Chandrababu Pawan 15Years Friendship.. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారు.? ఎవరితో తెగతెంపులు చేసుకుంటారన్నది ముందే ఊహించలేం.!
రాజకీయం అంటేనే అంత.! రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు వుండరన్నది రాజకీయ పండితులు తరచూ చెప్పే మాట.!
అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి పదిహేనేళ్ళపాటు బలంగా వుండాలని పవన్ కళ్యాణ్ పదే పదే ఎలా చెప్పగలుగుతున్నారు.?
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం, కూటమి సఖ్యత పదిహేనేళ్ళపాటు వుండాలని చెబుతుండడం ఒకింత ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
Chandrababu Pawan 15Years Friendship.. చంద్రబాబు ట్రాక్ రికార్డ్..
ఏ రాజకీయ పార్టీతోనూ సుదీర్ఘకాలం పొత్తు కొనసాగించే అలవాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి లేదు. విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తీసుకున్నా ఈ విషయం స్పష్టమవుతుంది.
2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేశాయి. అయితే, జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు, 2019 ఎన్నికల దాకా కూడా కొనసాగలేదు.
మధ్యలోనే ఈ కూటమి ముక్కలయ్యింది. మళ్ళీ, 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ ఒక్కటయ్యాయి. ఈసారి జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగింది,
2019లో జనసేన, బహుజన్ సమాజ్ పార్టీతోనూ, వామపక్షాలతోనూ కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీడీపీ, బీజేపీకి కూడా చేదు ఫలితాలే వచ్చాయి.
రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా.?
నిజమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందంటే, ఆహ్వానించదగ్గ విషయమే. ఆ దిశగా, రాష్ట్ర అభివృద్ధి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.?
కాకపోతే, కడుపులో కత్తులు పెట్టుకుని మూడు పార్టీలూ పరస్పరం స్నేహ హస్తం అందించుకుంటున్నట్లు వ్యవహరిస్తేనే, కొంత ఇబ్బందికరంగా వుంటుంది చూసేవాళ్ళకి.
నిత్యం సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన శ్రేణుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. బీజేపీ – టీడీపీ సంగతి సరే సరి.!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బీజేపీ అధినాయకత్వం కూడా కూటమి ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకోవచ్చుగాక. కానీ, పరిస్థితులు అందుకు అనుకూలంగా వుంటాయా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
2029 ఎన్నికల నాటికి ఎవరి రాజకీయ అవసరాలు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం.! మరీ ముఖ్యంగా టీడీపీ – జనసేన పొత్తుని, టీడీపీలో కొందరు కుల జాడ్యంతో చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారాయె.
ఎలా చూసినా, టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలే కనిపించడంలేదు. ఒకవేళ కలిసి వుంటే మాత్రం, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనమే అవుతుంది.
