Table of Contents
Ear Jewelry Fashion Trends.. ఫ్యాషన్.. ఫ్యాషన్.. దీంట్లో భాగంగా ముఖ్యంగా అమ్మాయిలు అనేక రకాల యాక్సెసరీస్ వాడుతుంటారు. నయా నాగరికతలో భారీ చెవి కమ్మలకు భారీగానే డిమాండ్ వుంది.
ఒకప్పుడు కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే ఈ భారీ చెవి కమ్మలను ధరిస్తుండేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.
పెళ్లిళ్లూ, ఫంక్షన్లే కాదండోయ్.. రోజువారీ రియల్ లైఫ్‌లోనూ అమ్మాయిలు.. ఆ మాటకొస్తే.. చాలా మంది మహిళలు తమ తమ అభిరుచులకు తగ్గట్లుగా అవసరాలకు తగినట్లుగా భారీ భారీ చెవి కమ్మలు ధరిస్తున్నారు.
Ear Jewelry Fashion Trends.. కొంచెం కష్టమైనా ఇష్టంగా ధరించేయాల్సిందే.!
మ్యాచింగ్ చెవి కమ్మలు.. పూసలు పొదిగినవి.. రాళ్లు పొదిగినవి.. బంగారు ఇతరత్రా మెటల్ కోటింగ్ ఇలా రకరకాల చెవి కమ్మలకు మార్కెట్లో బోలెడంత డిమాండ్ వుంది.
రాళ్లు, రత్నాలే కాదండోయ్.. ఆకులు, పువ్వులు, పాములు, పక్షులూ, గుళ్లూ గోపురాలూ (టెంపుల్ డిజైన్స్), దేవుళ్లూ.. ఇలా కాదేదీ చెవి పోగుల డిజైన్‌కనర్హం.

ఆ స్థాయిలో అనేక రకాల డిజైనర్ చెవి కమ్మలు మార్కెట్లో ఎప్పటి కప్పుడు కొత్తగా సరికొత్తగా కనువిందు చేస్తూనే వుంటాయ్.
అయితే, కనిపించేదంతా బంగారం కాదండోయ్. అయినా కనిపించేంత బంగారం కొనాలంటే ఈ రోజుల్లో అంత వీజీ కూడా కాదులెండి. బంగారం రేటు అలా భయపెట్టేస్తోంది అది వేరే సంగతి.

అసలు భారీ కమ్మల విషయానికి వస్తే.. ముద్దుగుమ్మల మోమును మరింత ముద్దుగా అందంగా మార్చేస్తాయ్ చెవి కమ్మలు.
అందుకే అంత ఇష్టంగా.. బరువైనా కాస్త కష్టంగా భరించేస్తుంటారు చెవి కమ్మలను చక్కనమ్మలు. మరి, ఈ భారీ చెవి కమ్మల బరువును చెవులు తట్టుకోవడమెలా.?
అందుకే కొంత మందిలో బరువు తట్టుకోలేక చెవి కమ్మల రంధ్రాలు సాగిపోతుంటాయ్. అలాగే అన్ని రకాల స్కిన్ టోన్స్‌కీ అన్ని రకాల మెటల్స్ చెవి పోగులు పడకపోవచ్చు.
సమస్యలూ ఎక్కువే సుమీ.!
రకరకాల ఇన్‌ఫెక్షన్లు.. ఇతరత్రా సమస్యలు తలెత్తవచ్చు. మరి ఆ సమస్యల్ని అధిగమించి భారీ చెవి పోగులతో అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి.? జస్ట్ చిన్న చిన్న జాగ్రత్లు పాటిస్తే సరిపోతుందంతే.
రెండు లేదా మూడు గ్రాముల బరువున్న చెవి పోగుల్ని రోజూ ధరించుకోవచ్చు. అంతకు మించి బరువైన కమ్మలను రోజులో కొన్ని గంటలు మాత్రమే ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పూట బరువైన చెవి కమ్మలను తీసేయాలి. అంతేకాదు కొన్ని రకాల మెటల్ మెటీరియల్స్ స్కిన్ టోన్‌కి హాని కలిగించొచ్చు. అందుకే వాటిని తొలగించిన తర్వాత ఉప్పు నీటితో చెవి రంధ్రాలను శుభ్రం చేస్తే మంచిది.
కొంత మందిలో భారీ చెవి కమ్మలు ధరించడం వల్ల చెవి నొప్పి, దురద, చెవి రంధ్రాలు పుండ్లు పడడం.. వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వారు వెంటనే వాటిని ధరించడం మానేయాలి.
జస్ట్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే..
కొందరిలో అయితే, చెవి నొప్పితో పాటూ, మెడ నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, పరిమితమైన సమయం మాత్రమే వీటిని ధరించడం వల్ల పెద్దగా సమస్యలుండవ్. లేదంటే, ఇబ్బందులు తప్పవు.

భారీ చెవి కమ్మలు ధరించేటప్పుడు చెవి గొలుసులను కూడా వేసుకోవడం వల్ల చెవి రంధ్రం పైన కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా కొన్ని సమస్యలు నివారించుకోవచ్చు.
ఏది ఏమైనా బంగారం కొనడం కష్టమైన ఈ రోజుల్లో.. తప్పదు ఇమిటేషన్ జ్యూయలరీ ధరించాల్సిందే నలుగురిలో అందంగా ప్రత్యేకంగా కనిపించాలంటే.

సో, ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించి ధరిస్తే.. సమస్యలను నివారించుకోవచ్చు. అందంగా మెరిసిపోవచ్చు.
అలాగని సమస్య తీవ్రతరమైతే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇంటి చిట్కాలతో సరిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సిందే. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
