Ediraa Nee Baalyam.. అసలు బాల్యం అంటే ఏంటి.? తొమ్మిది నెలలు తమ బిడ్డని కడుపులో మోసేందుకు కొందరు తల్లులు సంసిద్ధత వ్యక్తం చేయని రోజులివి.!
సరోగసీనో, ఇంకొకటో.. ఎలాగోలా ‘తల్లిదండ్రులం’ అనిపించేసుకోవాలనే తాపత్రయం చాలామందిలో కనిపిస్తోందిప్పుడు.!
పుట్టాక, పిల్లలకి తమ పాలు పడితే, తమ అందం చెడిపోతుందన్న భావనలో కొందరు మహిళామణులున్నారు.
ఏడాది వయసు రాకముందే, జైళ్ళ లాంటి ‘బేబీ కేర్’ సెంటర్లలో పడేసి, ఒకటో తరగతి నుంచే హాస్టళ్ళకు పరిమితం చేసేసి.. ఇలా నడుస్తోంది వ్యవహారం.
బాల్యమా.? అదెక్కడ.! అసలు బాల్యం అంటే ఏంటో, డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల.. ఇదిగో ఇలా చెబుతున్నారు.!
Ediraa Nee Baalyam.. ఏదిరా నీ బాల్యం.?
చిడతా బిళ్ల ఆడటానికి నీకు రాదు,
టెన్నిస్ ఆడటానికి నీకు కోర్టు లేదు,
ఏదిరా నీ బాల్యం?
సెనగుండలు చెయ్యటానికి మీ అమ్మకి సమయం లేదు,
పోనీ జంకుఫుడ్డు తిందామంటే అందులో కొవ్వు తప్ప ఇనుములేదు,
ఏదిరా నీ బాల్యం?
సాయంకాలాలు దాగుడుమూతలు ఆడేటప్పుడు,
నీతో పాటు అందరూ ట్యూషన్లో దాక్కున్నారు,
ఏదిరా నీ బాల్యం?
పోనీ ఏదో ప్రొటీన్ తిని పెరుగుతావంటే,
ఒకడేమో గుడ్డు పెట్టడు, ఇంకోడు పెట్టింది కుళ్లిపోతుంది.
ఏదిరా నీ బాల్యం?

ఒకడేమో మాతృభాషలో చెప్పాలంటాడు,
ఇంకోడు ఇంకేదో భాష కూడెదుతుంది అంటాడు,
నీకెలా చెప్తే నువ్వు తెలుసుకుంటావో వాళ్ళకి తెలీదు.
ఏదిరా నీ బాల్యం?
నిన్నేమో చదవమని మీ నాన్న సెల్లు పట్టుకుంటాడు,
నువ్వేమో నీ ఊహల్ని కట్టిపెట్టి పుస్తకాన్ని బట్టీపడతావు,
ఏదిరా నీ బాల్యం?
నువ్వు చూసేవన్నీ బూతే,
నీకుండాల్సింది నీతి అంటారు,
మధ్యలో అయోమయం నీ మతి.
ఏదిరా నీ బాల్యం?
ఇంట్లోవాడో, బడిలోవాడో నీకు రక్ష అనుకుంటావు,
వాడేమో నీకేదో ఆశపెట్టో, భయపెట్టో నీ మానాన్ని భక్షిస్తాడు.
ఏదిరా నీ బాల్యం?
పానిపట్టు యుద్ధం అంటే 1761 అని ఠక్కున చెప్తావు,
పనీపాట నేర్పే చదువు మాత్రం పదిహేడేళ్లైనా నేర్వలేదు,
ఏదిరా నీ బాల్యం?
భాజనీయతా సూత్రాలు వాడి ఎంత పెద్ద సంఖ్యకైనా కారణంకాలు పట్టేస్తావు,
కానీ మనసు భారమైతే దానికేది కారణమో తెలిసినా పట్టలేవు, బయటపెట్టలేవు.
ఏదిరా నీ బాల్యం?
పక్కింటి పుల్లయ్య కొడుక్కి సైన్సులో మారులెక్కువ అని బాధపడతావు,
నీకున్న నేస్తాలు, వాడికిలేరన్న సెన్సు లేదు నీకు,
ఏదిరా నే బాల్యం?
నువ్వేదో ఆడతావు, పాడతావు
అది చూసి ఒకసారి నవ్వేవారే కానీ,
ఒరేయ్ బాగుందిరా అని భుజం తట్టేవాళ్లు లేరు,
ఏదిరా నీ బాల్యం?
నీకేదో అర్థం కాకో, నువ్వేదో అన్వేషించాలనో
మాష్టార్నో ప్రశ్న వేస్తావు,
జవాబు తెలీని అతను, నిన్నో ప్రశ్నవేసి చదవట్లేదని వీపు చీరేస్తాడు.
ఏదిరా నీ బాల్యం?
సైన్సులో సూత్రాలు, చరిత్రలో తేదీలు,
భాషలో సంధులు, లెక్కల్లో ఎక్కాలు
రెండ్రోజుల్లో ఆవిరవుతాయని తెలిసినా
పైకెత్తి, పైకెత్తి నెత్తిమీద పెట్టుకుంటావు,
ఈలోపు నేస్తాలతో గురుతులు పోగేసుకోడం
మర్చిపోతావు, వెనక్కి చూస్తే శూన్యం నిండిన గతంతో మిగిలిపోతావు.
ఏదిరా నీ బాల్యం?
నువ్వేమైపోతావో అని వాళ్ల బెంగ,
నీవల్ల వాళ్లేమైపోతారో అని నీ బెంగ,
అన్ని బెంగలూ నీలో దాచుకుని,
కోచింగుల్లోఒంగొని, తలని ఎత్తక, ఎందుకని అడక్క
అందర్లో అందికిరాని అనామకుడివైపోతావు.
ఏదిరా నీ బాల్యం?
ఏదిరా నీ బాల్యం?
– డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల
మనసుతో చదవండి: ఓసారి చదివితే సరిపోదు.. ఒకటికి పదిసార్లు చదవాల్సిన ముఖ్యమైన విషయమిది.! మనసుతో చదివితే, మన బాల్యం మనకి గుర్తుకొస్తుంది.
అలాగే, మన మనసుల్ని కదిలించిన ఈ గొప్ప విషయాన్ని, మన పిల్లల మనసులకు చేరేలా చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే.