కరోనా వైరస్.. (Corona Virus Covid 19 Pandemic) ఇలాంటి ఓ వైరస్ పుట్టుకొస్తుందనీ.. ప్రపంచాన్ని స్తంభింపజేసేస్తుందనీ ఎవరూ ఊహించి వుండరు. 2020 నిజంగానే జనంతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడేస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతోంది.
కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంటే, మరికొన్ని దేశాలు ‘కరోనా’ అనే నరక కూపంలో కూరుకుపోతున్నాయి. ఇంతకీ, కరోనా వైరస్ సంగతేంటి.? ఎలా వ్యాపిస్తుంది.? ఎలా తగ్గుతుంది.? దీన్ని ఎలా అంతం చేయాలి.? వంటి విషయాలపై గందరగోళం మాత్రం అలాగే కొనసాగుతోంది.
‘కరోనా వైరస్ అనేది ఓ సీజనల్ వ్యాధిలా వచ్చి పోతుంటుంది..’ అన్నది ఓ తాజా అంచనా. అదే నిజమైతే, అంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటుండదు. కరోనా సోకిన వ్యక్తి నుంచి 6 అడుగుల లోపు దూరం వున్న సాధారణ వ్యక్తికి కరోనా సోకే అవకాశం ఎక్కువ.
మరి, గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఎంత.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలు. ఆహారం ద్వారా కరోనా సోకవచ్చా.? నీళ్ళ ద్వారా కరోనా సోకుతుందా.? ఇలా చాలా అనుమానాలున్నాయి. ఆయా ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు, భిన్నమైన సందర్భాల్లో వస్తున్నాయి.
ఎన్నాళ్ళు కరోనా వైరస్‌తో (Corona Virus) పోడాల్సి వస్తుంది.? అన్నదానిపైనా స్పష్టత లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు కరోనా మరణాలు మన దేశంలో బాగా తగ్గాయి. ఇది కాస్త ఉపశమనం. అలాగని పూర్తిగా సంబరపడిపోవడానికి వీల్లేదు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ‘సెకెండ్ వేవ్’ అనేది ముందే భయపెట్టేస్తోంది.
వ్యాక్సిన్ (Corona Virus Vaccine)ఇంకా అందుబాటులోకి రాలేదు.. ఎప్పుడొస్తుందో (Covid 19 Vaccine) తెలియదు. పోనీ, ఫలానా మందుతో కరోనా వైరస్‌కి ఖచ్చితమైన వైద్యం చేసే అవకాశముందా.? అంటే అదీ లేదాయె.
కరోనా వైరస్ చికిత్సలో అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్న రెమిడిసివిర్ ఔషధం పనితీరు కూడా అంతంతమాత్రమేననీ, దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి.
మరోపక్క, ప్లాస్మా థెరపీతో కూడా పెద్దగా ఉపయోగం లేదని ఇప్పటికే ఐసీఎంఆర్ స్పష్టం చేసేసింది. మరెలా కరోనా వైరస్‌పై (Corona Virus Covid 19) పోరాటం చేసేది.? ఈ ప్రశ్నకి సమాధానం మాత్రం ఇప్పట్లో దొరికేలా కనిపించడంలేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వైరస్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి.
‘అత్యాధునిక ప్రపంచంలో మనం వున్నాం..’ అని చెప్పుకుంటున్నాంగానీ, కంటికి కనిపించనంత ఓ చిన్న వైరస్, మానవాళిని వణికించేస్తోందంటే.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఏం సాధించినట్లు.? ‘వస్తుందీ.. పోతుందీ..’ అని సరిపెట్టుకోవడానికి వీల్లేనంత ప్రమాదకరమైన వైరస్ ఇది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసేసింది.. కరోనా మరణాల కంటే, కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయినవారు ఎక్కువన్న అంచనాలే నిజమైతే.. అంతకన్నా మానవాళికి అవమానం ఇంకేముంటుంది.?
