Table of Contents
Dhanush Idly Kottu Review.. హీరో ఎంత మంచోడంటే, ‘ఇడ్లీ కొట్టు’ హీరో మురుగన్ అలియాస్ మురళీ కంటే, మంచోడు.. ఈ భూ ప్రపంచమ్మీద ఇంకెవరూ వుండరు.!
ధనుష్ స్వయంగా రాసి, తీసి, నటించిన సినిమా ‘ఇడ్లీ కొట్టు’. తమిళంలో ‘ఇడ్లీ కడాయ్’ పేరుతో విడుదలైంది. తెలుగులోకి ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో డబ్ అయ్యింది.
నిత్యా మీనన్, సత్యరాజ్, షాలిని పాండే, అరుణ్ విజయ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.!
ధనుష్ మల్టీ టాలెంటెడ్.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ టాలెంట్‌తోనే కథ రాసేసుకున్నాడు, దర్శకత్వం వహించేశాడు.. నటించేశాడు కూడా.!
మొన్నామధ్య కార్తీ సినిమా ఒకటొచ్చింది. అందులో, కార్తీ చాలా మంచోడు. అంతకన్నా మంచోడు, ఈ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలో హీరో.!
Dhanush Idly Kottu Review.. ఇదేం మంచితనం మహాప్రభో.!
బాబోయ్ మంచితనం.. ఇది మామూలు మంచితనం కాదు, ఇది వేరే లెవల్ అంతే. విదేశాల్లో బాగా డబ్బులు సంపాదిస్తాడు. గొప్పింటి సంబంధమూ కుదురుతుంది.
కానీ, సొంతూరుకి వస్తాడు.. తండ్రి మరణ వార్తతో. తల్లి కూడా చనిపోతుంది. తల్లి, తండ్రి కలిసి నిర్వహించిన, ఇడ్లీ కొట్టు బాధ్యతలు తీసుకుంటాడు హీరో మురుగన్ అలియాస్ మురళి.

అక్కడే, అతనికి హీరోయిన్ సాయపడుతుంది. చిన్నప్పటినుంచీ హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ అన్నమాట. మరి, విదేశాల్లో లవర్ సంగతేంటి.?
ఆమె ఎవరో కాదు షాలినీ పాండే. ఆమె కూడా సినిమా చివరి వరకూ వుంటుంది. అరుణ్ విజయ్ విలన్. అతని తండ్రి సత్యరాజ్.
కొడుకు మీద విపరీతమైన ప్రేమ సత్యరాజ్‌కి. అరుణ్ విజయ్‌కి అహంకారం. ఆ అహంకారంతోనే, హీరో మురళి మీద పగబట్టేస్తాడు.
చివరికి కథ సుఖాంతమవుతుందనుకోండి.. అది వేరే సంగతి.! మురళి తన మంచితనంతో, ఊరి ప్రజల మనసుల్ని, అలాగే విలన్ మనసుల్ని గెలుచుకోవడమే అసలు కథ.
భరించలేనంత మంచితనం.!
వామ్మో, ఇంత మంచితనాన్ని భరించగలమా.? భరించాల్సిందే తప్పదు.! దఫ దఫాలుగా సినిమా చూడాల్సి వచ్చింది ఓటీటీలో. అంత మంచితనాన్ని మనం భరించలేం కదా.!
ధనుష్ మంచోడిలా నటించాడు. అరుణ్ విజయ్ చెడ్డోడిగా నటించాడు. హీరో స్నేహితురాలిగా నిత్యామీనన్ నటించింది. సత్యరాజ్ కూడా, చెడ్డోడి తండ్రిలా నటించాడు.

మంచోడికి కాబోయే భార్యగా షాలిని పాండే కూడా నటించింది. అందరూ నటించారంతే. ఏ పాత్ర కూడా మనకి కనెక్ట్ కాదు.!
పాత చింతకాయ్ కథ మరి.! ఆ ఇడ్లీ కొట్టు సెంటిమెంట్ ఎవరికి మాత్రం కనెక్ట్ అవుతుంది.? అన్నట్టు సముద్రఖని కూడా వున్నాడు సినిమాలో. అతనూ నటించాడంతే.
సినిమాటోగ్రఫీ బానే వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే.! అయితే దారుణాలు.. లేకపోతే, అతి మంచితనం.. సినిమా అంటే ఇంతేనా.? ఇంతేనేమో.!
చేత్తో పిండి రుబ్బితేనే ఇడ్లీ రుచి..
ఇంత మంచితనం చూశాక, నిద్రపట్టడం కష్టమే.! చేతితో పిండి రుబ్బి తయారు చేసిన ఇడ్లీ రుచి గురించి ఈ రోజుల్లో ఎవరైనా ఆలోచిస్తారా.? ఛాన్సే లేదు.
అలానే, ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలోని ‘అతి మంచితనం’ కూడా, అస్సలు కనెక్ట్ అయ్యే అవకాశముండదు. ఆ ఇడ్లీ కొట్టుని తగలెట్టే పని ఏదో, ముందే చెడ్డోడు అరుణ్ విజయ్ చేసేసి వుంటే బావుండేదేమో.!
Also Read: విశాఖపైనా, గూగుల్‌పైనా విషం చిమ్ముతున్న వైసీపీ.!
రాసింది ధనుష్ కదా, అలా ఎలా అరుణ్ విజయ్ తగలెట్టేస్తాడు ఇడ్లీ కొట్టుని.? అందరూ కలిసి, ప్రేక్షకుల సమయాన్ని తగలెట్టేశారంతే.!
ఓటీటీలో అప్పనంగా వచ్చింది కదా.. అని చూడటం మొదలెట్టి, పూర్తి చెయ్యాలనుకునేరు.. కాలం ఖర్సయిపోతుంది జర జాగ్రత్త.!
