కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాక్సిన్‌పై ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. 2019 చివర్లో ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా చుట్టేసింది. మాతృభూమి మీద మమకారంతో, చైనాని తక్కువ నష్టంతో వదిలేసిందేమోగానీ, ఇతర దేశాల మీద మాత్రం అత్యంత పాశవికంగా పడగ విప్పుతోంది కరోనా వైరస్ (Covid 19 Corona Virus Vaccine).
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడుతున్నారు. లక్షలాది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. అయితే, గతంతో పోల్చితే.. మరణాల రేటు క్రమంగా తగ్గుతుండడం కాస్త ఊరట.
కరోనా వైరస్‌కి ఖచ్చితమైన చికిత్స లేకపోయినా, అందుబాటులో వున్న మందులతో వైద్య చికిత్స అందించగలుగుతున్నారు. అలా చాలామంది ఇప్పటికే కోలుకున్నారు కూడా. కానీ, కరోనా నుంచి పూర్తి ఉపశమనం పొందాలంటే వ్యాక్సిన్ రావాల్సిందే. అయితే, అదెప్పుడు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ ప్రచారం జరిగింది. వ్యాక్సిన్ మాత్రం రాలేదు. ఆగస్ట్ 15 నాటికి భారతదేశంలో వ్యాక్సిన్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సాక్షాత్తూ ఐసీఎంఆర్ కూడా ప్రకటించింది. మళ్ళీ అదే సీన్ రిపీటయ్యింది.. వాక్సిన్ అంత తేలికైన వ్యవహారం కాదని తేలిపోయింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, నవంబర్ 1 నాటికి వ్యాక్సిన్ (Covid 19 Corona Virus Vaccine) వచ్చేస్తుందని చెబుతుండగా, రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేశామంటూ తమ దేశంలో కోట్లాది మందికి వ్యాక్సిన్‌ని అందించేందుకు ఏర్పాట్లు చేసేసుకుంది. చైనా కూడా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో వున్నామని చెప్పుకుంటోంది.
ప్రయోగాలు జరుగుతున్నాయి.. కొన్ని వ్యాక్సిన్లు వివిద దశల్లో పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. కానీ, ఏం లాభం.? కరోనా వైరస్‌కి ఇదీ వ్యాక్సిన్.. అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది చివరి నాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాదన్నది తాజా నివేదికల సారాంశం.
2021 ప్రథమార్థం ముగిసేనాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది ఆశ్చర్యపోవాల్సిన అంశమేనంటూ తాజాగా మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ సక్సెస్ అవడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ప్రయోగాల్లో చాలా దశలుంటాయి. ఒక్కో దశా అత్యంత కీలకమైనదే.
ఏ దశలో పొరపాట్లు తలెత్తినా అంతే సంగతులు. పైగా, కరోనా వైరస్‌కి సంబంధించిన వ్యాక్సిన్ కోట్లాది మందికి ఇవ్వాల్సి వుంటుంది. అలాంటప్పుడు, దాన్నెంత పక్కాగా తయారు చేయాలి.? ఇదే అసలు సమస్య.
ఈలోగా, కరోనా వైరస్‌కి (Covid 19 Corona Virus Vaccine) అందుబాటులో వున్న చికిత్స బాగానే పనిచేస్తోంది గనుక.. ముందు ముందు కరోనా వైరస్ కూడా సాధారణ జలుబు స్థాయికి తన తీవ్రతను తగ్గించుకునే పరిస్థితులు కనిపిస్తున్న దరిమిలా.. వాక్సిన్ వచ్చేలోపే.. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిద్దాం.