Table of Contents
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమా సంచలన విజయాన్ని అందుకుని, రామ్‌చరణ్‌ని 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చిన విషయం విదితమే. ఈ ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 100 కోట్ల ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘అరవింద సమేత’ సినిమా 100 కోట్లకు దగ్గరగా వచ్చింది. రాజమౌళి సంగతేంటి.? 100 కోట్లు అతనికి చిన్న విషయం. 1000 కోట్లు, ఆ పైన.. అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ‘బాహుబలి’ సాధించిన విజయం అలాంటిది.
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ జత కట్టిన ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది.. షూటింగ్ కూడా షురూ అయిపోయింది. నేడే సినిమా షూటింగ్ ప్రారంభమయినట్లు రాజమౌళి, సోషల్ మీడియాలో వెల్లడించాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. రాజమౌళి, ఎన్టీఆర్‌తో సినిమాలు చేశాడు, రామ్‌చరణ్‌తో సినిమా చేశాడు. కానీ, చరణ్ – ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారని ఎవరైనా అనుకున్నారా.? ఈ కాంబినేషన్‌ని కలిపిన ఘనత నిర్మాత డి.వి.వి. దానయ్యకే దక్కుతుంది.
500 – 1000 కోట్లు
‘బాహుబలి’ సినిమా 300 కోట్ల పైన వసూలు చేస్తుందని తొలుత అంచనాలు ఏర్పడటం చూశాం. తెలుగు సినిమాకి అంత సీన్ ఎక్కడిది.? అని తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే కొందరు అనుకున్నారు. కానీ, బాలీవుడ్ సినిమాల్ని కూడా తలదన్నేసింది ‘బాహుబలి ది కంక్లూజన్’. ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా ఏది.? అని ప్రశ్నిస్తే అది మన ‘బాహుబలి ది కంక్లూజన్’ అనీ, అది మన తెలుగు సినిమా అనీ, దాన్ని మన తెలుగు దర్శకుడు రూపొందించాడని ప్రతి తెలుగువాడూ గర్వంగా చెప్పుకుంటున్నాడు.
సో, రామ్‌చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది.? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఆకాశమే హద్దు’ అని చెప్పాలి. 500 కోట్లు, 600 కోట్లు అనే మాటలు చాలా చిన్నవే. చరణ్, ఎన్టీఆర్ మార్కెట్ కాదిక్కడ మాట్లాడుకోవాల్సింది రాజమౌళి మార్కెట్ గురించి. ఈ రోజే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.. బిజినెస్ అంచనాలూ ఇప్పుడూ మొదలయ్యాయి. అలా మొదలైన అంచనాలే 500 కోట్ల నుంచి 600 కోట్లదాకా వుంటే, సినిమా ఓ షేప్‌కి వస్తే, ఆ తర్వాత పరిస్థితి ఇంకెలా వుంటుందో!
అడ్వాంటేజ్ రామ్‌చరణ్‌కే ఎక్కువా.?
సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఫైట్ వేడిగానే జరుగుతోంది. చరణ్ – ఎన్టీఆర్ ‘బావా.. బావా..’ అని పిలుచుకుంటోన్నా, ఈ ఇద్దరు హీరోల అభిమానుల కొట్లాటలు, ఆరోపణలు, వెకిలి చేష్టలు మాత్రం తగ్గలేదు. చరణ్‌కి ‘రంగస్థలం’ సినిమా రూపంలో ఓ హిట్ వుంది. అది చరణ్‌కి ఖచ్చితంగా అడ్వాంటేజ్. అదే సమయంలో ‘అరవింద సమేత’ సినిమాతో యంగ్ టైగర్ కూడా 100 కోట్లకు దగ్గరకి వచ్చాడు. ఈ ఇద్దరు హీరోల మధ్యా ఎలాంటి బేషజాలూ లేవు. అభిమానులూ ‘మా హీరో ఎక్కువ’ అనే సిల్లీ ఫైట్ మానేస్తే మంచిది.
రాసుకున్నోళ్ళకి రాసుకున్నంత..
‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. హీరోయిన్లు ఎవరో తెలియలేదు. కానీ, గాసిప్స్ గుప్పుమంటూనే వున్నాయి. ‘రామ రావణ రాజ్యం’ అనీ, ఇంకోటనీ టైటిల్స్ విన్పిస్తున్నాయి. అదంతా ఉత్తదేనని దర్శకుడు రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య ఎప్పుడో చెప్పేశారు. హీరోయిన్ల విషయంలోనూ అంతే. కైరా అద్వానీ అట, బాలీవుడ్ నుంచి అలియా భట్‌ని తీసుకొస్తున్నారట, హాలీవుడ్ నుంచి ఓ ఇంగ్లీషు భామని ఈ సినిమా కోసం ఇంపోర్ట్ చేస్తున్నారట.. అనే వార్తలొస్తున్నాయి. వీటిపై కాస్తో కూస్తో స్పష్టతని ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ త్వరలోనే ఇస్తే మంచిదేమో. ఒక్కసారి ఫైనల్ అయితే దాచేదేమీ వుండదు. కానీ, అప్పటిదాకా గాసిప్స్ ప్రసహనం కూడా ఆగదు.