Table of Contents
CJ Gawai Controversy.. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. అతనేమో ఓ న్యాయవాది.!
సర్వోన్నత న్యాయస్థానంలో, చీఫ్ జస్టిస్ మీద ఓ న్యాయవాది బూటు విసరడం ఎంత దారుణం.? తృటిలో, ఆ దాడి నుంచి సీజే గవాయ్ తప్పించుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.
అసలెందుకీ దాడి జరిగింది.? న్యాయవాది బూటు జారడానికి కారణమేంటి.? సంచలనం కోసమేనా ఈ దాడి.?
CJ Gawai Controversy.. విష్ణుమూర్తిపై సీజే గవాయ్ వ్యాఖ్యల నేపథ్యంలో..
కొద్ది రోజుల క్రితం, ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్, విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
‘ఆ విష్ణుమూర్తినే వేడుకో.. న్యాయం కోసం..’ అని అర్థం వచ్చేలా, గవాయ్ వ్యాఖ్యానించారన్నది అసలు వివాదం.! ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.

అయితే, తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయనీ, తాను అన్ని మతాల్నీ సమానంగా చూస్తాననీ సీజే గవాయ్ వివరణ ఇచ్చారు.
సీజే గవాయ్ వివరణతో ఈ వివాదం సద్దుమణిగిందని అనుకున్నారంతా.!
దాడి చేశాడు.. సమర్థించుకున్నాడు..
న్యాయవాది రాకేష్ కిషోర్, తాను చేసిన దాడిని సమర్థించుకున్నాడు. పైగా, అది దేవుడి చర్య.. అని రాకేష్ కిషోర్ చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సీజే గవాయ్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులూ, ఉప ముఖ్యమంత్రులూ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని పేర్కొన్నారు.
నిజమే, ప్రజాస్వామ్యంలో హింస, భౌతిక దాడులకు ఆస్కారం వుండకూడదు. దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రత కల్పించాలి చీఫ్ జస్టిస్ సహా, ఇతర న్యాయమూర్తులకి.
అదే సమయంలో, బాధ్యతగల స్థానాల్లో వున్నవారు సైతం, హుందాగా వ్యవహరించాలి.
ఇది సోషల్ మీడియా యుగం. వక్రీకరణలకు ఆస్కారం ఎక్కువ. వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించడం అంత తేలిక కాదు.!
ఏ వ్యాఖ్య ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి, అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న వ్యక్తులు.
ఆంధ్ర ప్రదేశ్‌లో అప్పుడలా..
కొన్నేళ్ళ క్రితం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వున్నప్పుడు, న్యాయస్థానాలపైనా అలానే న్యాయమూర్తులపైనా జరిగిన ‘మాటల దాడి’ అంతా ఇంతా కాదు.
వైసీపీకి అనుకూలంగా తీర్పులు రాకపోవడంతో, అది జీర్ణించుకోలేక, అసెంబ్లీ సాక్షిగా జుగుప్సాకరమైన చర్చకు అప్పటి అధికార పార్టీ తెరలేపింది.
ఇంకోపక్క, సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, న్యాయమూర్తులపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
తమపై జరుగుతున్న దాడిపై, న్యాయమూర్తులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం చూశాం.
అప్పట్లో ఆ జుగుప్సాకరమైన ప్రవర్తనపై నమోదైన కేసులకు సంబంధించి, ఎంతమందికి శిక్ష పడిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
చివరగా.. అత్యంత సున్నితమైన ‘మతం’ వంటి విషయాల్లో, ఎవరు ఎలాంటి తేలిక వ్యాఖ్యలు చేసినా, అది సమర్థనీయం కాదు.
