కరోనా వైరస్.. ప్రపపంచాన్ని వణికించేస్తోంది. ప్రపంచం సంగతి తర్వాత.. భారతదేశం కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందిప్పుడు కరోనా వైరస్ (Covid 19 Corona Virus Pandemic Culprits) కారణంగా. కరోనా వైరస్ మీద ఓ వైపు పోరాటం చేస్తూనే, ఇంకో వైపు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మానవ మృగాలతో పోరాడాల్సి వస్తోంది. ఎందుకీ పరిస్థితి.?
ఇంతకీ, మానవ మృగాలంటే ఎవరు.? ఇంకెవరు, కరోనా భయంతో విలవిల్లాడుతున్న సామాన్యుడ్ని దోచుకుంటున్న సాటి మానవుడే. కట్టె కాలాలంటే అదనపు ఖర్చు.. అంబులెన్స్ కావాలంటే అదనపు ఖర్చు.. మందుల కోసం అదనపు ఖర్చు.. ఆక్సిజన్ కోసం అదనపు ఖర్చు.. శవాల మీద పైసలేరుకునే దుస్థితికి కారణమవుతున్నోళ్ళంతా మృగాలతో సమానమే.
నర రూప రాక్షసులు.. మానవ మృగాలు.. ఇలాంటివన్నీ చాలా చిన్న మాటలే అవుతాయేమో. ఆసుపత్రుల దగ్గరే ‘బ్లాక్’లో రెమిడిసివిర్ తదితర మందుల్ని అమ్మేవారిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అని డిమాండ్ – సప్లయ్ సూత్రాన్ని అమలు చేస్తే, రేప్పొద్దున్న వాళ్ళకి కరోనా వచ్చి, ప్రాణాలు కోల్పోతేనో.? డబ్బుని వెంటేసుకుని స్మశానానికి వెళ్ళే అవకాశం వుండదు కదా.?
Also Read: సెకెండ్ వేవ్: నో మాస్క్! కరోనా వైరస్‌కి వెల్‌కమ్.!
‘అంత్యక్రియలు మేమే చేస్తాం.. దాన్ని వీడియోలో చిత్రీకరించి లైవ్ టెలికాస్ట్ ఇస్తాం..’ అంటూ ప్యాకేజీలు మాట్లాడుతున్నారు కొందరు. ఒక్కసారి ఆ శవం స్థానంలో తాముంటే ఎలా వుంటుందో ఒక్కసారి సదరు మానవ మృగాలు ఆలోచించుకుంటే బావుంటుంది. అలాంటి ఆలోచనే వారికి వస్తే, ఇంతటి నీఛమైన స్థాయికి ఎలా దిగజారిపోగలరు.?
సోషల్ మీడియా వేదికగా (Ap Fights Corona Telangana Fights Corona India Fights Corona) వందలాది మంది.. వేలాది మంది.. లక్షలాది మంది.. సాటి మనిషికి సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. రక్తదానం చేయడానికి సిద్ధమంటున్నారు, చేస్తున్నారు. ప్లాస్మా ఇవ్వడానికీ ముందుకొస్తున్నారు.
ఒకవేళ తాము సాయం చేసే పరిస్థితుల్లో లేకపోతే, ఫలానా చోట సాయం దొరుకుతుందంటూ తగిన సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఒక డాక్టర్.. తన ప్రాణాలకు తెగించి ప్రాణం పోస్తున్నాడు.. పోలీస్, పారిశుధ్య కార్మికులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది.. ఇలా చెప్పుకుంటూ సమాజంలో చాలా విభాగాలకు చెందిన చాలామంది వ్యక్తులు మానవత్వంతో పనిచేస్తున్నారు.
నిజానికి, సమాజంలో చీడపురుగులు తక్కువే. కానీ, పచ్చని పంటని నాశనం చేయడానికి ఆ కొన్ని చీడపురుగులు చాలు. కరోనా వైరస్ వల్ల చనిపోతున్నవారికంటే, మానవ మృగాల అత్యాశే, చాలామంది ప్రాణాల్ని తీసేస్తోంది. అందుకేనేమో, ఆక్సిజన్ రవాణాకి ఎవరన్నా అడ్డం తగిలితే, ఉరిశిక్ష వేస్తామని న్యాయస్థానం హెచ్చరించాల్సి వచ్చింది.
ఆక్సిజన్ సరఫరాని అడ్డుకునేవాళ్ళనే కాదు, అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రుల యాజమాన్యాలకీ ‘బ్లాక్ మార్కెట్’ మందులు అందుతున్నవారినీ.. నరరూపరాక్షసులుగా భావించి (Covid 19 Corona Virus Pandemic Culprits), కలుపు మొక్కల్లా వారిని గుర్తించి.. వాళ్ళ నుంచి సామాన్యుల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.