Table of Contents
Chiraiya Web Series Review.. దివ్య దత్త ప్రధాన పాత్రలో నటించిన ’చిరైయా‘ వెబ్ సిరీస్ గురించి, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
నిజానికి, సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ నడుస్తోంది ఈ వెబ్ సిరీస్ చుట్టూ. ట్రోలింగ్ అనడం కంటే, దీన్నొక రాజకీయ, సామాజిక వివాదంగా మార్చేశారనడం సబబేమో.!
మహిళ అనుమతి లేకుండా, భర్త అయినా సరే, ఆమెతో ‘కలయిక’ నేరం.. అన్న కోణంలో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు.
కట్టుబాట్ల పేరుతో, మహిళని వంటింటి కుందేలుగా మార్చేయకూడదన్నది ఈ వెబ్ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు.
గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. వస్తూనే వున్నాయి. వెబ్ సిరీస్‌ల సంగతి సరే సరి.! మరి, ఇందులో కొత్తగా చెప్పిందేంటీ.? నిజానికి, ఏమీ లేదు.!
Chiraiya Web Series Review.. ఆ రెండు పాత్రల చుట్టూ..
కాకపోతే, ‘ఎల్‌జీబీటీ’ తదితర అంశాలు అలా అలా టచ్ చేశారు. రెండు ప్రధాన పాత్రల చుట్టూనే కథ నడిచింది. కమలేష్ (దివ్యా దత్తా) పాత్ర ఒకటి కాగా, ఇంకొకటి ఆమె తోటికోడలు పూజా (ప్రసన్న బిష్త్).
పూజా భర్త అరుణ్ పాత్రలో సిద్దార్ధ షా నటించాడు. సంజయ్ మిత్రా, టిను ఆనంద్.. తదితరులు ఇతర ప్రధాన తారాగణం. కమలేష్ భర్తగా ఫైసల్ రషీద్ కనిపిస్తాడు.
నిజానికి, తెలుగు సినీ అభిమానులెవరికీ పైన చెప్పుకున్న నటీనటుల్లో ఎవరూ తెలియదు. కాకపోతే, కంటెంట్ ఓటీటీలో అందుబాటులో వుంది గనుక, ఆటోమేటిక్‌గా లుక్ అటు వెళ్ళిపోతుంది.. కాస్త తీరిక దొరికితే.
పైగా, సోషల్ మీడియాలో ‘చిరైయా’ చుట్టూ నడుస్తున్న వివాదం నేపథ్యంలో, ఇందులో ఏముందో చూడాలన్న ఆసక్తి సహజంగానే కలుగుతుంది ఎవరికైనా.
కథేంటంటే, కొత్తగా పెళ్ళయిన జంట.. భార్య అనుమతి లేకుండా, భర్త ఆమెతో శృం…గారంలో పాల్గొనడం. ఆ భయంకరమైన శృం..గారం పట్ల ఏహ్యభావంతో, భర్తపై పోరాటం చేసే భార్య.
మరిది అంటే, కొడుకు అనుకునే వదినకి, తోడి కోడలు పడుతున్న నరకయాతన తెలిశాక ఏం చేస్తుందన్నది మిగతా కథ.!
కమలేష్ పాత్రలో జీవించేసిన దివ్య దత్త..
కమలేష్ పాత్రలో దివ్య దత్త చాలా చాలా బాగా చేసింది. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనడం కరెక్టేమో. తెలుగు వెబ్ సిరీస్ కాకపోయినా, తెలుగులో డైలాగ్స్ చాలా బాగా రాశారు.
నటినటుల్లో అందరూ బాగా చేశారు. వెబ్ సిరీస్ కాబట్టి, అక్కడక్కడా సాగతీత అనిపించడం మామూలే. అయినాగానీ, గ్రిప్పింగ్‌గానే కథని ముందుకు నడిపించాడు దర్శకుడు.
వెబ్ సిరీస్‌కి అవసరమైనంత మేర ఖర్చు చేశారు నిర్మాతలు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగానే వుంది.
ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది..
అంతా బాగానే వుందిగానీ, వెబ్ సిరీస్‌లో ప్రస్తావించిన సామాజిక సమస్యని, అందరికీ ఆపాదించేసి.. మగాళ్ళంతా దొంగ నా డాష్ గాళ్ళే.. అని సోషల్ మీడియాలో ఓ వర్గం రచ్చ చేస్తుండడమే హాస్యాస్పదం.
అన్యోన్య దాంపత్యానికి అర్థం తెలియనివారు చేసే దుష్ప్రచారం మాత్రమే ఇది.
ఎక్కడో జరిగిన ఓ సంఘటన.. కొంతమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య.. ఆ సమస్యపై పోరాటం చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే వెబ్ సిరీస్ ఇది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Also Read: త్రిషకి ఫుల్ సపోర్ట్.! ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేస్తుందా.?
సినిమా లేదా వెబ్ సిరీస్.. వాటిల్లోని అంశాలు ఇన్‌స్పైరింగ్‌గా వుంటే మంచిదే. కానీ, కొన్ని సన్నివేశాల్ని పట్టుకుని, అందరికీ ఆపాదించేయడం హాస్యాస్పదం.
చివరగా.. ఓ మంచి ప్రయత్నం అయితే, ‘చిరైయా’ టీమ్ నుంచి జరిగింది.. అందుకు, టీమ్ మొత్తాన్నీ అభినందించి తీరాలి.
