదలపై ప్రకటన చేసి వుండొచ్చు. కానీ, అభిమానులు ఈ ప్రకటనని అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ‘సంక్రాంతి’కి ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగైదు సినిమాలొచ్చినా.. ప్రేక్షకులు అన్ని సినిమాల్నీ దాదాపు ఒకేలా ఆదరించే అవకాశముంటుంది. సంక్రాంతి సీజన్ అలాంటిది మరి.
Bheemla Nayak వర్సెస్ పాన్ ఇండియా సినిమాలు..
కానీ, రెండు పెద్ద సినిమాలు.. అందునా పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ తగులుతుందన్న కోణంలో ‘భీమ్లానాయక్’ సినిమాని వెనక్కి నెట్టేయాలనుకోవడమేంటి.? అంటే, తెరవెనుకాల పెద్ద ‘కుట్ర’ జరిగే వుంటుందన్న అనుమానాలు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వ్యక్తమయితే, అది తప్పెలా అవుతుంది.?

‘వకీల్ సాబ్’ సినిమాకి రాజకీయంగా కక్ష సాధింపులు చర్యలు ఎదురైతే, సినీ పరిశ్రమ తరఫున ఎవరూ గళం విప్పలేకపోయారు. సినిమా టిక్కెట్ల విషయంలో సినీ పరిశ్రమకు దెబ్బ తగులుతున్నా, పవన్ కళ్యాణ్ తప్ప, ఎవరూ గొంతు విప్పలేకపోయారు. మరి, ఆ పెద్ద మనుషులు ఇప్పుడెలా తమ అవసరాల కోసం పవన్ కళ్యాణ్‌ని ఒప్పించి, ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలను వాయిదా వేయించగలిగినట్లు.?
మరీ అంత మంచితనమైతే ఎలా పవన్ కళ్యాణ్.?
‘మరీ ఇంత మంచితనం అస్సలు పనికిరాదు. సంక్రాంతి సీజన్‌ని కాదని, ఆ తర్వాత.. ఫిబ్రవరి నెలాఖరున సినిమా వస్తే వసూళ్ళ పరంగా చాలా నష్టపోతాం..’ అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, వసూళ్ళ విషయంలో ఆందోళన చెందాల్సింది నిర్మాత. కానీ, ఆ నిర్మాత ఆవేదననూ పవన్ అభిమానులే అర్థం చేసుకుని, వాపోతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’పై ఈ రచ్చ ఇంకెన్నాళ్ళు.?
‘నేను చెయ్యగలిగిందేమీ లేదు. నన్ను క్షమించాలి, మాట ప్రకారం సినిమాని సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నందుకు..’ అని నిర్మాత సాక్షాత్తూ ప్రకటించాల్సి వచ్చిందంటే, ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) నిర్మాతపై ఎంత ఒత్తిడి వుండాలి.? మామూలు దెబ్బ కాదిది.. కసితీరా కొట్టిన దెబ్బ.!