Table of Contents
కొంచెం గ్యాప్ తీసుకుని అయినాసరే, ఈసారి సరైన హిట్టు కొట్టాలనే కసితో నితిన్ చేసిన సినిమా ‘భీష్మ’ (Bheeshma Movie Review). ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి.
అందివచ్చిన అద్భుతమైన ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుని డైరెక్టర్‌గా తన రేంజ్ పెంచుకోవాలనే కసితో ఈ సినిమాని చేశాడు దర్శకుడు వెంకీ కుడుముల. రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, హీరో నితిన్‌కి ఆశించిన హిట్టు అందించిందా.? అసలు సినిమాలో కథేంటి.? వివరాల్లోకి వెళ్ళిపోదామా మరి.!
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: నితిన్, రష్మిక, అనంత్ నాగ్, జిషుసేన్ గుప్తా, వెన్నె కిషోర్, నరేష్, సంపత్ రాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ, హెబ్బా పటేల్ తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
అసలు కథ..
హీరో తన సింగిల్ స్టేటస్‌ని చూసి ఆందోళన చెందుతుంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఓ పెద్ద సంస్థ బాధ్యతలు భుజాన పడ్తాయి మన హీరోకి. ఇంతకీ, ఆ అమ్మాయితో ప్రేమని శుభం కార్డుదాకా తీసుకెళ్ళాడా.? జాలీగా లైఫ్ గడిపేస్తోన్న మనోడికి, ‘ఆర్గానిక్ ఫార్మింగ్’ అనే సబ్జెక్ట్‌తో ఓ సంస్థని నిలబెట్టాల్సిన బాధ్యత ఎదురైతే, దాన్ని ఎలా డీల్ చేయగలిగాడు.? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలేంటి.? వాటిని హీరో ఎలా అధిగమించాడు.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే..
‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే‘ సినిమాల నుంచి నితిన్‌లో మంచి ఈజ్ వున్న నటుడ్ని చూస్తూనే వున్నాం. ఈ సినిమాలో నితిన్ ఇంకోసారి తన ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. వన్ మ్యాన్ షో.. అనడం చిన్న మాటే అవుతుందేమో. చాలా కాన్ఫిడెంట్‌గా తెరపై కన్పించాడు. కొంచెం ఎక్కువా చేయలేదు.. కొంచెం తక్కువా చేయలేదు. తన పాత్రకు ఎంత అవసరమో అంతే చేశాడు. పెర్‌ఫెక్ట్ బ్యాలెన్సింగ్. డాన్సులు అదరగొట్టేశాడు. ఈజ్‌తో చెలరేగిపోయాడు. రష్మికతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరగొట్టేశాడు.
కన్నడ బ్యూటీ రష్మిక మండన్న(Rashmika Mandanna) మరోమారు తన నాటీ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో కిర్రాకు పుట్టించేసింది. చిరుకోపం సహా అన్ని ఎమోషన్స్‌నీ సూపర్బ్‌గా పండించేసింది. నితిన్ సరసన రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా కుదిరింది. డాన్సుల్లో ‘వావ్’ అన్పించేసింది. చాలా కష్టమైన స్టెప్స్‌ని చాలా సింపుల్‌గా వేసేసి, ది¸యేటర్లలో విజిల్స్ రాబట్టింది ప్రేక్షకుల నుంచి.
విలన్ పాత్రలో విషుసేన్ గుప్తా స్టయిలిష్‌గా కన్పించాడు. పోలీస్ అధికారి పాత్రలో సంపత్ తన ట్రేడ్ మార్క్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ (Vennela Kishore) పండించిన కామెడీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. రఘుబాబుతో వెన్నెల కిషోర్ కాంబో బాగా వర్కవుట్ అయ్యింది. నరేష్, బ్రహ్మాజీ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం పని తీరు
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌లో సినిమాటోగ్రఫీ గురించి ముందు చెప్పుకోవాలి. సినిమా చాలా రిచ్‌గా కన్పించింది ప్రతి ఫ్రేమ్ లోనూ. ఆడియో, సినిమా విడుదలకు ముందే హిట్టయ్యింది. పాటలు తెరపై చూడ్డానికి కూడా చాలా చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఎడిటింగ్ కూడా షార్ప్‌గానే వుంది. డైలాగ్స్ పెర్‌ఫెక్ట్‌గా సెట్టయ్యాయి. ఓవరాల్‌గా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సూపర్బ్.
విశ్లేషణ
ఓ మామూలు స్టోరీని.. దర్శకుడు చాలా నీట్‌గా, కంపోజ్డ్‌గా తెరకెక్కించాడు. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగానే నటీనటుల నుంచి ఔట్‌పుట్ వచ్చింది. సాంకేతిక వర్గం కూడా బాగా కలిసొచ్చింది. ఇంట్రెస్టింగ్ డైలాగ్స్, అస్సలేమాత్రం కన్‌ఫ్యూజన్ లేని కథనం.. ఇలా అన్నీ బాగా కుదిరాయి.
హీరో నితిన్ పండించిన వాట్సాప్ కామెడీకి ది¸యేటర్లలో నవ్వులే నవ్వులు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకి రిపీట్ ఆడియన్స్‌కి ఆస్కారం కల్పించింది. మాటలు తక్కువ, ఇంపాక్ట్ ఎక్కువ అనేలా డైలాగ్స్ మాత్రమే కాదు, సన్నివేశాలు కూడా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా వుండడం సినిమాకి ప్లస్ పాయింట్. ఓ మంచి మెసేజ్‌ని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ఇచ్చేసిన దర్శకుడు వెంకీ కుడుములకి (Venky Kudumula) హేట్సాఫ్ చెప్పాల్సిందే.
ఫైనల్ టచ్:
ఆర్గానిక్ (Bheeshma Movie Review) ఎంటర్‌టైనర్.!